పాక్‌ ప్రధాని షరీఫ్‌పై వేటు | Pakistan´s PM´s fall new consequence of Panama Papers | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రధాని షరీఫ్‌పై వేటు

Published Sat, Jul 29 2017 1:20 AM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

పాక్‌ ప్రధాని షరీఫ్‌పై వేటు - Sakshi

పాక్‌ ప్రధాని షరీఫ్‌పై వేటు

అనర్హుడిగా ప్రకటిస్తూ పాక్‌ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
► తప్పుడు వివరాలతో రాజ్యాంగాన్ని మోసగించారన్న సుప్రీం ధర్మాసనం
► పాకిస్తాన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. ప్రతిపక్షాల సంబరాలు


ఇస్లామాబాద్‌: రాజకీయ అస్థిరతకు మారుపేరైన పాకిస్తాన్‌లో మరోసారి సంక్షోభం తలెత్తింది. తప్పుడు వివరాలతో రాజ్యాంగాన్ని మోసగించిన పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగేందుకు అనర్హుడని పాక్‌ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దీంతో  ఆయన ప్రధాని పదవికి అనర్హుడయ్యారు. ప్రధానిగా కొనసాగాలంటే పాక్‌ జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా ఉండడం తప్పనిసరి. ఈ తీర్పుతో పాకిస్తాన్‌లో విపక్షాలు సంబరాలు చేసుకోగా.. తదుపరి ప్రధానిగా షరీఫ్‌ సోదరుడు షెహ్‌బాజ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. షరీఫ్‌ను అనర్హుడిగా పేర్కొంటూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం శుక్రవారం ఉదయం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.

న్యాయమూర్తి ఇజాజ్‌ అఫ్జల్‌ ఖాన్‌ తీర్పు ప్రతిని చదివి వినిపించారు. తీర్పు వెలువడగానే కోర్టు వెలుపల ప్రతిపక్ష పాకిస్తాన్‌ తెహ్రికీ ఇన్సాఫ్‌ కార్యకర్తలు ‘గో నవాజ్‌ గో’ అంటూ సంబరాలు చేసుకున్నారు. ఆర్టికల్‌ 62, 63 ప్రకారం షరీఫ్‌ ఎంపీగా అనర్హుడని కోర్టు నిర్ధారించింది. ‘ఎంపీగా షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటిస్తున్నాం. దీంతో ప్రధానిగా ఆయన అధికారం ముగిసింది’  అని కోర్టు స్పష్టం చేసింది. షరీఫ్‌ అనర్హతపై నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ప్రమాణం కింద తప్పుడు వివరాల్ని సమర్పించారని, అందువల్ల రాజ్యాంగం ప్రకారం షరీఫ్‌ నిజాయితీపరుడు కాడని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం లాహోర్‌ నుంచి షరీఫ్‌ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దుచేసింది. దీంతో కేబినెట్‌ మొత్తం రద్దయ్యింది.

