- అమలాపురం డీఎస్పీ ప్రసన్నకుమార్
కాపు ఉద్యమ నేతలకు నోటీసులు
Published Wed, Jul 19 2017 12:33 AM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
అమలాపురం టౌన్ :
కాపుల పాదయాత్రకు అనుమతి లేదని, పోలీసు ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. ఈ నెల 26న నుంచి కిర్లంపూడి నుంచి ప్రారంభించనున్న కాపుల పాదయాత్రకు కోనసీమ నుంచి ముఖ్యంగా కాపు ఉద్యమ నేతలు, రౌడీషీటర్లు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పలువురు కాపు ఉద్యమ నేతలకు 149 సెక‌్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చామని చెప్పారు. వివాదాల్లోనూ, ఊరేగింపుల్లో పాల్గొనమని వారి నుంచి అంగీకార పత్రాలు కూడా తీసుకున్నామని చెప్పారు. కోనసీమలోని 275 గ్రామాల్లో ముఖ్యంగా కాపు యువతకు మైత్రి సభలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొంటే ఎదురయ్యే కేసులను వివరించామన్నారు. కోనసీమ చాలామంది కాపు యువత విద్యార్థులు, విద్యావంతులేనని... వారు పోలీసు కేసుల్లో అనవసరంగా ఇరుక్కుంటే ఉద్యోగాలు వస్తే ఇబ్బంది పడతారన్నారు. వారి తల్లిదండ్రులు వీరిని అదుపు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సామాజికంగా ఏ గొడవలైనా.. మూలాలు అమలాపురంతోనే ముడిపడి ఉంటున్నాయని డీఎస్పీ అన్నారు. తుని రైలు ధ్వంసం, గుంటూరులో టోల్‌గేట్ ధ్వంసం, వాహనం దహనం కేసు, తలుపులమ్మ లోవలో ఘర్షణ కేసుల్లో నిందితులు అమలాపురం వారేనన్నారు. అందుకోసమే శాంతి భద్రత పరంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. ఇప్పటికే కోనసీమలోని కొందరు రౌడీషీటర్లను పిలిచి కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే కొందరు రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పోలీసు సెక‌్షన్–30 అమలులో ఉందని, రెండు రోజుల్లో 144 సెక‌్షన్ కూడా విధిస్తారని చెప్పారు. ఈ రెండు సెక‌్షన్లు అమలులో ఉంటే రోడ్లపై తిరగడం, ర్యాలీ, పాదయాత్ర చేస్తే ఆ సెక‌్షన్ల ఉల్లంఘనే అవుతుందని స్పష్టంచేశారు.
Advertisement