panama papers scandal
-
పనామా పేపర్స్ కేసులో ఈడీ ముందుకు ఐశ్వర్యా రాయ్
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆదేశాల మేరకు సోమవారం ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దాదాపు ఆరు గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. విదేశాలకు నిధుల మళ్లింపునకు సబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ 2016–17 నుంచి దర్యాప్తు చేస్తోంది. 2004లో ఆర్బీఐ సరళీకరించిన విదేశీ పెట్టుబడుల పథకం(ఎల్ఆర్ఎస్), ఫెమా చట్టాలను ఉల్లంఘించి 2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లో ఆమె తల్లిదండ్రులతో కలసి అమిక్ పార్ట్నర్స్ సంస్థను నెలకొల్పారని, దీనిపై బచ్చన్ కుటుంబం వివరణ ఇవ్వాలని ఈడీ గతంలోనే నోటీసులిచ్చింది. ఈ విషయంలో ఐశ్వర్యకు సమన్లు జారీచేయగా తనకు మరికొంత సమయం కావాలని ఆమె గతంలో రెండుసార్లు విన్నవించుకున్నారు. సోమవారం ఐశ్వర్యను ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పన్నుల బాదరబందీలేని, పెట్టుబడులకు స్వర్గధామంగా భావించే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో అనేక దేశాలకు చెందిన సంపన్నులు, నేతలు, సెలబ్రిటీలు రహస్య పెట్టుబడులు పెట్టారని, తద్వారా సొంత దేశాలకు భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. పనామాకు చెందిన ఆర్థిక, కార్పోరేట్ సేవల సంస్థ మొసాక్ ఫోన్సెకా ద్వారా వీరంతా పెట్టిన పెట్టుబడులు, ఎగ్గొట్టిన పన్నుల సమగ్ర వివరాలను వాషింగ్టన్కు చెందిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే).. పనామా పేపర్స్ పేరిట విడుదల చేసి ప్రకంపనలు సృష్టించిన సంగతి తెల్సిందే. దాదాపు 1.15 కోట్ల డాక్యుమెంట్లతో 2016 ఏడాదిలో వెలుగుచూసిన ఈ ఉదంతంలో భారతీయులకు చెందిన 426 ఆర్థిక ఉల్లంఘనల కేసులూ బయటపడ్డాయి. వాటిలో ఐశ్వర్య డైరెక్టర్‌గా ఉన్న సంస్థా ఉంది. 2009లో ఐశ్వర్య ఆ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఆమె మామ అమితాబ్ బచ్చన్‌నూ ఈడీ ప్రశ్నించింది. పెట్టుబడులన్నీ భారతీయ చట్టాలకు లోబడే జరిగాయని ఆయన గతంలో వివరణ ఇచ్చారు. మీకు గడ్డుకాలం మొదలవుతుంది రాజ్యసభలో బీజేపీ ఎంపీలకు జయా బచ్చన్ శాపం సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, బీజేపీ సభ్యులకు మధ్య సోమవారం రాజ్యసభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎన్డీపీఎస్ (సవరణ) బిల్లుపై జయ మాట్లాడుతూ... 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా కూడా గతంలో వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారేనన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా తనపై వ్యక్తిగత కామెంట్లు చేశారని జయ ఆరోపించారు. ఒకదశలో సహనం కోల్పోయిన ఆమె బీజేపీ ఎంపీలను ఉద్దేశిస్తూ ‘మీకు త్వరలోనే గడ్డుకాలం మొదలవుతుంది. ఇదే నా శాపం’ అని ఆగ్రహించారు. కోడలు ఐశ్వర్య ఈడీ విచారణకు హాజరైన రోజే.. ఇది చోటుచేసుకోవడం గమనార్హం. ‘సభలో నాపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. నా పైనా, నా కెరీర్ పైనా వ్యాఖ్యలు చేశారు. ఇది దురదృష్టకరం. వారలా మాట్లాడాల్సింది కాదు. మీరు సదరు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి. సభాపతి స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీరు ఏ పార్టీకి చెందిన వారు కాదు సార్. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’ అని భువనేశ్వర్ కలితాను ఉద్దేశించి జయాబచ్చన్ అన్నారు. తర్వాత కూడా అధికార, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో రాజ్యసభ వాయిదా పడింది. వీటికి మీ సమాధానమేంటి ? 1. 2005లో అమిక్ పార్ట్నర్స్ పేరిట నెలకొల్పిన కంపెనీతో మీకున్న సంబంధాలేంటి? 2. కంపెనీ తొలినాళ్లలో మీరు, మీ తండ్రి కె.రమణ కృష్ణ రాయ్, తల్లి కవిత, సోదరుడు ఆదిత్య తలా 12,500 డాలర్లు మొత్తంగా 50వేల డాలర్ల ప్రారంభ పెట్టుబడులు పెట్టారు. ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఎందుకున్నారు? 3. 2005 జూన్‌లో డైరెక్టర్ నుంచి షేర్‌హోల్డర్‌గా ఎందుకు మారారు? 4. 2008 నుంచి సంస్థ ఎందుకు క్రియాశీలకంగా లేదు? 5. ఆర్థిక లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతుల వివరాలు చెప్పండి? 6. మీ సంస్థను మొసాక్ ఫోన్సెకాయే రిజిస్టర్ చేసిందని మీకు తెలుసా? -
వ్యక్తిగత విమర్శలు.. శాపనార్థాలు పెట్టిన జయా బచ్చన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగతున్నాయి. పలు కీలక అంశాలపై విపక్షాలు.. అధికార పార్టీని.. ఇరుకున పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ వేదికగా శాపనార్థాలు పెట్టారు. ఓ ఎంపీ జయా బచ్చన్‌ను ఉద్దేశించి.. వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. సహనం కోల్పోయిన జయా బచ్చన్.. సదరు ఎంపీని శపించారు. ఆ వివరాలు.. మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సమయంలో జయా బచ్చన్ ఎవరిని టార్గెట్ చేసి.. విమర్శించలేదు కానీ.. ట్రెజరీ బెంచీలపై ఆరోపణలు చేశారు. అంతేకాక అధికారంలో ఉన్న వారు విపక్షాల వాదనలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ) ఈ సందర్భంగా భువనేశ్వర్ కల్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మీరు న్యాయంగా ఉండాలి. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. మీ నుంచి మేం ఏం ఆశిస్తాం.. సభలో ఏం జరుగుతుందో చూస్తున్నారా.. మనం చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఓ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. దానిలో ఉన్న లోటుపాట్లను మనం చర్చించి.. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేయాలి’’ అంటూ జయా బచ్చన్ ప్రసంగించసాగారు. (చదవండి: మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ) జయా బచ్చన్ ఇలా మాట్లాడుతుండగా.. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా.. ఆమె కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించి.. ఆరోపణలు చేశారు. పనామా పేపర్స్ వ్యవహారంలో జయా బచ్చన్ కోడలు.. ఐశ్వర్య రాయ్ ఈడీ విచారణకు హాజరైన సంఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన జయా బచ్చన్.. ‘‘త్వరలోనే మీ జీవితంలోకి దుర్దినాలు రాబోతున్నాయి. మీకిదే నా శాపం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. చదవండి: సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి -
‘నేను దొంగను కాదు.. తిరిగి వస్తా’
ఇస్లామాబాద్ : పనామా పేపర్స్ కుంభకోణం కేసులో పదేళ్లు జైలు శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీర్పు అనంతరం తొలిసారి స్పందించారు. తాను తప్పించుకొవాడానికి దొంగను కానని, శిక్షను ఎదుర్కొవడానికి పాక్ తప్పనిసరి వస్తానని తెలిపారు. పనామా పేపర్స్ కేసులో షరీఫ్, అతని కుమార్తె మరియం నవాజ్‌కు శిక్షవిధిస్తూ ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం లండన్‌లో ఆయన కుమర్తెతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టుపై తనకు గౌరవం ఉందని, శిక్షను అనుభవించడానికి తప్పకుండా పాక్ వస్తానని పేర్కొన్నారు. తన భార్యకు క్యాన్సర్ కారణంగా ప్రస్తుతం లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారని, కొంత సమయం తరువాత కోర్టుకు హాజరవుతానని తెలిపారు. పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. పనామా పేపర్స్ కుంభకోణంలో షరీఫ్‌ను నిందితుడిగా పేర్కొంటు పాక్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో గత ఏడాది జూలై 25న ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై 25న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు దూరంగా ఉండనున్న నేపథ్యంలో ఆయన సోదరుడు షహాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్‌ను బాధ్యతలను స్వీకరించనున్నారు. -
నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పనామా పేపర్ల కుంభకోణంలో ఓ కేసుకు సంబంధించి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు ఆయనకు 80 లక్షల పౌండ్ల (దాదాపు 73 కోట్ల రూపాయలు) జరిమానా కూడా విధిస్తూ పాకిస్తాన్‌లోని ఓ అవినీతి వ్యతిరేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పాక్‌లో ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) పార్టీకి ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బ కానుంది. షరీఫ్‌తోపాటు ఆయన కూతురు మరియంకు కూడా కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 20 లక్షల పౌండ్ల (దాదాపు 18 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. విచారణకు సహకరించని కారణంగా షరీఫ్, మరియంతోపాటు ఆమె భర్త మహ్మద్ సఫ్దార్కు కూడా చెరో ఏడాది జైలు శిక్ష పడింది. అయితే శిక్షలన్నీ ఏకకాలంలో అమలవనున్నందున షరీఫ్ పదేళ్లు, మరియం ఏడేళ్లపాటు మాత్రమే జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు, భారీ భద్రత నడుమ రహస్యంగా ఈ తీర్పును వెలువరించింది. అనంతరం తీర్పు వివరాలను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) న్యాయవాది మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ తీర్పును వారంపాటు వాయిదా వేయాలంటూ షరీఫ్ కుటుంబసభ్యులు కోరినా న్యాయమూర్తి పట్టించుకోలేదు. గతేడాది పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుతో పదవీచ్యుతుడిగా మారిన నవాజ్ షరీఫ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తాజా తీర్పులో ఆయన కూతురు, అల్లుడికి జైలు శిక్ష పడినందున వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఈ తీర్పుపై వారు 10 రోజుల్లోపు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఎన్ఏబీ న్యాయవాది చెప్పారు. అసలు కేసు ఏంటి? పనామా పేపర్ల కుంభకోణానికి సంబంధించి షరీఫ్ కుటుంబంపై మొత్తం 3 కేసులుండగా, అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం తీర్పు వెలువడింది. 1990ల్లోనూ నవాజ్ షరీప్ పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో అవినీతి సొమ్మును కూడబెట్టి లండన్‌లోని పార్క్‌లేన్‌లో ఉన్న అవెన్‌ఫీల్డ్ హౌస్ అనే భవంతిలో ఖరీదైన నాలుగు ఫ్లాట్లను షరీఫ్ కుటుంబ సభ్యులు కొన్నారు. 1993 నుంచీ ఈ ఫ్లాట్లు వారి పేరనే ఉన్నాయి. గతేడాది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్ఏబీ ఈ కేసులో విచారణ చేపట్టింది. షరీఫ్‌తోపాటు ఆయన కొడుకులు, కూతురు, అల్లుడిని కూడా ఎన్ఏబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. 9 నెలలకు పైగా విచారించిన అనంతరం కోర్టు షరీఫ్, ఆయన కూతురిని దోషులుగా తేలుస్తూ తీర్పిచ్చింది. పాకిస్తాన్‌కు తిరిగొస్తారా? కేన్సర్‌కు చికిత్స పొందుతున్న తన భార్యకు తోడుగా నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో ఆయన తన కూతురితో కలసి అవెన్యూఫీల్డ్లోని ఫ్లాట్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కోర్టు వీరిని దోషులుగా తేల్చి, శిక్ష విధించడంతో షరీఫ్, మరియంలు పాక్‌కు తిరిగొచ్చి జైలు శిక్షను అనుభవిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్నందున వారు దేశానికి తిరిగొచ్చి జైలుకు వెళితే సానుభూతితో పీఎంఎల్–ఎన్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దొంగను కాదు.. తిరిగొస్తా: షరీఫ్ పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన లండన్‌లో విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌కు ఉన్న 70 ఏళ్ల చరిత్ర గతిని తాను మార్చాలనుకున్నందుకు, ఓటుకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే తనకు ఈ శిక్ష పడిందని నవాజ్ షరీఫ్ అన్నారు. తానేమీ దొంగను కాదనీ, పాకిస్తాన్‌కు తెరిగి వెళ్తానని స్పష్టం చేశారు. నిజం మాట్లాడినందుకు పాకిస్తానీలను బంధించడమనే ప్రక్రియ ఆగిపోయేంత వరకు, కొందరు ఆర్మీ జనరళ్లు, న్యాయమూర్తులు పాకిస్తానీలకు విధిస్తున్న బానిసత్వం తొలగిపోయేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని షరీఫ్ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడు, పీఎంఎల్–ఎన్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా తమ వాళ్లను కోర్టు దోషులుగా తేల్చడాన్ని తిరస్కరించారు. కోర్టు నవాజ్ షరీఫ్, మరియంలను దోషులుగా తేల్చడం అన్యాయమనీ, రాజకీయ దురుద్దేశం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. జూలై 25న ప్రజా న్యాయస్థానంలో తమ వాళ్లు నిర్దోషులుగా బయటకొస్తారన్నారు. -
నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
షరీఫ్‌పై జీవితకాల నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజకీయ జీవితానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ దేశ సుప్రీం కోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్తోపాటుగా పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్ కూడా ఇకపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం ఓ చట్టసభ్యుడిపై ఎంతకాలం నిషేధం విధించవచ్చన్న కేసు విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. ఉన్నత న్యాయస్థానం ద్వారా ఒకసారి అనర్హత వేటు పడితే ప్రజాప్రతినిధిగా పోటీ చేయలేరని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 62 ప్రకారం.. ఎంపీ నిజాయితీగా, నీతిమంతుడిగా ఉండాలి. అయితే పనామా పేపర్స్ కేసులో ఈ చట్టం ప్రకారమే షరీఫ్‌ను పాక్ సుప్రీంకోర్టు ఎంపీగా అనర్హుడిగా (జూలై 28, 2017న) ప్రకటించింది. దీంతో షరీఫ్ రాజీనామా చేశారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడిగా కూడా నవాజ్ ఉండకూడదని కోర్టు ఆదేశించింది. -
అవన్నీ ఫ్లాప్ మూవీ స్టోరీలే: మాజీ ప్రధాని ఆగ్రహం
ఇస్లామాబాద్ : తనపై వెల్లువెత్తుతోన్న అవినీతి ఆరోపణలను ఫ్లాప్ మూవీ స్టోరీలతో పోల్చారు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. పనామా పేపర్ల లీకేజీ వ్యవహారంలో పదవి కోల్పోయిన షరీఫ్ ఇటీవల 13వ సారి స్థానిక కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పనామా లీకేజీలో నిందితులుగా ఉన్న షరీఫ్ కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్ లు మాజీ ప్రధానితో కలిసి వచ్చి కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) షరీఫ్ పై నమోదైన కేసులను విచారిస్తోంది. కోర్టు విచారణ అనంతం షరీఫ్ మీడియాతో మాట్లాడారు. నాపై చేస్తున్న ఆరోపణలు 1960లో భారీ బడ్జెత్‌తో తీయగా అట్టర్ ఫ్లాప్ అయిన మూవీలా ఉన్నాయన్నారు. మూవీ ఎంత బాగోలేకున్నా హిట్ అవుతుందని చెబుతారు. కానీ రెండో వారం పరాజయాన్ని నిర్మాత, దర్శకుడు, యూనిట్ ఒప్పుకుని తీరాల్సిందే అన్నారు. తనపై చేస్తున్న తప్పుడు విమర్శలు, ఆరోపణలు మొదట విజయవంతంగా కొనసాగినా.. చివరికి వాటిలో పస లేదని తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు షరీఫ్. మరోవైపు ఇస్లామాబాద్ కోర్టు షరీఫ్‌పై గతేడాది చివర్లో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థుల పైనా షరీఫ్ నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రాజకీయ ప్రత్యర్థులు మా పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారు. మరో నాలుగు నెలలు వేచి చూస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. పనామా పేపర్ల లీకేజీతో పాటు పలు అక్రమాస్తుల కేసుల్లో షరీఫ్ సహా ఆయన కూతురు, అల్లుడు నిందితులు కాగా, పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. -
పాక్ ప్రధాని షరీఫ్‌పై వేటు
అనర్హుడిగా ప్రకటిస్తూ పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ► తప్పుడు వివరాలతో రాజ్యాంగాన్ని మోసగించారన్న సుప్రీం ధర్మాసనం ► పాకిస్తాన్లో మరోసారి రాజకీయ సంక్షోభం.. ప్రతిపక్షాల సంబరాలు ఇస్లామాబాద్: రాజకీయ అస్థిరతకు మారుపేరైన పాకిస్తాన్లో మరోసారి సంక్షోభం తలెత్తింది. తప్పుడు వివరాలతో రాజ్యాంగాన్ని మోసగించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగేందుకు అనర్హుడని పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దీంతో ఆయన ప్రధాని పదవికి అనర్హుడయ్యారు. ప్రధానిగా కొనసాగాలంటే పాక్ జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా ఉండడం తప్పనిసరి. ఈ తీర్పుతో పాకిస్తాన్లో విపక్షాలు సంబరాలు చేసుకోగా.. తదుపరి ప్రధానిగా షరీఫ్ సోదరుడు షెహ్బాజ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. షరీఫ్‌ను అనర్హుడిగా పేర్కొంటూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం శుక్రవారం ఉదయం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి ఇజాజ్ అఫ్జల్ ఖాన్ తీర్పు ప్రతిని చదివి వినిపించారు. తీర్పు వెలువడగానే కోర్టు వెలుపల ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ కార్యకర్తలు ‘గో నవాజ్ గో’ అంటూ సంబరాలు చేసుకున్నారు. ఆర్టికల్ 62, 63 ప్రకారం షరీఫ్ ఎంపీగా అనర్హుడని కోర్టు నిర్ధారించింది. ‘ఎంపీగా షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటిస్తున్నాం. దీంతో ప్రధానిగా ఆయన అధికారం ముగిసింది’ అని కోర్టు స్పష్టం చేసింది. షరీఫ్ అనర్హతపై నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ప్రమాణం కింద తప్పుడు వివరాల్ని సమర్పించారని, అందువల్ల రాజ్యాంగం ప్రకారం షరీఫ్ నిజాయితీపరుడు కాడని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం లాహోర్ నుంచి షరీఫ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేసింది. దీంతో కేబినెట్ మొత్తం రద్దయ్యింది. పనామా పేపర్స్ కుంభకోణం.. 1990లో షరీఫ్ ప్రధానిగా ఉండగా మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. భారీ ఎత్తున డబ్బును విదేశాలకు తరలించి లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారు. గతేడాది పనామా పేపర్స్ లీకేజీ సందర్భంగా ఈ వివరాలు వెలుగుచూశాయి. ఆరోపణలపై విచారణకు ఈ ఏడాది మేలో ఆరుగురు సభ్యులతో జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జిట్)ను సుప్రీంకోర్టు నియమించింది. జులై 10న సుప్రీంకోర్టుకు జిట్ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా సుప్రీం తీర్పునిచ్చింది. షరీఫ్, అతని కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యంపై అవినీతి కేసులు నమోదు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లోగా కేసులు నమోదు చేసి.. ఆరు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సూచించింది. షరీఫ్‌కు అత్యంత విధేయుడు, పాక్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్, షరీఫ్ అల్లుడు, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు కెప్టెన్ ముమహ్మర్ సఫ్దర్‌లను కూడా సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంల్–ఎన్) స్పందిస్తూ.. కేసు విచారణపై అభ్యంతరాలు ఉన్నా.. సుప్రీంకోర్టు తీర్పును పాటిస్తామని తెలిపింది. పాకిస్తాన్ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనంతగా ఈ కేసుకు అధిక ప్రాధాన్యమిచ్చారని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఉమ్మడి పోరాట ఫలితం: ఇమ్రాన్ ఖాన్ ఈ తీర్పును పాకిస్తాన్ ప్రతిపక్ష నేత, తెహ్రికీ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ‘న్యాయ పోరాటంలో అండగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు. అందరి ఉమ్మడి పోరాటం ఫలితమే ఈ తీర్పు. పాకిస్తాన్ మొత్తం ఆనందించాల్సిన సమయం. మొదటిసారి సుప్రీంకోర్టు.. పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించింది. ఇక నుంచి మనం కూడా ఇతర దేశాల్లా పురోగమించే అవకాశం లభించింది’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్లో గాడ్‌ఫాదర్ పాలన అంతమైందని, సత్యం, న్యాయం గెలిచాయని తెహ్రికీ ఇన్సాఫ్ ట్వీట్ చేసింది. దుబాయ్‌లో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ స్పందిస్తూ.. ‘ఇది మంచి నిర్ణయం.. దేశమంతా ఆనందంతో స్వీట్లు పంచుకుంటుంది’ అని చెప్పారు. షరీఫ్ అనర్హతపై ఆయన కుమార్తె మర్యం స్పందిస్తూ.. ‘మళ్లీ ప్రభంజనంలా తిరిగి వస్తాం. 2018 ఎన్నికల్లో షరీఫ్ విజయానికి ఈ రోజుతో బాటలు పడింది’ అని ఆమె ట్వీట్ చేశారు. కోర్టు తీర్పుతో నిరుత్సాహానికి గురయ్యామని.. పాకిస్తాన్ గత సంఘటనల్ని పరిశీలిస్తే ఇదేమీ అశ్చర్యకరం కాదన్నారు. త్వరలో పీఎంల్–ఎన్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని ఆమె తెలిపారు. తదుపరి ప్రధానిగా షరీఫ్ సోదరుడు! ప్రధానిగా షరీఫ్ అనర్హుడవడంతో ఆయన సోదరుడు, పంజాబ్ సీఎం షెహ్బాజ్ షరీఫ్ తర్వాతి ప్రధాని కావచ్చు. ఆయ న పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు కానందున ఇప్పటికిప్పుడే ప్రధాని అవలేరు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా షరీఫ్ విధేయుల్లో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. షెహ్బాజ్ ఎంపీగా గెలిచాక ఆయన ప్రధాని బాధ్యతలు చేపడéరని పీఎంల్–ఎన్ పేర్కొంది. మూడుసార్లు అర్ధంతరంగానే.. పంజాబ్ సింహంగా పేరుపడ్డ షరీఫ్ ప్రధానిగా మూడోసారి కూడా పదవీకాలం పూర్తి చేసుకోలేదు. 1990లో మొదటిసారి ప్రధాని అయ్యాక 1993లో అర్ధంతరంగా వైదొలి గారు. రెండోసారి 1997లో మళ్లీ ప్రధాని కాగా.. 1999లో అప్పటి ఆర్మీ చీఫ్ ముషర్రఫ్ సైనిక కుట్రతో పదవీచ్యుతుడ య్యారు. పాకిస్తాన్ చరిత్రలో పదవిలో కొనసాగుతున్న ప్రధానిని అనర్హుడిగా ప్రకటించడం ఇది రెండో సారి.. 2012లో అప్పటి ప్రధాని యూసఫ్ రజా గిలానీని కోర్టు ధిక్కార నేరంపై సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. -
ఐస్లాండ్ ప్రధాని ఔట్
పారిస్/వాషింగ్టన్/సియోల్/బీజింగ్: ప్రపంచ దేశాల్లో పనామా పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పలువురు దేశాధ్యక్షులు, ప్రధానుల పేర్లు ఇందులో వెలుగుచూడడంతో ఆ దేశాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాగ్రహం పెల్లుబికడంతో ఐస్లాండ్ ప్రధాని సిగ్ముందర్ గన్లాగ్సన్ గద్దెదిగారు. ఈయన తన భార్య అన్నా సిగుర్లాగ్ పేరిట విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనం వెనకేశారని పనామా పత్రాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం వేలాది మంది ప్రజలు పార్లమెంట్ చెంత ఆందోళనకు దిగారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని పన్నులు చెల్లించానని వివరణ ఇచ్చుకున్నా ప్రజలు శాంతించలేదు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో మంగళవారం రాజీనామా చేశారు. అంతకుముందు పార్లమెంట్‌ను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. ఇదే విషయాన్ని అధ్యక్షుడు ఒలాఫర్ రగ్నార్ గ్రిమ్సన్ను కలిసి చెప్పారు. అయితే అందుకు అధ్యక్షుడు నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశారు. పార్లమెంట్ రద్దుకు ప్రధాని చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు తిరస్కరించడం అసాధారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టునీషియాలో