అటు చేరికలు..ఇటు పొత్తు..టీడీపీ చిత్తు
- పార్టీని వెన్నాడుతున్న తాజా కష్టాలు
- తలనొప్పిగా మారిన సీట్ల సర్దుబాటు
- గంటా బృందం చేరికతో కుమ్ములాట
- బీజేపీ డిమాండ్లతో మరింత సంక్షోభం
- తెలుగుతమ్ముళ్లలో ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చేరికలు, బీజేపీలో కుదురుతుందనుకుంటున్న పొత్తు జిల్లా టీడీపీకి వరంగా మారకపోగా శాపంగా పరిణమించింది. కొత్తగా వచ్చిన నేతలకుు సర్దుబాటు చేయలేక అష్టకష్టాలు పడుతుంటే బీజేపీ పొత్తు మరింతభారంగా తయారైంది. పొత్తు పెట్టుకొని అన్యాయం చేయవద్దంటూ అనితా సుకురు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు శనివారం పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు సైతం దిగారు.
మరోవైపు టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లు వద్దని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. పొత్తు వల్ల ఓట్ల మాట అటుంచి ఎన్ని సీట్లు పోతాయోనన్న ఆందోళన టీడీపీని వెంటాడుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు శానసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూరిలు చేరిన తరువాత పార్టీ ప్రతిష్ట పెరగకపోగా కుమ్ములాటలతో దిగజారింది. కన్నబాబు వందల కోట్ల దోపిడిదారు అని స్వయంగా చంద్రబాబు గతంలో ఆరోపించడం, రమేష్‌బాబు, వెంకట్రామయ్య, శ్రీనివాస్‌ల భూకబ్జాలకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమాలు నిర్వహించడంతో వీరి చేరికను క్యాడర్ ఇప్పటికీ ఆమోదించలేకపోయింది.
ఈ ముగ్గురు ప్రభుత్వ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలను పలు రకాలుగా వేధించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా గంటా కోట్ల రూపాయల ప్రభుత్వ గ్రంధాలయ స్ధలాన్ని దుర్వినియోగం చేయడం,పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై అప్పట్లో టీడీపీ విరుచుకుపడింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లిలో ఎన్‌టీఆర్ విగ్ర హ ఆవిష్కరణను అడ్డుకోవడం,సమైక్యాంధ్రా ఉద్యమకారులను అరెస్టులు చేయించి జైలుకు పంపడం వంటివాటిని టీడీపీ నేతలు మరువలేకపోతున్నారు. వీరి వెంట కాంగ్రెస్ క్యాడర్ రాక,టీడీపీ క్యాడర్ వీరితో కలవక ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
ఈ పరిస్ధితులను దృష్టిలో వుంచుకొని పార్టీ అధిష్టానం ఈ ఐదుగురిలో ముగ్గురికి టికెట్‌లకు నామం పెట్టేందుకు ఎత్తులు వేస్తోంది. టికెట్ రాదేమోఅన్న అభద్రతాభావంతో గంటా మిత్రులు, వీరి చేరికవల్ల తమ అవకాశాలు సన్నగిల్లాయని సీనియర్లు మదనపడుతున్నారు. కన్నబాబు, వెంకట్రాయమ్య, శ్రీనివాస్‌ల టికెట్‌ల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇక, వీరి చేరికల వల్ల టీడీపీ సీనియర్ నేతలు భరణికాణ రామారావు, కోన తాతారావు, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ తదితరులు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. బీజేపీతో పొత్తు పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టనుంది.
నగర మొదటి మేయర్ బీజేపీ నుంచే ఎన్నిక కావడం, గతంలో ఈ జిల్లానుంచి ఆ పార్టీకి శానసభ్యులుండడంతో కనీసం ఒక ఎంపీ, రెండు ఎంఎల్‌ఏ టి కెట్‌లు ఇవ్వాలని ఆ పార్టీ పట్టుపడుతోంది. బీజేపీ సీమాంధ్రా అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు కూడా విశాఖ వాసే కావడం, డీవీ సుబ్బారావు, పీవీ చలపతిరావు వంటి పెద్ద నేతలు వుండడంతో ఆ పార్టీ టికెట్‌లకు డిమాండు పెరిగింది.
ఇటీవల పలువురు నగర ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు బీజేపీలో చేరారు. పోటీకి వీరు సిద్ధపడ్డం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈనేపథ్యంలో పొత్తు కుదిరితే కుమ్ములాటలు తప్పవని టీడీపీ జిల్లా నేతలు భయపడుతున్నారు. విశాఖ ఎంపీతో పాటు విశాఖ ఉత్తర, దక్షిణ లేదా అరకు శాసనసభాస్ధానాలు కావాలని బీజేపీ అడుగుతుండడం టీడీపీలో టెన్షన్‌ను పెంచుతోంది.