సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య వర్గ పోరు తమ్ముళ్లకు తలపోటుగా మారింది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంపై పెత్తనం కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. పార్టీలో నంబర్–2గా చలామణీ అవుతున్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు రూరల్ పారీ్టలో అగ్గి రాజేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారిద్దరూ నియోజకవర్గంలో నివాసం, క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అతిథి పాత్ర పోషిస్తున్నారు. పారీ్టలో వర్గాలకు ఊతమిస్తున్నారు. వారిద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరు చివరకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించే దశకు చేరింది.
చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు
తద్వారా ఆమెకు, ఆమె భర్త, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి(సత్తిబాబు)కు చెక్ పెట్టాలని రాజప్ప వర్గం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా తనకు అనుకూలుడైన నాయకుడిని నియమించుకోవాలనేది రాజప్ప వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన తెర వెనుక చాలాకాలంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లి దంపతులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటూ అధిష్టానం వద్ద యనమల పట్టుబడుతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా పిల్లి వర్గానికి వెన్నుదన్నుగా ఉండేవారు. భాస్కర రామారావు మరణానంతరం సత్తిబాబు వర్గానికి పార్టీలో యనమల ఒక్కరే పెద్ద దిక్కుగా మిగిలారు.
చంద్రబాబుకు సత్తిబాబు వైరి వర్గం ఫిర్యాదు
సత్తిబాబును వ్యతిరేకించే నాయకులందరూ తాజాగా ఒక్కటయ్యారు. సత్తిబాబు దంపతులను పార్టీ ఇన్‌చార్జిగా తప్పించాలనేదే వారందరి ఉమ్మడి లక్ష్యం. ఇదే అవకాశంగా రాజప్ప వర్గీయులు తెర వెనుక పావులు కదుపుతున్నారని ఆ పార్టీలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా సత్తిబాబును వ్యతిరేకించే రూరల్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సత్తిబాబు పార్టీ కోసం ఏ కోశానా పని చేయడం లేదని వారు ఆధారాలతో నివేదించారు. కాకినాడ కార్పొరేషన్‌లో పలు డివిజన్లకు ఉప ఎన్నికలు జరిగాయి. రూరల్ నియోజకవర్గం పరిధిలోని 3వ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ తరువాత ఉపసంహరించుకున్నారు.
ఈ విషయంలో సత్తిబాబుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన అంగీకారంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు చంద్రబాబుకు నాయకులు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ఇటీవలి కాకినాడ కార్పొరేషన్ ఉప ఎన్నికల వరకూ పార్టీ అభ్యర్థులు బరిలో లేకుండా చేసి, టీడీపీకి సత్తిబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సత్తిబాబు దంపతులను ఇన్‌చార్జిగా ఎలా కొనసాగిస్తారని చంద్రబాబును గట్టిగానే నిలదీశారని సమాచారం. వారిని ఇన్‌చార్జిగా తప్పించకుంటే రూరల్‌లో పార్టీకి అడ్రస్సే లేకుండా పోతుందనే వాదనను బాబు ముందుకు తీసుకువెళ్లారు.
మరోపక్క ఇటీవల పార్టీ పిలుపు మేరకు ఓటీఎస్‌కు వ్యతిరేకంగా ఇరు వర్గాలూ విడివిడిగానే ధర్నాలు చేయడం గమనార్హం. పేరాబత్తుల రాజశేఖర్, మామిడాల వెంకటేష్, పెంకే శ్రీనివాసబాబా తదితర నేతలను చినరాజప్ప వర్గం ఎగదోస్తోందని పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను తప్పించి, సొంత సామాజికవర్గానికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే వ్యూహంలో భాగంగానే రాజప్ప ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.
టీ కప్పులో తుపానేనా!
గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు, వివాదాలు కాకినాడ రూరల్ టీడీపీలో జరిగాయి. అయితే అవి టీ కప్పులో తుపాను మాదిరిగానే చల్లారిపోయాయి. ఇన్‌చార్జిగా తప్పుకొని, కార్యకర్తగా కొనసాగుతానని సత్తిబాబు గతంలో ఒక సందర్భంలో పత్రికా ముఖంగా ప్రకటించడం తెలిసిందే. కానీ అంతలోనే ప్లేటు ఫిరాయించేశారు. అధిష్టానం మాట ప్రకారం కొంత కాలం కొనసాగుతానని చెప్పారు. నియోజకవర్గంపై పెత్తనం కోసమే చినరాజప్ప, ఆయన వర్గం తెర వెనుక ఇదంతా జరిపిస్తున్నారని ఆ సందర్భంగా సత్తిబాబు పేర్కొనడం గమనార్హం.
అప్పటి నుంచి శుక్రవారం నాటి చంద్రబాబు భేటీ వరకూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే.. రూరల్ నియోజకవర్గ పార్టీ సమీక్షకు సత్తిబాబు దంపతులు గైర్హాజరయ్యారని అంటున్నారు. మరోపక్క సత్తిబాబు పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, నియోజకవర్గంలో ఆయన పెత్తనం లేకుండా చేయాలనే గట్టి పట్టుదలతో వైరి వర్గానికి చినరాజప్ప వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది.
ఈ విషయంలో అధిష్టానం కూడా ఇన్‌చార్జి మార్పునకే మొగ్గు చూపుతున్నట్టు టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న నేతలందరూ కట్ట కట్టుకుని మరీ వెళ్లి సత్తిబాబు దంపతులపై ఫిర్యాదుల చిట్టాను చంద్రబాబు ముందు పెట్టడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. అయితే ఇన్‌చార్జి మార్పునకు చంద్రబాబు “ఊ అంటారా.. ఉఊ అంటారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment