మాజీ మంత్రి దానం నాగేందర్
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) గెలుపు గుర్రాలతో ఎన్నికల రణంలోకి దిగే వ్యూహానికి తెర లేపింది. మాజీ మంత్రి దానం నాగేందర్‌తో పాటు నగరంలో సగం నియోజకవర్గాలను కొత్త నేతలతో నింపే దిశగా పావులు కదుపుతోంది. గడిచిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, పటాన్‌చెరు శాసనసభ స్థానాలనే గెలుచుకున్న టీఆర్‌ఎస్.. తదనంతరం టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకొని ఆయా నియోకజవర్గాల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది.
వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ పక్షాన ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బలమైన నాయకులు కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం వేట ప్రారంభించిన టీఆర్‌ఎస్.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో గత మూడేళ్లుగా టీఆర్‌ఎస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తున్న దానం నాగేందర్‌కు ఎట్టకేలకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ ‘ఆపరేషన్ ఆకర్‡్ష’ను అమలు చేయాలని భావిస్తోంది.
ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చేర్చుకునే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుధీర్‌రెడ్డి సైతం గడిచిన కొన్నాళ్లుగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సుధీర్‌రెడ్డి సేవలను విస్తృత స్థాయిలో వాడుకునే విషయంలో ఫెయిలైందన్న భావన కూడా పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. పార్టీ మారే విషయంలో సుధీర్‌రెడ్డి ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని ప్రకటించకుండా మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
అదే విధంగా ఉప్పల్ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌కు బలమైన నాయకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి అధికార టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల కంటే విస్తృత కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీ బలమైన నాయకుడి కోసం పావులు కదిపే యోచనలో ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కనకారెడ్డి సైతం వివిధ కారణాలతో క్యాడర్‌కు, జనానికి దూరంగా ఉండడం.. ఈ నియోకజవర్గంలో ఎమ్మెల్సీ హన్మంతరావు హడావుడి పెరగడం వల్ల మధ్యే మార్గంగా ప్రముఖ విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఓ యువ నాయకుడిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలన్న చర్చ టీఆర్‌ఎస్‌లో సాగుతోంది.
ఇక గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో బీజేపీ ఎమ్మెల్యేలకు దీటుగా పనిచేసే నాయకులు కూడా ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌లో కనిపించడం లేదు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని మలక్‌పేట, కార్వాన్, చంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా, యాకుత్‌పురాలో బలమైన నేతల కోసం వేట సాగుతోంది.
ఆ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా..
టీడీపీ తరఫున విజయం సాధించి టీఆర్‌ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ అవసరమైతే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంచుకునే ఛాన్స్ ఉండాలని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. సీఎం నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేని ఎమ్మెల్యేల స్థానే వారు సూచించిన కొత్త అభ్యర్థులను ప్రతిపాదించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment