కరోనా 2.0 పంజా! | COVID-19 is Secondary Waves Swamping Stocks | Sakshi
Sakshi News home page

కరోనా 2.0 పంజా!

Published Tue, Jun 16 2020 3:53 AM | Last Updated on Tue, Jun 16 2020 5:06 AM

COVID-19 is Secondary Waves Swamping Stocks - Sakshi

కొన్ని దేశాల్లో రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయంగా ఆర్థిక రికవరీ ఆశలకు గండి పడింది. దీంతో  ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా సోమవారం భారీగా నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు తగ్గి 76.03కు చేరడం, మన దేశంలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడం...  ప్రతికూల ్రçపభావం చూపించాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 552 పాయింట్ల నష్టంతో 33,229 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 159 పాయింట్లు పతనమై 9,814 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం మేర నష్టపోయాయి. వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ ఈ సూచీలు పతనమయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ పుంజుకోవడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బ్యాంక్, ఆర్థిక, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇంధన, ఫార్మా రంగ షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటుచేసుకుంది.  

రోజుకు లక్ష కరోనా కేసులు...
కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాతో పాటు అమెరికాతో సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ప్రబలుతున్నాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కొత్త, పాత కరోనా కేసులు కలిపి రోజుకు లక్షకు పైగా తేలుతున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళన నెలకొంది. ఇక మన దగ్గర గత మూడు రోజులుగా రోజుకు 10,000 మేర కరోనా కేసులు వస్తుండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నది.  

రోజంతా నష్టాలు...
ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో సెన్సెక్స్‌  857 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల మేర పతనమయ్యాయి. యూరప్‌ సూచీలు నష్టాల నుంచి ఒకింత రికవరీ కావడం, అమెరికా ఫ్యూచర్లు కూడా రికవరీ బాట పట్టడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పుంజుకోవడంతో మన దగ్గర మధ్యాహ్నం తర్వాత నష్టాలు తగ్గాయి. ఆసియా మార్కెట్లు 1–5 శాతం రేంజ్‌లో, యూరప్‌ మార్కెట్లు 1 శాతం రేంజ్‌లో నష్టపోయాయి.  

► ఇండస్‌ఇండ్‌  బ్యాంక్‌ 7 శాతం నష్టంతో రూ.490 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినా పలు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి.  లుపిన్, క్యాడిలా హెల్త్‌కేర్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

► మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ, టెలికం కంపెనీల ఏజీఆర్‌ » కాయిల విషయమై సుప్రీంకోర్టులో విచారణలు ఈ  వారంలోనే ఉండటంతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది.  మొండిబకాయిలకు సంబంధించి అనిశ్చితులు అధికంగా ఉండటంతో ప్రస్తుతానికైతే ఈ రంగ షేర్లకు దూరంగా ఉండమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.  

►  సెన్సెక్స్‌ 30 షేర్లలో నాలుగు షేర్లు–రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి.


మళ్లీ 77 దిశగా రూపాయి?
76.03 వద్ద ముగింపు ∙ఆరు వారాల కనిష్టం
డాలర్‌ మారకంలో రూపాయి విలువ మళ్లీ 77 దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం 19 పైసలు పతనమై 76.03 వద్ద ముగిసింది. ఇది ఆరు వారాల కనిష్ట స్థాయి. విదేశీ నిధులు వెనక్కు వెళుతుండటం, బలహీన ఈక్విటీ మార్కెట్,  కరోనా కేసులు పెరుగుతుండటం వంటి అంశాలు దీనికి నేపథ్యం. గత శుక్రవారం రూపాయి ముగింపు 75.84.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ). ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 రెండవ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలూ ఉన్నట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొంటున్నారు.

ఆల్‌టైమ్‌ హైకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో రెండు దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్‌ చేయడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై,రూ.1,627ను తాకింది. చివరకు 1.6  శాతం లాభంతో రూ.1,615 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి 23న రూ.867కు పడిన ఈ షేర్‌ మూడు నెలల్లోనే 80 శాతానికి పైగా ఎగియడం విశేషం.  మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పాక్షిక చెల్లింపు షేర్లు(పార్ట్‌లీ పెయిడప్‌ షేర్స్‌) మదింపు  ధర రూ.646తో పోల్చితే 8 శాతం లాభంతో రూ.698 వద్ద ముగిశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement