లిస్బన్/పోర్టో/పోర్చుగీసు : సాధారణంగా 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే రెండుమూడేళ్ల సమయం పడుతుంది. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను పక్కకు పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ల వినియోగానికి అనుమతిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. మన దేశంలో డీసీజీఐ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటి సామార్థ్యం పట్ల ఇప్పటికే జనాల్లో పలు అనుమానాలు తలెత్తుతుండగా.. వీటిని మరింత పెంచే సంఘటన ఒకటి పోర్చుగల్‌లో చోటు చేసుకుంది. ఓ నర్స్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత చనిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాక వ్యాక్సిన్ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతుంది. వివరాలు.. సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్ నర్స్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు. (చదవండి: వివాదంలో ‘అనుమతులు’)
ఈ సందర్భంగా సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక సోనియాకు మద్యం అలవాటు లేదని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,27,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,118 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment