Portugal Election Results 2022: Socialist Win Third General Election With Huge Majority - Sakshi
Sakshi News home page

Portugal Election Results 2022: పోర్చుగల్‌లో సోషలిస్టుల గెలుపు

Published Tue, Feb 1 2022 4:42 AM | Last Updated on Tue, Feb 1 2022 10:02 AM

Socialist party wins third general election in Portugal - Sakshi

లిస్బన్‌: పోర్చుగల్‌లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్‌తో కునారిల్లిన పోర్చుగల్‌ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్‌ యూనియన్‌ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు.

ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్‌–రైట్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్‌ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు.  

116 సీట్ల మెజార్టీ..
పార్లమెంట్‌లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్‌ టెలివిజన్‌ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి.  పోర్చుగల్‌లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్‌లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్‌ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్‌లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్‌ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్‌లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది.  2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్‌ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్‌ బ్లాక్, పోర్చుగీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్‌లో సోషలిస్ట్‌ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది.

చేగా.. గెలుపు
పోర్చుగల్‌లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో  5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్‌టీపీ పోల్స్‌ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా.  గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్‌ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement