ఆయుధాలను పోగేసుకున్న చందాన ‘కోవిడ్–19’ వ్యాక్సిన్‌లను సంపన్నదేశాలు పోగేసుకున్నాయి. దీంతో ప్రపంచమంతటా వ్యాక్సినేషన్ అమలు లక్ష్యానికి ఇవి చాలా దూరంలో ఉండిపోయాయి. మరోవైపున ఒక దేశంలో, లేక కొన్ని దేశాల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ వల్ల ఈ మహమ్మారిని తుడిచిపెట్టలేమని ముంచుకొస్తున్న ఒమిక్రాన్ వైరస్ రకం తేటతెల్లం చేస్తోంది. పరీక్ష చేయించుకోవడం, మాస్కులు ధరించడం, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు వేయించడం మాత్రమే దీనికి పరిష్కారం. ఎప్పటిలాగే మనం తీసుకునే జాగ్రత్తలే ఈ కొత్త వైరస్ రకం నుంచి కూడా మనల్ని కాపాడతాయి. ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైనా... దాన్ని ఎదుర్కొనే పద్ధతుల్లో మాత్రం మార్పు ఉండదు. ఏ దేశమైనా సరే తాను మాత్రమే త్వరగా వైరస్ నుంచి బయటపడాలనుకోవడం అర్థరహితం.
మన జాగ్రత్తలే మనకు రక్ష
కోవిడ్–19 వైరస్ రకాల్లో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కొత్త రకం బి.1.1.529 (ఒమిక్రాన్) గురించి ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆయా ప్రభుత్వాల అధినేతలూ, ఉన్నతాధికారులు సైతం దీని ప్రమాదం గురించి అర్థం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. గత వారం మాత్రమే ఈ కొత్త వైరస్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి అంతగా తెలీదు.
దీన్ని చాలా త్వరగానే కనుగొనడం ఒక్కటే మంచివార్త. అంటే వైరస్ వ్యతిరేక ప్రపంచ నిఘా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని అర్థం. అయితే దీని జన్యురాశి (జీనోమ్)లో గరిష్ఠ సంఖ్యలో ఉత్పరివర్తనాలను కనుగొనడమే ఆందోళనకరంగా ఉంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు ఒమిక్రాన్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
వైరస్ తన ప్రతిరూపాన్ని సృష్టించుకున్న ప్రతిసారీ, అది పరివర్తన చెందే అవకాశం ఉంటుంది. వైరస్ తన ప్రతిరూపాన్ని ఎంత ఎక్కువగా సృష్టించుకుంటే, అంత ఎక్కువ సంఖ్యలో దాని పరివర్తనలు సంభవించే అవకాశం ఉంది. పరివర్తనలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా కొత్త వైరస్‌లు ఆవిర్భవించే అవకాశం కూడా ఉంది. ఇది సింపుల్ గణితం అన్నమాట. చాలా పరివర్తనలు మనకు తెలీకుండానే వచ్చి పోతుంటాయి. వైరస్ స్వభావాన్ని మౌలికంగా మార్చివేసే పరివర్తనలనే మనం తరచుగా చూస్తూ ఉంటాం.
కొత్త వైరస్ రకం గురించి, అది ఎంత వేగంగా విస్తరిస్తుంది అనే అంశం గురించి ప్రధానంగా మూడు అంశాలు నిర్దేశిస్తున్నాయి. ఈ కొత్త వైరస్ రకం పట్ల సమాజం ఏ స్థాయిలో కలవరపడాలి? అది మరింత ప్రాణాంతకమైనదా? ప్రస్తుతం మనలో ఉన్న రోగనిరోధక శక్తిని అది తుత్తునియలు చేస్తుందా? అనేవి కీలకమైనవి. ఈ కొత్త వైరస్ రకాన్ని మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. దీని గురించి ఇప్పటికి మనం అర్థం చేసుకునే దశలోనే ఉన్నాం. అది నిజంగా ప్రమాదకరమైనదే అయితే, దాని ప్రాబల్యాన్ని పరిమితం చేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ సమాజం చేపట్టాలి.
ప్రాథమిక డేటా ప్రకారం, ఈ వైరస్ రకం మునుపటి వైరస్ రకాలను తోసిరాజంటున్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన డెల్టా వైరస్ రకం కంటే ఇది అతి వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో అతి కొద్ది సంఖ్యలో బయటపడిన కేసుల ప్రాతిపదికపై ఈ అంచనాకు వచ్చారు. ఇది ఎంత వేగంగా విస్తరిస్తోందనే అంశంపై ఇప్పటికీ అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఈ కొత్త వైరస్ రకంలోని కొన్ని పరివర్తనలు గతంలో ఇతర వైరస్ రకాల్లో అధికంగా కనిపించేవి.
అందుకే దీని విస్తరణ సామర్థ్యం గురించి సైంటిస్టులు అంతగా భీతిల్లుతున్నారు. సాపేక్షంగా పరిమితమైన కేస్ డేటాతో పాటు, కొత్త వైరస్ రకంలో ఇప్పటికే చాలా పరివర్తనలు కనిపిస్తున్నందున తక్కువ సంఖ్యలో వెలుగులోకి వచ్చిన జీనోమ్‌లు మరింత ప్రమాద కారణం కావచ్చు. ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రొటీన్‌ని మార్చివేసే కొత్త పరివర్తనలు గతంలోని వైరస్ రకాలకు భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సి న్‌లకు ఇవి లక్ష్యంగా లేవు. అంటే ఉనికిలో ఉన్న వ్యాక్సిన్‌లు కొత్త వైరస్ రకంపై పనిచేయవనిపిస్తుంది.
