omicron variant
-
Covid Omicron Variant: మన జాగ్రత్తలే మనకు రక్ష
ఆయుధాలను పోగేసుకున్న చందాన ‘కోవిడ్–19’ వ్యాక్సిన్లను సంపన్నదేశాలు పోగేసుకున్నాయి. దీంతో ప్రపంచమంతటా వ్యాక్సినేషన్ అమలు లక్ష్యానికి ఇవి చాలా దూరంలో ఉండిపోయాయి. మరోవైపున ఒక దేశంలో, లేక కొన్ని దేశాల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ వల్ల ఈ మహమ్మారిని తుడిచిపెట్టలేమని ముంచుకొస్తున్న ఒమిక్రాన్ వైరస్ రకం తేటతెల్లం చేస్తోంది. పరీక్ష చేయించుకోవడం, మాస్కులు ధరించడం, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు వేయించడం మాత్రమే దీనికి పరిష్కారం. ఎప్పటిలాగే మనం తీసుకునే జాగ్రత్తలే ఈ కొత్త వైరస్ రకం నుంచి కూడా మనల్ని కాపాడతాయి. ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైనా... దాన్ని ఎదుర్కొనే పద్ధతుల్లో మాత్రం మార్పు ఉండదు. ఏ దేశమైనా సరే తాను మాత్రమే త్వరగా వైరస్ నుంచి బయటపడాలనుకోవడం అర్థరహితం. మన జాగ్రత్తలే మనకు రక్ష కోవిడ్–19 వైరస్ రకాల్లో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కొత్త రకం బి.1.1.529 (ఒమిక్రాన్) గురించి ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆయా ప్రభుత్వాల అధినేతలూ, ఉన్నతాధికారులు సైతం దీని ప్రమాదం గురించి అర్థం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. గత వారం మాత్రమే ఈ కొత్త వైరస్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి అంతగా తెలీదు. దీన్ని చాలా త్వరగానే కనుగొనడం ఒక్కటే మంచివార్త. అంటే వైరస్ వ్యతిరేక ప్రపంచ నిఘా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని అర్థం. అయితే దీని జన్యురాశి (జీనోమ్)లో గరిష్ఠ సంఖ్యలో ఉత్పరివర్తనాలను కనుగొనడమే ఆందోళనకరంగా ఉంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు ఒమిక్రాన్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వైరస్ తన ప్రతిరూపాన్ని సృష్టించుకున్న ప్రతిసారీ, అది పరివర్తన చెందే అవకాశం ఉంటుంది. వైరస్ తన ప్రతిరూపాన్ని ఎంత ఎక్కువగా సృష్టించుకుంటే, అంత ఎక్కువ సంఖ్యలో దాని పరివర్తనలు సంభవించే అవకాశం ఉంది. పరివర్తనలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా కొత్త వైరస్లు ఆవిర్భవించే అవకాశం కూడా ఉంది. ఇది సింపుల్ గణితం అన్నమాట. చాలా పరివర్తనలు మనకు తెలీకుండానే వచ్చి పోతుంటాయి. వైరస్ స్వభావాన్ని మౌలికంగా మార్చివేసే పరివర్తనలనే మనం తరచుగా చూస్తూ ఉంటాం. కొత్త వైరస్ రకం గురించి, అది ఎంత వేగంగా విస్తరిస్తుంది అనే అంశం గురించి ప్రధానంగా మూడు అంశాలు నిర్దేశిస్తున్నాయి. ఈ కొత్త వైరస్ రకం పట్ల సమాజం ఏ స్థాయిలో కలవరపడాలి? అది మరింత ప్రాణాంతకమైనదా? ప్రస్తుతం మనలో ఉన్న రోగనిరోధక శక్తిని అది తుత్తునియలు చేస్తుందా? అనేవి కీలకమైనవి. ఈ కొత్త వైరస్ రకాన్ని మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. దీని గురించి ఇప్పటికి మనం అర్థం చేసుకునే దశలోనే ఉన్నాం. అది నిజంగా ప్రమాదకరమైనదే అయితే, దాని ప్రాబల్యాన్ని పరిమితం చేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ సమాజం చేపట్టాలి. ప్రాథమిక డేటా ప్రకారం, ఈ వైరస్ రకం మునుపటి వైరస్ రకాలను తోసిరాజంటున్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన డెల్టా వైరస్ రకం కంటే ఇది అతి వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో అతి కొద్ది సంఖ్యలో బయటపడిన కేసుల ప్రాతిపదికపై ఈ అంచనాకు వచ్చారు. ఇది ఎంత వేగంగా విస్తరిస్తోందనే అంశంపై ఇప్పటికీ అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఈ కొత్త వైరస్ రకంలోని కొన్ని పరివర్తనలు గతంలో ఇతర వైరస్ రకాల్లో అధికంగా కనిపించేవి. అందుకే దీని విస్తరణ సామర్థ్యం గురించి సైంటిస్టులు అంతగా భీతిల్లుతున్నారు. సాపేక్షంగా పరిమితమైన కేస్ డేటాతో పాటు, కొత్త వైరస్ రకంలో ఇప్పటికే చాలా పరివర్తనలు కనిపిస్తున్నందున తక్కువ సంఖ్యలో వెలుగులోకి వచ్చిన జీనోమ్‌లు మరింత ప్రమాద కారణం కావచ్చు. ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రొటీన్‌ని మార్చివేసే కొత్త పరివర్తనలు గతంలోని వైరస్ రకాలకు భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సి న్లకు ఇవి లక్ష్యంగా లేవు. అంటే ఉనికిలో ఉన్న వ్యాక్సిన్లు కొత్త వైరస్ రకంపై పనిచేయవనిపిస్తుంది. ఈ కొత్త వైరస్ రకం మన రోగనిరోధక వ్యవస్థను నిర్మూలించే సామర్థ్యంతో ఉందని వస్తున్న వార్తలు ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఒమి క్రాన్ని అడ్డుకోవడంపై దేశదేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులను పరి మితం చేసిన తొలి దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లో కొత్త వైరస్ రకం బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన ప్రయాణికుడి ద్వారా ఇది ఆ దేశంలో అడుగుపెట్టినట్లు తేలింది. ఇది సామూహిక వ్యాప్తిని కలిగిస్తుందా అని చూడాల్సి ఉంది. ఈ కొత్త వైరస్ రకం యూరప్‌ని కూడా చేరుకున్నట్లు భావి స్తున్నారు. బెల్జియంలో ఇప్పటికే తొలి కేసు బయటపడింది. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాలు ఇప్పటికే ఆఫ్రికా దేశాల ప్రయాణికుల జాబితాను రెడ్ లిస్టులో పెట్టాయి. ఈ దేశాలనుంచి వచ్చిన తమ దేశస్థులను ఇంట్లోనే ఒంటరిగా ఉండాలని సూచించాయి. అయితే ప్రమాదకర దేశాల జాబితాకు వెలుపల ఉన్న దేశాల నుంచి కొత్త వైరస్ రకం ఇప్పటికే దిగుమతై ఉందా అనేది యూరప్‌ని కలవరపెడుతోంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఇంకా కొత్త వైరస్ రకాన్ని కనుగొనటం జరగలేదు. అంతేకాకుండా క్వారంటైన్ ఆంక్షలను తప్పించుకోవడానికి మరో దేశం నుంచి ప్రయాణించి స్వదేశం చేరుకునే వారి ద్వారా కొత్త వైరస్ రకం ప్రవేశించే ప్రమాదం కూడా లేకపోలేదు. కొత్త వైరస్ రకం విస్తరించడానికి ఇదే చక్కటి మార్గంగా ఉంది. ఇలాంటి లోపాలను వెంటనే అరికట్టాలి. పైగా ఇది ప్రజల మధ్య విస్తరించడం మొదలెడితే కాంటాక్ట్ టెస్టింగ్, ట్రేసింగ్ను కూడా పెంచాల్సి ఉంటుంది. కోవిడ్–19 పాజిటివ్‌గా బయట పడిన వారితో సంబంధంలో ఉన్న వారందరికీ తప్పకుండా పరీ క్షలు చేయాలి. ఇలా చేస్తే ప్రారంభంలోనే కొత్త వైరస్ రకం వ్యాప్తిని అరికట్టవచ్చు. సామూహికంగా కొత్త వైరస్ రకం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తేలినప్పుడు సామూహిక పరీక్షలకు కూడా సిద్ధం కావాలి. ఒకటి మాత్రం నిజం. ఏ కొత్త వైరస్ రకమైనా సరే.. కోవిడ్ నిరోధక చర్యలను మౌలికంగా మార్చలేదు. ప్రజలందరికీ వ్యాక్సిన్లను వేయించడం, వీలైతే బూస్టర్ డోస్‌లు కూడా వేసుకునేలా ప్రోత్సహించడాన్ని మునుపటిలానే కొనసాగించాలి. సామూహిక స్థలాల్లో గాలి ధారాళంగా వీచేలా ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో వైరస్ వ్యాప్తి చేయకుండా సత్వర చర్యలు చేపట్టాలి. కోవిడ్ లక్షణాల గురించి మెసేజ్ రూపంలో పంపడాన్ని మెరుగుపర్చాలి. బహిరంగ స్థలాల్లో, ప్రజా రవాణాలో, సూపర్ మార్కెట్లలో, వ్యాపార సంస్థల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలి. వీలైనంతవరకు ఇంటి నుంచే పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన చర్యలన్నింటినీ చేపట్టాలి. ఏ దేశమైనా సరే తాను మాత్రమే త్వరగా వైరస్ నుంచి బయటపడాలనుకోవడం అర్థరహితం. మహమ్మారి అంటే ప్రపంచ సమస్య అని దాని నిర్వచనమే చెబుతోంది. యావత్ ప్రపంచ పరిష్కారం ద్వారానే దీన్ని అరికట్టవచ్చు. ప్రపంచమంతటా కోవిడ్ కేసులను తగ్గించాలంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు జరగాలి. ఈ దిశగా సంపన్న దేశాలు పెద్దగా లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. యావత్ ప్రపంచాన్ని సురక్షితంగా మలిచేంతవరకు ఒక దేశంలో, లేక కొన్ని దేశాల్లో వైరస్‌ని నిర్మూలించడం అనేది ఈ మహమ్మారిని తుడిచిపెట్టలేదని కొత్తగా బయటపడిన ఒమిక్రాన్ వైరస్ రకం తేటతెల్లం చేస్తోంది. – కిట్ యేట్స్, డైరెక్టర్, సెంటర్ ఫర్ మేథమేటికల్ బయాలజీ, బాత్ వర్సిటీ -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: టీకా సర్టిఫికేట్, క్వారంటైన్ తప్పనిసరి
ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త వేరియంట్ కట్టడి కోసం రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విధించింది. అవేంటంటే.. (చదవండి: Omicron: న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం) 1. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పక పాటించాలి. 2. రాష్ట్రానికి వచ్చే దేశీయ ప్రయాణికులు తప్పనసరిగా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలి. లేదా.. 72 ముందు చేసిన పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. 3. బస్సు, టాక్సీ, ఇతర వాహనాల్లో కోవిడ్ రూల్స్ ఉల్లంఘించినట్లు తెలిస్తే.. డ్రైవర్, కండక్టర్ 500 రూపాయల జరిమానా చెల్లించాలి. 4. బస్సుల్లో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకుంటే.. ట్రాన్స్పోర్ట్ యజమాని 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. 5. ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే బంధువులు, నిర్వహకులు, సిబ్బంది తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకోవాలి. 6. టీకా రెండు డోసులు తీసుకున్న వారికే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లభిస్తుంది. 7. సినిమాల హాళ్లు, ఫంక్షన్ హాల్స్ వంటి వాటిలోకి 50 శాతం మందికి మాత్రమే అనుమతి. 8. దక్షిణాఫ్రికా నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చే వారు తప్పనిసరిగా క్వారంటైన్లోకి వెళ్లాల్సిందే. #COVID19 | Maharashtra Govt issues fresh restrictions & permissions. All travellers into state from any int'l destination shall be governed by directions of Govt of India in this respect. Domestic travellers shall either be fully vaccinated or carry RT-PCR test valid for 72 hrs. pic.twitter.com/rSQBik6aPQ — ANI (@ANI) November 27, 2021 తెలంగాణలో... ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఆదివారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ కానున్నారు. చదవండి: ఒకే చోట 281 కేసులు.. లాక్డౌన్ విధిస్తారా?! డబుల్ డోస్ వ్యాక్సిన్.. అయినా 66 మందికి సోకిన కరోనా! -
Omicron: న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
న్యూయార్క్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ బి.1.1.529 హడలెత్తిస్తోంది. ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఈ వేరియంట్లో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా కొత్త వేరియంట్ B.1.1.529కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్ ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ జాబితాలో చేర్చింది. చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది? అయితే ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పటివరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. చదవండి: Omicron: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు -
Omicron ఎఫెక్ట్.. కీలక భేటీ నిరవధిక వాయిదా!
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త గుబులుతో ఉడికిపోతోంది. బీ.1.1.529 కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన పెరిగిపోతోంది. వ్యాక్సిన్లకు సైతం తలొగ్గని ఒమిక్రాన్ మొండి వేరియంట్ కావడంతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే వారం జెనీవాలో డబ్ల్యూటీవో మినిస్టీరియల్(ఎంసీ12) కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. అయితే కొత్త వేరియెంట్ ఠారెత్తిస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో 98 శాతం వాణిజ్యాన్ని సమీక్షించే డబ్ల్యూటీవోలో 164 మంది సభ్యులు ఉన్నారు. ఇక నవంబర్ 30 డిసెంబర్ 3 మధ్య వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎంసీ12 సమావేశం జరగాల్సి ఉంది. అయితే స్విస్ ప్రభుత్వం శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా ట్రావెల్ బ్యాన్ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం ఇతర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే భేటీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది WTO. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాక.. త్వరలో జరగాల్సిన కీలక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు చాలానే వాయిదా పడ్డాయి. చదవండి: ఆ మార్కెట్లో మళ్లీ కరోనా కలకలం -
కరోనా కొత్త వేరియంట్ కలకలం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారులను కోరారు. కొత్త వేరియంట్‌కు సంబంధించిన పరిణామాలపై క్లుప్తంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా 'ప్రమాదంలో' ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. వీటితో పాటు ముఖానికి మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డా. వీకే పాల్ హాజరుకానున్నారు. దక్షిణాఫ్రికాలో వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షడంతో పాటు దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకనేందుకు తగిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు -
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు
జొహన్నెస్‌బర్గ్: గత కొంత కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆరోగ్యం పరంగానేగాక ఆర్థికంగానూ దెబ్బతిన్నాయి. ఇటీవలే వైరస్ రక్కసి నుంచి తప్పించుకున్నామని కాస్త ఊపిరి పీల్చుకునేలోపే ప్రపంచానికి దక్షిణాఫ్రికా ఓ బాంబు పేల్చింది. ఆ దేశంలో.. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్ కొందరిలో వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది. కోవిడ్-19 ఎపిడెమియాలజీలో హానికరమైన మార్పును సూచించే సాక్ష్యాధారాల ఆధారంగా.. డబ్ల్యూహెచ్ఓ B.1.1.529 వేరియంట్‌కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్ ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ జాబితాలో చేర్చింది. తాజాగా ఇజ్రాయిల్, బెల్జియంలోనూ ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భారత్ దక్షిణాఫ్రికా మద్య జరగనున్న క్రికెట్ సిరీస్ కూడా సందిగ్థంలో పడింది. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకలను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. కొత్త వేరియంట్ తెరపైకి రావడంతో స్టాక్ మార్కెట్లు, పతనం వైపుకు పరుగులు పెరుగుతున్నాయి. అంతేగాక ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఈ వేరియంట్ ఆటంకంగా మారనుంది. చదవండి: Covid Variant: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్ -
ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్‌కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు. కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్ జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది. ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్ సంగతేంటి? ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే శాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్‌పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు.