దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ అరెస్ట్‌ | South Korean President Yoon Arrested | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ అరెస్ట్‌

Published Wed, Jan 15 2025 8:09 AM | Last Updated on Wed, Jan 15 2025 8:37 AM

South Korean President Yoon Arrested

సియోల్: దక్షిణ కొరియా(south Korea)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను దక్షిణ కొరియా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు తెలిపారు. 

దేశంలో ‘మార్షల్‌ లా’ విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ను (Yoon Suk Yeol) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం తెల్లవారుజామున దాదాపు 3000 మంది పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు యూన్‌ నివాసానికి చేరుకున్నారు. యూన్‌ను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన వీరిని అతడి మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్‌ సుక్‌ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడి నుంచి తరలించారు.

యూన్ అరెస్ట్‌ నేపథ్యంలో అతడి మద్దతుదారులు, పాలక పీపుల్ పవర్ పార్టీ సభ్యులను అధ్యక్షుడిని అరెస్ట్‌ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక, దక్షిణ కొరియా చరిత్రలో అధ్యక్షుడు అరెస్ట్‌ కావడం ఇదే మొదటి సారి. దీంతో, యూన్‌ పేరులో రికార్డుల్లోకి ఎక్కింది. గతంలో యోల్‌ను అరెస్టు చేసేందుకు ఓసారి ప్రయత్నించగా.. పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్లాన్‌ ప్రకారం అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

ఇదిలా ఉండగా.. యూన్ సుక్ యోల్‌ గతేడాది దక్షిణ కొరియా ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ (Emergency Martial Law) విధించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్‌ తన ప్రకటనను విరమించుకున్నా.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ‘మార్షల్‌ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్‌ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్‌ ప్రకటించారు.

 

మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement