భూమాయపై సీరియస్ | Serious on bhumaya | Sakshi
Sakshi News home page

భూమాయపై సీరియస్

Published Sat, Jul 5 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

భూమాయపై సీరియస్

భూమాయపై సీరియస్

  •       ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూములు
  •      రెవెన్యూ సిబ్బంది పాత్రే కీలకం
  •      అక్రమాలపై కలెక్టర ఆగ్రహం
  •      ఇప్పటికే ముగ్గురిపై వేటు
  •      మరో ఇద్దరిపై చర్యలకు రంగం సిద్ధం
  • విశాఖ రూరల్ : కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయాయి. రెవెన్యూ సిబ్బంది మాయాజాలంతో రికార్డులు తారుమారవుతున్నాయి. ఇటీవల అధికారులు ప్రభుత్వ భూములను సర్వే చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో వ్యవహారం బయటకు వస్తోంది.

    ఈ అక్రమాలపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. బాధ్యతలపై క్రిమినల్ కేసులు నమోదుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టడం.. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు బోర్డులు పెట్టడం.. ఆ వ్యక్తులతో కోర్టుల్లో కేసులు వేయించడం.. ఇలా రెవెన్యూ సిబ్బంది కీలక పాత్రే పోషించినట్టు తెలిసింది. రికార్డులను ట్యాంపర్ చేయడం, న్యాయస్థానాలకు సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడం, చివరకు కేసును నీరుగార్చేలా చేసి బడాబాబులకు సహకరించి లక్షల రూపాయలు వెనకేసుకున్న విషయాలు వెలుగుచూడడంతో రెవెన్యూలో కలకలం మొదలయింది.

    నడుపూరు, కొమ్మాది, పరదేశిపాలెం ప్రాంతాల్లో భూ అక్రమాలపై కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు సీరియస్‌గా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కొంత మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.

    ఇందులో భాగంగా పరదేశిపాలెం, కొమ్మాదిలో భూములను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. 152 సర్వే నంబర్ భూములకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ భూములను అధికారులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించినా న్యాయస్థానంలో కేసు ఉండడంతో దానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. దీనిపై సంబంధిత తహశీల్దార్ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారు.
     
    రికార్డుల ట్యాంపరింగ్‌పై అనుమానాలు
     
    రికార్డుల ట్యాంపర్ చేసే విషయంలో సిబ్బంది సిద్ధహస్తులు. వందల సంఖ్యలో రికార్డులు ట్యాంపర్ చేసిన సందర్భాలు అనేకం బయటపడ్డాయి. ప్రసుత్తం ఈ భూముల వ్యవహారంలో కూడా రికార్డులు ట్యాంపర్ అయి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రద్దు చేసిన కేటాయింపులను రెండు నెలల్లో కొత్త వారికి కట్టబెట్టడం వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     
    రెవెన్యూ హస్తం!
     
    జిల్లాలో ప్రస్తుతం 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో వెయ్యి ఎకరాల భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నట్టు గుర్తించారు. స్టీల్‌ప్లాంట్, మధురవాడ, కొమ్మాది, భీమిలి ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాలకు సంబంధించి కోర్టులకు సక్రమమైన సమాచారం అందించడం లేదన్న విషయాన్ని గమనించారు. వీటిలో కొన్ని భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. వాటన్నింటిపై నెల రోజుల్లో విచారణ జరిపించాలని కలెక్టర్ నిర్ణయించారు.
     
    ఈ భూ సర్వేలను కూడా నెల రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను తయారు చేయాలని భావిస్తున్నారు. అనంతరం కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించి వాటిపై న్యాయ సలహాలు తీసుకొని కోర్టులో కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ అక్రమాలతో సంబంధమున్న రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement