- రూ.2 కోట్ల ప్రభుత్వ భూ ఆక్రమణలో వెల్లడవుతున్న నిజాలు
- నుంచి డివిజన్ వరకు ‘రెవెన్యూ’ అండ
- ఆరు జమాబందీలు పూర్తయినా అధికారుల కంటికి చిక్కని వైనం
నక్కపల్లి, న్యూస్‌లైన్: అమలాపురంలో రూ.2 కోట్ల విలువైన చెరువు, గెడ్డ భూ ఆక్రమణకు పదేళ్ల క్రితమే బీజం పడినట్లు భావిస్తున్నారు. 2004లోనే ఆక్రమణకు తెగబడిన కబ్జాదారులు ఏడాది క్రితం నుంచి రోడ్డు నిర్మాణం, కొబ్బరి, టేకు చెట్ల పెంపకం చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ కాలంలో ఆరు జమాబందీలు పూర్తయినా అధికారుల దృష్టికి సమస్య రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయా కాలాల్లో పనిచేసిన వీఆర్‌ఓల నుంచి తహశీల్దార్‌ల వరకు తప్పుపట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక వీఆర్‌ఓలుగా పనిచేసిన వారి అండతోనే ఈ ‘భూ’గోతం నడిచినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా ఓ ఉద్యోగి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. చెరువు, గెడ్డలను పలానావారు ఆక్రమించారని 2004లోనే అడంగల్‌లో నమోదై ఉండడం గమనార్హం. అందుకే జమాబందీ (రెవెన్యూ ఆడిట్) సమయంలో 2004 నుంచి ఉన్న అడంగల్, రికార్డులు పరిశీలించలేదని, 2010 అడంగల్ ఆధారంగా పరిశీలన చేయడం, నోటీసులు జారీ చేయడంలోనే అసలు మతలబు ఉందని భావిస్తున్నారు.
దీంతో ప్రస్తుతం ఈ ఉద్యోగిని కాపాడుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్లు సమాచారం. లేదంటే వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని వారు భయపడుతున్నారు. ఏటా నిర్వహించే జమాబందీలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వివరాలు, ఎవరు పాల్పడ్డారో 4 సి అకౌంట్‌లో నమోదు చేస్తారు. ఈ రికార్డు ఆధారంగా జమాబందీ అధికారి (ఆర్డీఓ స్థాయి) పరిశీలించి ఆక్రమణలు తొలగించడం లేదా జరిమానా విధించడం చేస్తారు. అర్హులైతే డి పట్టాలివ్వాలని, బి మెమో వసూలుకు సిఫారసు చేస్తారు.
ఇంతవ్యవహారం ఉన్నా ఈ ఆక్రమణను ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్‌ఓలు రాసిన అడంగల్ ఆధారంగా అన్యాక్రాంతమైన భూములను పరిశీలించాలి. ఇలా పరిశీలించారా? లేదా? అన్నది తెలియడం లేదు. ఒక వేళ పరిశీలిస్తే ఎందుకు చర్య తీసుకోలేదన్నది మరో ప్రశ్న. ఇప్పటికైనా అధికారులు పూర్తిదృష్టిసారిస్తే ఒక్క అమలాపురంలోనే కాదు మండలంలోని 32 గ్రామాల పరిధిలోని ఆక్రమణలు వెలుగు చూసే అవకాశం ఉంది.
కబ్జాదారులకు నోటీలు
అమలాపురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 270, 295లోని ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిన వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎం.అప్పలకొండ అనే వ్యక్తి 1.5 ఎకరాలు, సూర్యనారాయణరాజు 1.5 ఎకరాలు, ఈశ్వరరెడ్డి అనే వ్యక్తి 2 ఎకరాలు ఆక్రమించినట్లు అడంగ్‌లో నమోదైనా ఆర్డీఓ ఆదేశాల మేరకు సర్వేచేసిన అధికారులు ముగ్గురూ కలిసి 1.74 ఎకరాలు మాత్రమే ఆక్రమించినట్లు నిర్థారించారు. దీంతో తహశీల్దార్ ఈ భూముల వివరాలు తెలపాలంటూ కబ్జాదారులకు నోటీసులిచ్చారు. గెడ్డ, చెరువు ఆక్రమణకు పాల్పడిన మీపై ఎందుకు చర్యతీసుకోకూడదో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. వీరిచ్చిన సమాధానం మేరకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని తహశీల్దార్ తెలిపారు.