
46 మంది సజీవదహనం
కైరో: సూడాన్ దేశ రాజధాని ఖార్టూమ్ సమీప పట్టణంలో సైనిక విమానం కుప్పకూలిన ఘటనలో 46 మంది సజీవ దహనమయ్యారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. విమానం జనావాసాలపై కూలడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక యంత్రాంగం ప్రకటించింది.
ఓమ్డర్‌మ్యాన్ సిటీకి ఉత్తరాన ఉన్న వాడీ సయిద్నా వైమానిక స్థావరం నుంచి మంగళవారం రాత్రి టేకాఫ్ అయిన ఆంటోనోవ్ రకం సైనిక విమానం కొద్దిసేపటికే కర్రారీ జిల్లాలోని జనావాసాలపై కూలింది. విమానంలో ప్రయాణిస్తున్న ఆర్మీ సీనియర్ కమాండర్ బహర్ అహ్మద్, సైనిక అధికారులతోపాటు జనావాసంలోని సాధారణ ప్రజలూ ప్రాణాలు కోల్పోయారని ఖార్టూమ్ మీడియా కార్యాలయం తెలిపింది. ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కూలిపోయిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.