పనామా పేపర్స్‌ కుంభకోణం..
1990లో షరీఫ్‌ ప్రధానిగా ఉండగా మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. భారీ ఎత్తున డబ్బును విదేశాలకు తరలించి లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారు. గతేడాది పనామా పేపర్స్‌ లీకేజీ సందర్భంగా ఈ వివరాలు వెలుగుచూశాయి. ఆరోపణలపై విచారణకు ఈ ఏడాది మేలో ఆరుగురు సభ్యులతో జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(జిట్‌)ను సుప్రీంకోర్టు నియమించింది. జులై 10న సుప్రీంకోర్టుకు జిట్‌ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా సుప్రీం తీర్పునిచ్చింది. షరీఫ్, అతని కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యంపై అవినీతి కేసులు నమోదు చేయాలని నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరోను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆరు వారాల్లోగా కేసులు నమోదు చేసి.. ఆరు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సూచించింది. షరీఫ్‌కు అత్యంత విధేయుడు, పాక్‌ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్‌ దార్, షరీఫ్‌ అల్లుడు, పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీ సభ్యుడు కెప్టెన్‌ ముమహ్మర్‌ సఫ్దర్‌లను కూడా సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌(పీఎంల్‌–ఎన్‌) స్పందిస్తూ.. కేసు విచారణపై అభ్యంతరాలు ఉన్నా.. సుప్రీంకోర్టు తీర్పును పాటిస్తామని తెలిపింది. పాకిస్తాన్‌ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనంతగా ఈ కేసుకు అధిక ప్రాధాన్యమిచ్చారని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఉమ్మడి పోరాట ఫలితం: ఇమ్రాన్‌ ఖాన్‌
ఈ తీర్పును పాకిస్తాన్‌ ప్రతిపక్ష నేత, తెహ్రికీ ఇన్సాఫ్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ స్వాగతించారు. ‘న్యాయ పోరాటంలో అండగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు. అందరి ఉమ్మడి పోరాటం ఫలితమే ఈ తీర్పు. పాకిస్తాన్‌ మొత్తం ఆనందించాల్సిన సమయం. మొదటిసారి సుప్రీంకోర్టు.. పాకిస్తాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించింది. ఇక నుంచి మనం కూడా ఇతర దేశాల్లా పురోగమించే అవకాశం లభించింది’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో గాడ్‌ఫాదర్‌ పాలన అంతమైందని,  సత్యం, న్యాయం గెలిచాయని తెహ్రికీ ఇన్సాఫ్‌ ట్వీట్‌ చేసింది.

దుబాయ్‌లో చికిత్స పొందుతున్న పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషర్రఫ్‌ స్పందిస్తూ.. ‘ఇది మంచి నిర్ణయం.. దేశమంతా ఆనందంతో స్వీట్లు పంచుకుంటుంది’ అని చెప్పారు. షరీఫ్‌ అనర్హతపై ఆయన కుమార్తె మర్యం స్పందిస్తూ.. ‘మళ్లీ ప్రభంజనంలా తిరిగి వస్తాం. 2018 ఎన్నికల్లో షరీఫ్‌ విజయానికి ఈ రోజుతో బాటలు పడింది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. కోర్టు తీర్పుతో నిరుత్సాహానికి గురయ్యామని.. పాకిస్తాన్‌ గత సంఘటనల్ని పరిశీలిస్తే ఇదేమీ అశ్చర్యకరం కాదన్నారు. త్వరలో పీఎంల్‌–ఎన్‌ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తుందని ఆమె తెలిపారు.

తదుపరి ప్రధానిగా షరీఫ్‌ సోదరుడు!
ప్రధానిగా షరీఫ్‌ అనర్హుడవడంతో ఆయన సోదరుడు, పంజాబ్‌ సీఎం షెహ్‌బాజ్‌ షరీఫ్‌ తర్వాతి ప్రధాని కావచ్చు. ఆయ న పాక్‌ జాతీయ అసెంబ్లీ సభ్యుడు కానందున ఇప్పటికిప్పుడే ప్రధాని అవలేరు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా షరీఫ్‌ విధేయుల్లో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. షెహ్‌బాజ్‌ ఎంపీగా గెలిచాక ఆయన ప్రధాని బాధ్యతలు చేపడéరని పీఎంల్‌–ఎన్‌ పేర్కొంది.

మూడుసార్లు అర్ధంతరంగానే..
పంజాబ్‌ సింహంగా పేరుపడ్డ షరీఫ్‌ ప్రధానిగా మూడోసారి కూడా పదవీకాలం పూర్తి చేసుకోలేదు. 1990లో మొదటిసారి ప్రధాని అయ్యాక 1993లో అర్ధంతరంగా వైదొలి గారు. రెండోసారి 1997లో మళ్లీ ప్రధాని కాగా.. 1999లో అప్పటి ఆర్మీ చీఫ్‌ ముషర్రఫ్‌ సైనిక కుట్రతో పదవీచ్యుతుడ య్యారు. పాకిస్తాన్‌ చరిత్రలో పదవిలో కొనసాగుతున్న ప్రధానిని అనర్హుడిగా ప్రకటించడం ఇది రెండో సారి.. 2012లో అప్పటి ప్రధాని యూసఫ్‌ రజా గిలానీని కోర్టు ధిక్కార నేరంపై సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement