![Jaya Bachchan Outburst In Rajya Sabha Curse BJP MP - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/20/Jaya-Bachchan.jpg.webp?itok=7W9yA7gb)
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగతున్నాయి. పలు కీలక అంశాలపై విపక్షాలు.. అధికార పార్టీని.. ఇరుకున పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ వేదికగా శాపనార్థాలు పెట్టారు. ఓ ఎంపీ జయా బచ్చన్‌ను ఉద్దేశించి.. వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. సహనం కోల్పోయిన జయా బచ్చన్.. సదరు ఎంపీని శపించారు. ఆ వివరాలు..
మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సమయంలో జయా బచ్చన్ ఎవరిని టార్గెట్ చేసి.. విమర్శించలేదు కానీ.. ట్రెజరీ బెంచీలపై ఆరోపణలు చేశారు. అంతేకాక అధికారంలో ఉన్న వారు విపక్షాల వాదనలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
(చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ)
ఈ సందర్భంగా భువనేశ్వర్ కల్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మీరు న్యాయంగా ఉండాలి. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. మీ నుంచి మేం ఏం ఆశిస్తాం.. సభలో ఏం జరుగుతుందో చూస్తున్నారా.. మనం చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఓ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. దానిలో ఉన్న లోటుపాట్లను మనం చర్చించి.. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేయాలి’’ అంటూ జయా బచ్చన్ ప్రసంగించసాగారు.
(చదవండి: మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ)
జయా బచ్చన్ ఇలా మాట్లాడుతుండగా.. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా.. ఆమె కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించి.. ఆరోపణలు చేశారు. పనామా పేపర్స్ వ్యవహారంలో జయా బచ్చన్ కోడలు.. ఐశ్వర్య రాయ్ ఈడీ విచారణకు హాజరైన సంఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన జయా బచ్చన్.. ‘‘త్వరలోనే మీ జీవితంలోకి దుర్దినాలు రాబోతున్నాయి. మీకిదే నా శాపం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment