- విభిన్నంగా స్పందించిన గ్రేటర్ జనం
- సైకిల్ జోరు.. కాషాయ సేనకు హుషారు
- పట్టు నిలుపుకొన్న ఎంఐఎం
- మట్టి కరిచిన తాజా మాజీ మంత్రులు
- సిట్టింగ్‌లకు చెల్లుచీటి
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తమదైన ముద్ర చూపారు. వరుసగా రెండు దఫాలుగా అధికారంలో కొనసాగిన.. మహా మహా కాకలు తీరిన తాజా మాజీ మంత్రులను సైతం మట్టి కరిపించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ తిరిగి అవకాశమివ్వలేదు. అందరినీ ఓడించి తాము తలచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. నగరంలో నామ్‌కేవాస్తేగా ఉన్న కాషాయసేనకు కొత్త శక్తినిచ్చారు.
రెండు ఎన్నికల్లో గాలి పోయిన సైకిల్ పార్టీకి జవసత్వాలిచ్చారు. టీఆర్‌ఎస్ గౌరవానికి భంగం వాటిల్లకుండా చేశారు. కాంగ్రెస్ నుంచి మంత్రులుగా ఉన్న దానం నాగేందర్, ముఖేశ్‌లను ఓడించారు. విపత్తు నివారణ కమిటీ వైస్‌చైర్మన్‌గా పనిచేసిన మర్రి శశిధర్‌రెడ్డిని తిప్పికొట్టారు. జయసుధను ఓడించి సినీగ్లామర్ రెండో పర్యాయానికి పనికి రాదని నిరూపించారు.
హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా లేని టీడీపీకి నగరంలో మూడు స్థానాలతోపాటు శివార్లలోని ఆరుస్థానాలు కట్టబెట్టడంతో గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ అంబర్‌పేట, ఖైరతాబాద్, గోషామహల్, ముషీరాబాద్, ఉప్పల్‌లలో పాగా వేసింది. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. మల్కాజిగిరి, పటాన్‌చెరులలో కూడా టీఆర్‌ఎస్ నెగ్గింది.
మోడీ మంత్ర..
టీడీపీ- బీజేపీ పొత్తు రెండు పార్టీలకూ ఉపకరించింది. కేంద్రంలో మోడీని ప్రధానిని చేయాలంటూ వివిధ మార్గాల్లో సాగిన విస్తృతప్రచారం ఆ పార్టీలకు ఉపకరించింది. అభ్యర్థులెవరన్నది పట్టించుకోకుండా.. టీడీపీ- బీజేపీ కూటమికి ప్రజలు మొగ్గు చూపినట్లు ఓట్ల సరళిని బట్టి తెలుస్తోంది. ఫలితంగా ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఐదు స్థానాలు సాధిం చింది.
పాతబస్తీలో ఎంఐఎం హవా యథావిధిగా కొనసాగింది. దాని ఖాతాలోని ఏడు స్థానాల్నీ తిరిగి దక్కించుకుంది. పాతబస్తీలో ఒక విధంగా.. మిగతా గ్రేటర్‌లో మరో విధంగా తీర్పునిచ్చిన ఓటర్లు.. ఎవరినైనా సరే తాము ఏం చేయదలచుకుంటే అదే చేయగలమని నిరూపించారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా తమ నిర్ణయాత్మక శక్తి ముందు ఏవీ పనిచేయవని చాటి చెప్పారు.
పాతకొత్తల మేలు కలయికగా.. పాతబస్తీలో యథావిధి తీర్పునివ్వగా, కొత్తనగరంలో పాతవారికి సెలవు పలికారు. గతంలో బీజేపీకి ఉన్న ఒకేఒక్క సీటు అంబర్‌పేటను తిరిగి కిషన్‌రెడ్డికి భారీ మెజార్టీతో కట్టబెట్టారు. ఈ గెలుపుతో అంబర్‌పేట నుంచి ఆయన హ్యాట్రిక్ సాధించారు. ఢిల్లీ రాజ్యసభ నుంచి దిగివచ్చి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావుకు తాము చెప్పాలనుకున్నది చాటి చెప్పారు.
లోక్‌సభ స్థానాల్లోనూ..
ఇక గ్రేటర్ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఓటర్లు తమదైన విశిష్టతను చాటారు. నాలుగు నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీల అభ్యర్థులను గెలిపించారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, సికింద్రాబాద్ నుంచి బీజేపీకి చెందిన బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి నుంచి టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి, చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను గెలిపించారు.
గ్రేటర్‌లో ఆయా పార్టీలకు దక్కిన అసెంబ్లీ స్థానాలివీ...
కాంగ్రెస్: ---------
టీడీపీ: జూబ్లీహిల్స్, సనత్‌నగర్,
కంటోన్మెంట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి.
బీజేపీ: అంబర్‌పేట, ఖైరతాబాద్,
గోషామహల్, ఉప్పల్, ముషీరాబాద్.
ఎంఐఎం: చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట.
టీఆర్‌ఎస్: సికింద్రాబాద్, పటాన్‌చెరు, మల్కాజిగిరి.