ఈ కొత్త వైరస్ రకం మన రోగనిరోధక వ్యవస్థను నిర్మూలించే సామర్థ్యంతో ఉందని వస్తున్న వార్తలు ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఒమి క్రాన్‌ని అడ్డుకోవడంపై దేశదేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులను పరి మితం చేసిన తొలి దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లో కొత్త వైరస్ రకం బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన ప్రయాణికుడి ద్వారా ఇది ఆ దేశంలో అడుగుపెట్టినట్లు తేలింది. ఇది సామూహిక వ్యాప్తిని కలిగిస్తుందా అని చూడాల్సి ఉంది.
ఈ కొత్త వైరస్ రకం యూరప్‌ని కూడా చేరుకున్నట్లు భావి స్తున్నారు. బెల్జియంలో ఇప్పటికే తొలి కేసు బయటపడింది. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాలు ఇప్పటికే ఆఫ్రికా దేశాల ప్రయాణికుల జాబితాను రెడ్ లిస్టులో పెట్టాయి. ఈ దేశాలనుంచి వచ్చిన తమ దేశస్థులను ఇంట్లోనే ఒంటరిగా ఉండాలని సూచించాయి. అయితే ప్రమాదకర దేశాల జాబితాకు వెలుపల ఉన్న దేశాల నుంచి కొత్త వైరస్ రకం ఇప్పటికే దిగుమతై ఉందా అనేది యూరప్‌ని కలవరపెడుతోంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఇంకా కొత్త వైరస్ రకాన్ని కనుగొనటం జరగలేదు.
అంతేకాకుండా క్వారంటైన్ ఆంక్షలను తప్పించుకోవడానికి మరో దేశం నుంచి ప్రయాణించి స్వదేశం చేరుకునే వారి ద్వారా కొత్త వైరస్ రకం ప్రవేశించే ప్రమాదం కూడా లేకపోలేదు. కొత్త వైరస్ రకం విస్తరించడానికి ఇదే చక్కటి మార్గంగా ఉంది. ఇలాంటి లోపాలను వెంటనే అరికట్టాలి. పైగా ఇది ప్రజల మధ్య విస్తరించడం మొదలెడితే కాంటాక్ట్ టెస్టింగ్, ట్రేసింగ్‌ను కూడా పెంచాల్సి ఉంటుంది. కోవిడ్–19 పాజిటివ్‌గా బయట పడిన వారితో సంబంధంలో ఉన్న వారందరికీ తప్పకుండా పరీ క్షలు చేయాలి. ఇలా చేస్తే ప్రారంభంలోనే కొత్త వైరస్ రకం వ్యాప్తిని అరికట్టవచ్చు. సామూహికంగా కొత్త వైరస్ రకం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తేలినప్పుడు సామూహిక పరీక్షలకు కూడా సిద్ధం కావాలి.
ఒకటి మాత్రం నిజం. ఏ కొత్త వైరస్ రకమైనా సరే.. కోవిడ్ నిరోధక చర్యలను మౌలికంగా మార్చలేదు. ప్రజలందరికీ వ్యాక్సిన్‌లను వేయించడం, వీలైతే బూస్టర్ డోస్‌లు కూడా వేసుకునేలా ప్రోత్సహించడాన్ని మునుపటిలానే కొనసాగించాలి. సామూహిక స్థలాల్లో గాలి ధారాళంగా వీచేలా ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో వైరస్ వ్యాప్తి చేయకుండా సత్వర చర్యలు చేపట్టాలి. కోవిడ్ లక్షణాల గురించి మెసేజ్ రూపంలో పంపడాన్ని మెరుగుపర్చాలి. బహిరంగ స్థలాల్లో, ప్రజా రవాణాలో, సూపర్ మార్కెట్లలో, వ్యాపార సంస్థల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలి. వీలైనంతవరకు ఇంటి నుంచే పనిచేయడాన్ని ప్రోత్సహించాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన చర్యలన్నింటినీ చేపట్టాలి. ఏ దేశమైనా సరే తాను మాత్రమే త్వరగా వైరస్ నుంచి బయటపడాలనుకోవడం అర్థరహితం. మహమ్మారి అంటే ప్రపంచ సమస్య అని దాని నిర్వచనమే చెబుతోంది. యావత్ ప్రపంచ పరిష్కారం ద్వారానే దీన్ని అరికట్టవచ్చు. ప్రపంచమంతటా కోవిడ్ కేసులను తగ్గించాలంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు జరగాలి. ఈ దిశగా సంపన్న దేశాలు పెద్దగా లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. యావత్ ప్రపంచాన్ని సురక్షితంగా మలిచేంతవరకు ఒక దేశంలో, లేక కొన్ని దేశాల్లో వైరస్‌ని నిర్మూలించడం అనేది ఈ మహమ్మారిని తుడిచిపెట్టలేదని కొత్తగా బయటపడిన ఒమిక్రాన్ వైరస్ రకం తేటతెల్లం చేస్తోంది. – కిట్ యేట్స్, డైరెక్టర్, సెంటర్ ఫర్ మేథమేటికల్ బయాలజీ, బాత్ వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment