Nandigama Political News: Dominance Fighting Between Kesineni Nani And Devineni Uma - Sakshi
Sakshi News home page

కేశినేని వర్సెస్‌ దేవినేని.. టీడీపీలో హాట్‌ టాపిక్‌..

Published Sat, Mar 19 2022 10:02 AM | Last Updated on Sat, Mar 19 2022 11:56 AM

Dominance Fighting Between Kesineni Nani And Devineni Uma In Nandigama - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నందిగామ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు తమకే ఉండాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), మాజీ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం జిల్లా తెలుగుదేశం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కేశినేని, దేవినేని వర్గ పేచీలు గత వారంగా చంద్రబాబు వద్ద వరుస పంచాయితీలు జరుగుతున్నాయి.

చదవండి: డప్పు రమేష్‌ కన్నుమూత

ఏ వర్గం తన వద్దకు వస్తే ఆ వర్గానికి మద్దతుగా మాట్లాడుతూ నిలకడలేని ఆలోచనలు, నిర్ణయాలతో చంద్రబాబే గందరగోళ రాజకీయ పరిస్థితులకు కారకులవుతున్నారని సీనియర్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నందిగామతో మొదలైన రచ్చ ఇతర నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయని, ఈ పరిణామాలు పార్టీలో అనిశ్చితికి దారితీస్తున్నాయని పెదవి విరుస్తున్నారు. తమ అనుయాయులను అడ్డుగా పెట్టుకుని రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనంపై వారివురి పేచీ ఏంటని సీనియర్లు నిలదీస్తున్నారు.

నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులు, సోదరులైన మొండితోక జగన్మోహన్‌రావు, అరుణ్‌కుమార్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నింటా వేగంగా స్పందిస్తున్నారని, పార్టీ పరంగా పూర్తిగా బలపడిపోయారని, వారిని ధీటుగా ఎదుర్కొనే స్థితిలో సౌమ్య లేరని ఎంపీ కేశినేని చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించి ఆమెను మార్చాలంటూ పట్టుపట్టారనేది సమాచారం. మరో ఇంఛార్జిని ఎంపికచేసుకునే వరకు విజయవాడకు చెందిన తమ సామాజికవర్గానికే చెందిన గన్నె వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న)కు నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు.

కేశినేనితో పాటు విజయవాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, అన్న, బొమ్మసాని సుబ్బారావు తదితరులను వెంట పెట్టకుని వెళ్లడంతో చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న దేవినేని ఉమా తంగిరాల సౌమ్యతో పాటు నందిగామ నియోజకవర్గంలోని పలువురు నాయకులను వెంటపెట్టుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి ససేమిరా కుదరదని, సౌమ్యనే ఇంఛార్జిగా కొనసాగించాలని పట్టుపట్టడంతో అందుకు కూడా పార్టీ అధినేత అంగీకరించారని చెపుతున్నారు. తాము వెళ్లినప్పుడు అన్నాకు  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి మళ్లీ మాటమార్చడంపై కేశినేని వర్గం కినుక వహించిందని సమాచారం. ఈ వ్యవహారం నందిగామతో ఆగలేదని తిరువూరు ఇంఛార్జి అంశం కూడా రచ్చకెక్కిందని చెపుతున్నారు. గతంలో స్వామిదాసు ఉండగా ఆయన స్థానంలో చావల దేవదత్తుకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.

తాజాగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునెయ్యను ఇంఛార్జిగా నియమించాలని కేశినేని నాని ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు అంశాన్ని కూడా చంద్రబాబు వద్ద ఎంపీ ప్రస్తావించారని చెపుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఏడు శాసనసభ స్థానాల బాధ్యతలను అప్పజెపితే అన్నింటినీ చక్కబెడతాననేది కేశినేని నాని తన వాదనగా వినిపిస్తుండగా ఆయన వ్యతిరేకవర్గంగా ఇప్పటికే వ్యవహరిస్తున్న దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, తంగిరాల సౌమ్య తదితరులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement