బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్‌వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి.
కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్‌కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు.
కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్
జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది.
ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్‌ఓ
బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది.
ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్
దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్‌లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్‌వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
భారత్ సంగతేంటి?
ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే
శాలు జారీ చేసింది.
డబ్ల్యూహెచ్‌ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ
బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్‌పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment