శాంసంగ్‌తో అవినీతి.. దేశాధ్యక్ష పదవి ఊడింది
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హే(65)పై పార్లమెంటు ఆమోదించిన అభిశంసన తీర్మానాన్ని ఆ దేశ సుప్రీం కోర్టు సమర్ధించింది. దీంతో పార్క్ పదవి నుంచి తప్పుకోనున్నారు. అభిశంసనతో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న ఒక దేశ అధ్యక్షురాలిని తొలగించడం దక్షిణ కొరియాలో ఇదే తొలిసారి. పార్క్ కొందరు వ్యాపారవేత్తలతో చేతులు కలిపి అవినీతికి పాల్పడటం వల్ల దక్షిణ కొరియాలో కొద్ది నెలలుగా రాజకీయ అనిశ్చితి నెలకొంది.
తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్‌తో కుమ్మక్కై పార్క్ శాంసంగ్ గ్రూప్ హెడ్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. 2015లో దేశంలో రెండు చోట్ల ఉన్న శాంసంగ్ కార్యాలయాలను ఒకే చోటుకు మార్చడం వెనుక కూడా పార్క్ హస్తం ఉంది. గతేడాది డిసెంబర్ 9న పార్క్‌పై ఉన్న ఆరోపణల కారణంగా ఆమె పదవిలో కొనసాగడానికి అనర్హురాలని దక్షిణ కొరియా పార్లమెంటు పేర్కొంది. అయినా వెనక్కు తగ్గని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
కేసును విచారించిన ఎనిమిది మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం పార్క్ అవినీతి పాల్పడ్డారని.. అధ్యక్ష పదవిలో కొనసాగడానికి ఆమె అనర్హురాలని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయితే 60 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని/అధ్యక్షురాలిని ఎన్నుకోవాల్సివుంటుంది.