వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక భేటీలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్తర కొరియా ప్రతినిధులను ట్రంప్‌కి కిమ్ పరిచయం చేస్తుండగా.. ట్రంప్ అందరికి కరచలనం చేస్తూ వచ్చారు. చివర్లో మిలటరీ త్రీ స్టార్ జనరల్ నో క్వాంగ్ చోల్ వద్దకు రాగానే ట్రంప్ అతనికి కరచలనం చేయబోగా.. చోల్ మాత్రం ట్రంప్‌కు సెల్యూట్ చేశాడు. దీంతో ట్రంప్ అతనికి తిరిగి సెల్యూట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి మరో దేశ మిలటరీ అధికారికి సెల్యూట్ చేయడంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సౌదీ రాజును కలసినప్పుడు తీవ్ర వ్యాఖ్యాలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఏం చెబుతారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై అమెరికా నేవీ రిటైర్డ్ అధికారి జేమ్స్ స్టావిరిస్ స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాల మిలటరీకి సెల్యూట్ చేయడం తాను చూడలేదన్నారు. దీనిని పొరపాటు చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్ మాత్రం ట్రంప్ చర్యను సమర్ధించింది. ఒక దేశ మిలటరీ అధికారి సెల్యూట్ చేసినప్పుడు తిరిగి సెల్యూట్ చేయడం కనీస మర్యాద అని ట్రంప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment