రెవెన్యూ శాఖపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. పాలనలో కీలకమైన రెవెన్యూ వ్యవస్థను తమ గుప్పెట్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆçస్తులు దోచుకునేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే పాలనలో తల దూర్చి చక్రం తిప్పుతున్నారు. తమ మాట వినని తహసీల్దార్లను బదిలీ చేయించి, వారి స్థానాల్లో డిప్యూటీ తహసీల్దార్లను నియమించుకుని పెత్తనం చేస్తున్నారు. రెవెన్యూ శాఖను అధికార పార్టీ నాయకులు చేతి రుమాలుగా వాడేసుకుంటున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.
నెల్లూరు(పొగతోట): రెవెన్యూ శాఖలో రాజకీయ బదిలీలు ప్రారంభమయ్యాయి. తహసీల్దార్లను బదిలీలు చేసి వారి స్థానంలో డిప్యూటీ తహసీల్దార్ల (డీటీ)లను ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారు. ఉదయగిరి, కావలి, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఈ తంతు జరుగుతోంది. కలిగిరి తహసీల్దార్ మూడు నెలల కిందట పదవి విరమణ చేశారు. కొంత కాలం తర్వాత ఉషాను కలిగిరి తహసీల్దార్‌గా నియమించారు. అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పడంతో ఆమెను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. అక్కడే పని చేస్తున్న డీటీని ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు. జలదంకి తహసీల్దార్‌ను బదిలీ చేయమని అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారు. త్వరలో జలదంకి తహసీల్దార్‌కు రాజకీయ బదిలీ తప్పదనే ప్రచారం జరుగుతోంది.
ఉదయగిరి తహసీల్దార్‌ను జాయిన్ చేసుకోవద్దంటూ ఒత్తిళ్లు చేశారు. చివరికి వారం రోజుల తర్వాత తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో వీఆర్‌ఓ, ఆర్‌ఐ, జూనియర్, సినియర్ అసిస్టెంట్, డీటీ తహసీల్దార్లు అధికార పార్టీ నాయకులు అనుమతి లేనిదే బాధ్యతలు స్వీకరించే పరిస్థితి లేదు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండే వారిని కావాల్సిన మండలాలకు బదిలీలు చేయించుకుంటున్నారు. వీరు చెప్పిన పనులు చేయకపోతే ఒత్తిళ్లు తీసుకువచ్చి బదిలీలు చేయిస్తున్నారు. త్వరలో రెండు మూడు మండలాల్లో రాజకీయ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గోడకు కొట్టిన బంతిలా తహసీల్దార్ల పరిస్థితి
జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. కలిగిరి మండలం తప్ప మిగతా అన్ని మండలాల్లో తహసీల్దార్లు ఉన్నారు. 46 మండలాలు, ప్రత్యేక పోస్టులు కలిపి జిల్లాలో 67 మంది తహసీల్దార్లు ఉన్నారు. రెండు ప్రత్యేక తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరుకు నాయుడుపేట తహసీల్దార్, వచ్చే నెలలో టీపీగూడూరు తహసీల్దారు పదవీ విరమణ చేయనున్నారు. రేషన్‌కార్డులు, ఓటు నమోదు, తొలగింపులు, భూములు, నివాస స్థలాలు ఇతర పథకాల అమలు చేయడంలో రెవెన్యూ శాఖది కీలక స్థానం. ఆయా కార్యక్రమాలు అమలు చేయడంలో తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓల పాత్ర ప్రధానం.
దీంతో అధికార పార్టీకి అనుకూలంగా పని చేసే వారిని నియమించుకునేందుకు నాయకులు చక్రం తిప్పుతున్నారు. కీలక పోస్టులు దక్కించుకోవడానికి రెవెన్యూ ఉద్యోగులు గతంలో అధికార పార్టీ నాయకులు చుట్టు ప్రదక్షణలు చేశారు. తహసీల్దార్లను బదిలీలు చేసిన ఆయా ప్రాంతాల అధికార పార్టీ నాయకుల అనుమతి ఇవ్వనిదే బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదు. మండలాలకు బదిలీలు చేసిన తర్వాత ఇతను మాకు వద్దు మరొక అధికారిని నియమించమని జిల్లా అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం సీజేఎఫ్‌ఎస్, డాట్ భూములు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. సీజేఎఫ్‌ఎస్ కమిటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేయనున్నారు. సీజేఎఫ్‌ఎస్ భూములు బినామీల పేర్లపై పట్టాలు మంజూరు చేయించుకునేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
దగదర్తి, అల్లూరు, బోగోలు తదితర మండలాల్లో వందల ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూములు బినామీల పేర్లతో పట్టాలు మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని తహసీల్దార్లు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు బదిలీలు చేస్తారు. ఈ లోపు అధికార పార్టీకి అనుకూలంగా పనులు చేయించుకునేందుకు అడ్డుగా ఉండే తహసీల్దార్లను బదిలీలు చేయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బదిలీలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు పక్కన పెట్టి పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. త్వరలో జలదంకి మండలంతో పాటు రెండు. మూడు మండలాల్లో రాజకీయ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment