గత ఎన్నికల్లో సీమలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలుచుకున్న జిల్లా అది. ఈసారి ఒకటి కూడా కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. వీలున్నప్పుడల్లా నువ్వా? నేనా అన్నట్లుగా ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు.
పచ్చపార్టీలో అనంత వివాదాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఫైట్ పీక్ స్టేజ్‌కు చేరింది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి.. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు మధ్య చాన్నాళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీలో వృద్ధ నేత హనుమంతరాయచౌదరి 2014 నుంచి 2019 దాకా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరికి టిక్కెట్ నిరాకరించిన చంద్రబాబు.. ఉమామహేశ్వర నాయుడుని బరిలో దింపారు. గత ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు ఘోరంగా ఓడిపోయారు.
సైకిల్‌కు ఫ్లెక్సీ వార్
ఉమామహేశ్వర నాయుడుకి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. 2019లో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు.. టీడీపీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ఉన్నం, ఉమా మహేశ్వరుడు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారుగా ఫ్లెక్సీలు చేయించుకోవడం.. బలప్రదర్శన చేయడం.. ఒకరిపై మరొకరు బాహాటంగా విమర్శించుకోవటం కల్యాణదుర్గంలో సాధారణ విషయంగా మారింది.
బహిరంగంగా కుస్తీలాట
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పదవుల ఎంపిక జరుగుతోంది. కళ్యాణదుర్గంలోనే సమావేశం నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆ సమావేశాన్ని అనంతపురంలో జరపాలని ఆదేశించింది. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా ఇంఛార్జి బీటీ నాయుడు సమక్షంలో కళ్యాణదుర్గం పార్టీ సమావేశం జరిగింది.
సమావేశం ప్రారంభం కాగానే.. ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వర నాయుడు పార్టీ పదవులు తమ వర్గానికే ఇవ్వాలని పట్టుబట్టారు. మాటల యుద్ధంతో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. వాగ్వాదం, తోపులాటలతో పాటు పరస్పరం కొట్టుకోవడం.. కుర్చీలు విసురుకోవడం జరిగింది. రెండు వర్గాలకు సర్ది చెపచెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ముఖ్య నేతలు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు.
లాబీయింగ్ బాబు
కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు పొందేందుకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తనకు గాని.. తన కొడుకు మారుతీ చౌదరికి గానీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఇంఛార్జి పదవిని కాపాడుకుంటూనే వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఉమా మహేశ్వర నాయుడు భావిస్తున్నారు. అందుకే ప్రతి విషయం లోనూ రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. నియోజకవర్గంలో నాయకులు అనుసరిస్తున్న తీరుపై పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment