బద్ధ విరోధితో ట్రంప్ భేటీ
- త్వరలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో సమావేశం
- వైట్‌హౌస్ సంచలన ప్రకటన.. కొరియా భిన్న స్పందన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి స్వరం మార్చారు. శాంతిమంత్రాలు వల్లెవేస్తూ చారిత్రక శత్రువుతో సమావేశం అయ్యేందుకు సిద్ధపడ్డారు. ఇన్నాళ్లూ అమెరికా ఎవరినైతే బద్ధవిరోధిగా భావించిందో, ఆ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్‌తో ట్రంప్ భేటీకాబోతున్నట్లు వైట్‌హైస్ సంచలన ప్రకటన చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ‘సరైన సమయంలో’ మాత్రమే ఇరునేతల భేటీ ఉంటుందని, ఇందుకు కొరియా పలు షరతులకు అంగీకరించాల్సి ఉంటుందని సీన్ స్పైసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘కిమ్‌ను కలవడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తా..’అని ట్రంప్ కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే.. ఇరు నేతల భేటీపై వైట్‌హౌస్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. సమావేశం తేదీలపై వివరణ ఇస్తూ.. ‘ఇరుదేశాధినేతలు కలుసుకునేంత అనుకూల వాతావరణం ప్రస్తుతానికి లేదు. కొరియా తన అణుచర్యలను పూర్తిగా నిలిపేయాలి. దాని చుట్టుపక్కల దేశాలతోపాటు అమెరికాకు ఎలాంటి హాని తలపెట్టబోనని, కవ్వింపు ప్రకటనలు చేయబోని ప్రకటించాలి. అప్పుడే భేటీకి మార్గం సుగమమం అవుతుంది. ఇది జరగడానికి కొంత సమయం పట్టొచ్చు’ అని స్పైసర్ చెప్పారు.
వెనక్కి తగ్గేది లేదు: ఉత్తరకొరియా
కిమ్ జాంగ్‌తో ట్రంప్ భేటీ అవుతారని వైట్‌హౌస్ ప్రకటించిన తరుణంలోనే.. ఉత్తరకొరియా మరోమారు కయ్యానికి కాలుదువ్వింది. మిస్సైళ్లు, అణుపరీక్షలు నిలిపేయాలన్న అమెరికా అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన చేసింది. అమెరికా ఆంక్షలకు భయపడి మిస్సైళ్లు, అణుపరీక్షలపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని, రెట్టించిన వేగంతో దూసుకెళతామని స్పష్టం చేసింది. ఉత్తర కొరియాపట్ల విరోధభావనను మార్చుకుంటే తప్ప అమెరికాతో సత్సంబంధాలు నెరపబోమని తేల్చిచెప్పింది.