NANDIGAMA constituency
-
కేశినేని వర్సెస్ దేవినేని.. టీడీపీలో హాట్ టాపిక్..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నందిగామ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు తమకే ఉండాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం జిల్లా తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేశినేని, దేవినేని వర్గ పేచీలు గత వారంగా చంద్రబాబు వద్ద వరుస పంచాయితీలు జరుగుతున్నాయి. చదవండి: డప్పు రమేష్ కన్నుమూత ఏ వర్గం తన వద్దకు వస్తే ఆ వర్గానికి మద్దతుగా మాట్లాడుతూ నిలకడలేని ఆలోచనలు, నిర్ణయాలతో చంద్రబాబే గందరగోళ రాజకీయ పరిస్థితులకు కారకులవుతున్నారని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నందిగామతో మొదలైన రచ్చ ఇతర నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయని, ఈ పరిణామాలు పార్టీలో అనిశ్చితికి దారితీస్తున్నాయని పెదవి విరుస్తున్నారు. తమ అనుయాయులను అడ్డుగా పెట్టుకుని రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనంపై వారివురి పేచీ ఏంటని సీనియర్లు నిలదీస్తున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, సోదరులైన మొండితోక జగన్మోహన్రావు, అరుణ్‌కుమార్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నింటా వేగంగా స్పందిస్తున్నారని, పార్టీ పరంగా పూర్తిగా బలపడిపోయారని, వారిని ధీటుగా ఎదుర్కొనే స్థితిలో సౌమ్య లేరని ఎంపీ కేశినేని చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించి ఆమెను మార్చాలంటూ పట్టుపట్టారనేది సమాచారం. మరో ఇంఛార్జిని ఎంపికచేసుకునే వరకు విజయవాడకు చెందిన తమ సామాజికవర్గానికే చెందిన గన్నె వెంకట నారాయణ ప్రసాద్ (అన్న)కు నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. కేశినేనితో పాటు విజయవాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, అన్న, బొమ్మసాని సుబ్బారావు తదితరులను వెంట పెట్టకుని వెళ్లడంతో చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న దేవినేని ఉమా తంగిరాల సౌమ్యతో పాటు నందిగామ నియోజకవర్గంలోని పలువురు నాయకులను వెంటపెట్టుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి ససేమిరా కుదరదని, సౌమ్యనే ఇంఛార్జిగా కొనసాగించాలని పట్టుపట్టడంతో అందుకు కూడా పార్టీ అధినేత అంగీకరించారని చెపుతున్నారు. తాము వెళ్లినప్పుడు అన్నాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మళ్లీ మాటమార్చడంపై కేశినేని వర్గం కినుక వహించిందని సమాచారం. ఈ వ్యవహారం నందిగామతో ఆగలేదని తిరువూరు ఇంఛార్జి అంశం కూడా రచ్చకెక్కిందని చెపుతున్నారు. గతంలో స్వామిదాసు ఉండగా ఆయన స్థానంలో చావల దేవదత్తుకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునెయ్యను ఇంఛార్జిగా నియమించాలని కేశినేని నాని ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు అంశాన్ని కూడా చంద్రబాబు వద్ద ఎంపీ ప్రస్తావించారని చెపుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఏడు శాసనసభ స్థానాల బాధ్యతలను అప్పజెపితే అన్నింటినీ చక్కబెడతాననేది కేశినేని నాని తన వాదనగా వినిపిస్తుండగా ఆయన వ్యతిరేకవర్గంగా ఇప్పటికే వ్యవహరిస్తున్న దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, తంగిరాల సౌమ్య తదితరులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. -
డిపాజిట్ దక్కితేనే గౌరవం..!
సాక్షి, మచిలీపట్నం : ఒక్క ఓటు తక్కువైనా పర్లేదు.. డిపాజిట్ మాత్రం వచ్చేటట్టు చూస్కో.. అన్నట్లుంది బరిలోకి దిగే అభ్యర్థుల పరిస్థితి. సార్వత్నిక ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు ఇరు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో విజయం సాధించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇండిపెండెంట్, ఇతర పార్టీల నుంచి అధిక మంది బరిలోకి దిగారు. ఈ సారి పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉండటంతో.. అంతగా ప్రజాదరణ లేని పార్టీల తరపున, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన వారు ఓట్లు రాబట్టుకుని ఎలాగైనా డిపాజిట్ మొత్తం వెనక్కు తీసుకునే ప్రయత్నాలు సైతం చేస్తుండగా.. మరి కొందరు తాము పోటీ చేశామన్న ప్రఖ్యాతి గడించేందుకు ఉర్రూతలు ఊగుతున్నారు. మరికొంత మంది తమకు డిపాజిట్లు దక్కకపోతే ప్రజల్లో శృంగభంగం తప్పదన్న భావనలో ఉన్నారు. బరిలో 232 మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీకు 205 మంది పోటీలో నిలిచారు. పార్లమెంట్‌కు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఒక్కో అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఎస్సీలకు రిజర్వు చేయడంతో అక్కడ మాత్రమే అభ్యర్థి కేవలం రూ.5 వేలు డిపాజిట్ చెల్లించారు. అయితే పోలైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందితేనే డిపాజిట్లు ఇస్తారు. లేకపోతే ఆ డబ్బులన్నీ ఖజానాలోకి చేరుతాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరం పోలైన ఓట్లలో డిపాజిట్లు పొందిన వారికి మాత్రమే తిరిగి వస్తుంది. దీంతో గౌరవప్రదంగా డిపాజిట్ దక్కించుకునేలా ఓట్లు పొందాలని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అసెంబ్లీకు, పార్లమెంట్‌కు సగం డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే తిరువూరు, పామర్రు, నందిగామ నియోజకవార్గల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచినా, ఓడినా డిపాజిట్ నగదు వెనక్కు వస్తుంది. రూ.26.95 లక్షల డిపాజిట్ త్వరలో జరగబోయే ఎన్నికలకు డిపాజిట్ నగదు పారింది. జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది బరిలో ఉండగా.. వారి ద్వారా రూ.6.75 లక్షలు, 16 శాసనసభ స్థానాలుండగా.. అందులో 3 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. 13 నియోజకవర్గాల పరిధిలో 172 మంది బరిలో ఉండగా..రూ.17.20 లక్షలు, మూడు ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో 33 మంది అంటే.. రూ.1.65 లక్షలు సెక్యురిటీ డిపాజిట్‌గా ఎన్నికల అధికారులు సేకరించారు. -
చైతన్యానికి చిరునామా..నందిగామా
సాక్షి, నందిగామ : రాజకీయ చైతన్యం కల్గిన ప్రాంతం నందిగామ నియోజకవర్గం. 1955లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం నాలుగు మండలాలతో దేశంలోని అత్యంత రద్దీ రహదారుల్లో రెండో స్థానం ఆక్రమించిన 65వ నెంబరు జాతీయ రహదారి ఈ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా నందిగామ, కంచికచర్ల పట్టణాలు ఈ రహదారి పక్కనే విస్తరించి ఉన్నాయి. తొలిసారి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందిన వాడే కావడం విశేషం. దేశంలోని జీవనదుల్లో ఒకటైన కృష్ణా నది చందర్లపాడు, కంచికచర్ల మండలాల మీదుగానే తూర్పునకు సాగిపోతుంది. దీనికితోడు నందిగామ, వీరులపాడు మండలాల మీదుగా మున్నేరు, వైరా ఏరు, కట్టెలేరు వంటి ఉప నదులు ప్రవహిస్తాయి. చుట్టూ నీరు ఉన్నప్పటికీ నేటికీ మంచినీరందని గ్రామాలు అనేకం ఉన్నాయి. నందిగామ పట్టణంలో కూడా ఈ సమస్య అధికం. ఇక పారిశ్రామిక పరంగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి వసంత నాగేశ్వరరావు హోం మంత్రి పదవిని అలంకరించారు. అదేవిధంగా రాజకీయ కురు వృద్ధుడిగా పేరుపొందిన ముక్కపాటి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, దేవినేని వెంకట రమణ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అత్యధిక పంచాయతీలు నందిగామ నియోజకవర్గంలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మొత్తం నాలుగు మండలాలున్నాయి. నందిగామ మండల పరిధిలోని 13 గ్రామాలు మాత్రమే నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 10 గ్రామాలు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం నందిగామ మండలంలో 23 గ్రామ పంచాయతీలు, కంచికచర్ల మండలంలో 16, వీరులపాడు మండలంలో 24, చందర్లపాడు మండలంలో 18 పంచాయతీలున్నాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 గ్రామ పంచాయతీలు, ఓ నగర పంచాయతీ ఉన్నాయి. జీవన శైలి నందిగామ నియోజకవర్గంలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. మెట్ట ప్రాంతం కావడంతో పత్తి, మిర్చి, అపరాలు, సుబాబుల్, వరి, మొక్కజొన్న వంటివి అధికంగా సాగు చేస్తారు. దీనికితోడు పాడి పరిశ్రమపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. ఎన్నికల సమయం మినహా మిగిలిన సమయంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నందిగామకు పడమర వైపు దేశంలోని జీవ నదుల్లో ఒకటిగా ఉన్న కృష్ణా నది ప్రవహిస్తోంది. ఉత్తరాన జగ్గయ్యపేట నియోజకవర్గం, తూర్పున తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన మైలవరం నియోజకవర్గం ఉన్నాయి. అధిక శాతం నిరుపేదలే నియోజకవర్గంలో అధిక శాతం నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలే. వ్యాపారాలు చేసే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. సంపన్నుల శాతం అతి తక్కువ. నిరుద్యోగులు అధికం. పారిశ్రామికంగా కూడా నియోజకవర్గం ఎటువంటి వృద్ధి సాధించకపోవడంతో జీవనశైలిలో పెద్దగా మార్పులు కనపడటం లేదు. నందిగామకు ప్రత్యేక స్థానం ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ఇక్కడి నుంచి సీపీఐ తరపున బరిలో నిలిచిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సైతం విజయం ఆయననే వరించింది. 1955 నుంచి ఇప్పటివరకు మొత్తం 14 సార్లు (బై ఎలక్షన్‌తో కలిపి) ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల ద్వారా విజయం సాధించిన వారిలో మొత్తం ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో వసంత నాగేశ్వరరావు ఏకంగా హోం మినిష్టర్‌గా పనిచేయడం గమనార్హం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు నందిగామకు చెందిన వారే. మహిళలే కింగ్ మేకర్లు నందిగామ నియోజకవర్గంలో మహిళల ఓట్లే అత్యంత కీలకం, వారు ఎవరికి ఓటు వేస్తే వారినే విజయలక్ష్మి వరిస్తుంది. నియోజకవర్గంలో మహిళ ఓటర్లే అధికంగా ఉండటంతోపాటు జనాభా పరంగా కూడా వారే అధికం కావడమే కాకండా ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా వీరి శాతమే అధికంగా ఉంటోంది. దీంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ, సంబంధిత అభ్యర్థి ఎమ్మెల్యే కావడం ఖాయం. దాదాపుగా మొత్తం జనాభా 2,54,734 కాగా వీరిలో 1,28,531 మహిళా ఓటర్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో 65 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ జరుగుతుంది. ఓటు వేసే వారిలో మహిళల సంఖ్యే అధికంగా ఉంటోంది. నాడు కంచుకోట! పదకొండు పర్యాయాలపాటు జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. దీంతో 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు విజయం సాధించారు. అయితే ఎన్నికలు పూర్తయిన నెల రోజులకే ఆయన మృతిచెందారు. దీంతో ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గెలుపొందారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్ట లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచినా, డిపాజిట్లు కూడా దక్కలేదు. నందిగామ నియోజకవర్గం మొత్తం జనాభా : 2,54,734 పురుషులు : 1,26,203 మహిళలు : 1,28,531 నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య : 1,93,712 పురుషులు : 95,279 మహిళలు : 98,426 థర్డ్ జెండర్ : 7 విస్తీర్ణం(చదరపు కిలోమీటర్లలో : 718 రెవెన్యూ గ్రామాలు : 81 గ్రామ పంచాయతీలు : 69 -
ఉప ఎన్నిక ఖాయం
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు నేడు నామినేషన్ నందిగామ : నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు పార్టీ ప్రకటించడంతో పోటీ అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉప ఎన్నిక జరుగనుంది. చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే పోటీ పెట్టకూడదని ఒక సంప్రదాయం ఉంది. ఆ క్రమంలోనే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను టీడీపీ అధిష్టానంతో సహా నాయకులంతా సౌమ్య ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీలు ఎవ రూ పోటీ చేయరని మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రజలు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నందిగామ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడపాటి బాబురావును పోటీలో దింపుతున్నట్లు ప్రకటించడంతో పోటీ అనివార్యం కానుంది. చిన్న, చితకా పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయకుండా ఉంచేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని బుజ్జగించి నామినేషన్లు వేయకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అవాక్కయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు మధ్య గట్టి పోటీ జరిగింది. తంగిరాల ప్రభాకరరావు 5212ఓట్లతో విజయం సాధించారు. కానీ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మరణించారు. -
నందిగామలో వైఎస్సార్ సీపీ హవా
పచ్చచొక్కాలకు ఓటమి కలవరం నందిగామ నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఇది రేపటి విజయానికి సంకేతమని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో తన పట్టు ఏ స్థాయిలో ఉందో తమ పార్టీ నిరూపించిందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీదే పట్టు. అయితే ఈ సారి పరిస్థితి మారింది. తొలిసారి పల్లె ఎన్నికల బరిలో దిగిన వైఎస్సార్ సీపీ తన ప్రజాబల ంతో టీడీపీకి ముచ్చెమటలు పట్టించింది. దీంతో ఒక్కసారిగా పచ్చచొక్కాల్లో కలవరం మొదలైంది. నిన్నటి వరకూ విజయం తమదేనంటూ ఢాంబికాలు పోయిన తెలుగు తమ్ముళ్ల ధైర్యం మేకపోతు గాంభీర్యం చందం అనేది బట్టబయలైంది. అయితే లగడపాటి సర్వే అంచనాలు పచ్చ చొక్కాలకు కాస్త ఊరటనిచ్చాయి. లగడపాటి మాటలు నమ్మలేమంటూ సొంతవర్గం నేతలే కొట్టిపారేస్తున్నారు. ఇదంతా ఎన్నిక ఫలితాలపై బెట్టింగ్‌లు పెంచేందుకు లగడపాటి మొదలుపెట్టిన మైండ్‌గేమ్‌గా అభివ ర్ణిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలను చూసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు పల్లెల్లో ఎదురైన చేదు అనుభవంతో బిత్తరపోయారు. అయినప్పటికీ తమదే గెలుపంటూ ఒకరికొక రు ధ్యైర్యం చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి పెట్టనికోటగా ఉంటూ ఇప్పటి వరకూ అండగా నిలిచిన చందర్లపాడు మండలపరిషత్ పీఠాన్ని తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మండల కేంద్రంలో మూడు ఎంపీటీసీ స్థానాలు గెలిచి టీడీపీకి పట్టున్న పీఠాన్ని కదిలించింది. నందిగామ మండల పరిషత్, జెడ్పీటీసీనూ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుని నియోజకవర్గ కేంద్రంలో పాగా వేసింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావుకు జెడ్పీటీసీగా పట్టంకట్టిన వీరులపాడు మండలం ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఖాతాలో చేరి పోయింది. అక్కడ వైఎస్సార్సీపీ బలమైన కేడర్ తమ సత్తా ఏమిటో చాటిచెప్పింది. ఇదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృత్తం అవుతుందని వైఎస్సార్ సీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించినందుకు ధన్యవాదాలు ఇదిలా ఉంటే నందిగామ నియోజకవర్గంలో రెండు జెడ్పిటీసీలు, మూడు మండల పరిషత్‌లలో వైఎస్సార్ సీపీని గెలిపించినందుకు ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బుధవారం ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పార్టీని ఆదరించిందనందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. నందిగామ జడ్పిటీసీ సభ్యురాలుగా కోవెలమూడి ప్రమీలారాణి గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నియోజకవర్గ నాయకుడు కోవెలమూడి వెంకటనారాయణ, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీ శైల వాసు, నాలుగు మండలా, పట్టణ కన్వీనర్లు తాటి రామకృష్ణారావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు, కోట బుచ్చయ్యచౌదరి, బండి జానకీరామయ్య, కోటేరు ముత్తారెడ్డి, కేడీసీసీ డెరైక్టర్ కొమ్మినేని రవిశంకర్, సహకార సంఘ అధ్యక్షుడు గాడిపర్తి శివాజి, గోళ్లమూడి వెంకటేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, గుడివాడ సాంబశివరావు, మహ్మద్ మస్తాన్ తదితరులు కూడా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.