ఇ-మేగజీన్ హ్యాక్ పనామా పత్రాలను విశ్లేషిస్తామని వెల్లడించిన కాసేపటికే టునీషియాలోని ‘ఇంకిఫదా’ అనే ఇ-మేగజీన్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. హ్యాక్ చేశాక మేగజీన్ సైట్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారని ఆ పత్రిక ఎడిటోరియల్ చీఫ్ మోనియా బెన్ హమాది వెల్లడించారు. ఆ పత్రాలను పరిశీలిస్తున్నాం: అమెరికా పనామా పత్రాలు వెల్లడించిన అంశాల్లోని నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా తెలిపింది. ఆ పత్రాల్లోని ఆరోపణలపై స్పందించబోమని, అయితే అందులో వెల్లడైన అంశాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు దేశ న్యాయ శాఖ ప్రతినిధి పీటర్ కర్ తెలిపారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో మేం పారదర్శకత కోరుకుంటున్నాం. అలాగే అవినీతి నిర్మూలనకు, అక్రమ లావాదేవీలను కట్టడి చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంటుంది’’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ పేర్కొన్నారు. పనామాను ఆ జాబితాలో చేరుస్తాం: ఫ్రాన్స్ తమ దేశానికి సహకరించని జాబితాలో పనామాను మళ్లీ చేరుస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. పన్నులు ఎగ్గొట్టేవారికి పనామా స్వర్గధామంగా మారినట్టు తాజా పరిణామాలతో రుజువవడంతో ఆ దేశాన్ని ‘అన్కోపరేటివ్ స్టేట్స్ అండ్ టెరిటరీస్’(ఈటీఎన్సీ) జాబితాలో చేరుస్తామని ఆర్థిక మంత్రి మిషెల్ సపిన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడంతో పనామాను ఫ్రాన్స్ ఈ జాబితా నుంచి 2012లో తొలగించింది. ఫోన్సెకా క్లయింట్‌గా కొరియా ‘అణు’ కంపెనీ ఉత్తర కొరియా అణు కార్యకలాపాలకు సహకరిస్తున్న ఓ కంపెనీ మొసాక్ ఫోన్సెకాకు క్లయింట్‌గా ఉన్నట్టు పనామా పేపర్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. డీసీబీ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ మొసాక్ సహకారంతో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో 2006లో ఓ ఉత్తుత్తి కంపెనీ నెలకొల్పింది. కాకతాళీయంగా అదే ఏడాదిలో ఉత్తర కొరియా తొలి అణుపరీక్ష నిర్వహించింది. చైనాలో ‘పనామా’పై ఆంక్షలు పనామా పత్రాల్లో 12 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతల పేర్లు వెలుగుచూడడంతో ఆయా దేశాల్లో జనం ఆందోళనలకు దిగుతున్నారు. అవినీతి నేతలు గద్దెదిగాలని డిమాండ్ చేస్తున్నారు. అటు విపక్షాలూ పనామా పత్రాలను ఆయుధంగా మార్చుకొని అధికారపక్షంపై దాడికి దిగుతున్నాయి. మరికొన్ని దేశాలేమో పనామా సమాచారంపై ఆంక్షలు విధించాయి. ఈ విషయంలో చైనా ముందుంది. మొసాక్ ఫోన్సెకా నుంచి బట్టబయలైన పత్రాల వివరాలు జనాలకు అందుబాటులోకి లేకుండా చూసేం దుకు నానా తంటాలు పడుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా అనేక మంది ముఖ్య రాజకీయ నేతలు పెద్దఎత్తున నల్లధనం కూడబెట్టారని పనామా పేపర్స్ వెల్లడించడంతో వివిధ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాలపై అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్లో పనామా, దానికి సంబంధించిన పేర్లతో శోధించే ప్రయత్నాలన్నింటినీ నిలువరిస్తోంది. ‘‘పనామా పేపర్స్‌లోని అంశాలన్నీ నిరాధారం. దీని వెనుక పశ్చిమ దేశాల శక్తులున్నాయి’’ అని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. బ్రిటన్ ప్రధానిపై ఒత్తిడి పనామా పత్రాల్లో తన తండ్రి ఇయాన్ కామెరూన్ పేరు వెలుగుచూడడంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తల పట్టుకున్నారు. విదేశాల్లో పేపర్ కంపెనీ నెలకొల్పిన ఇయాన్(2010లో చనిపోయారు) పన్ను ఎగ్గొట్టారని పనామా పేపర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో కామెరూన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.