కాపులపై ఆంక్షల కత్తి
Published Tue, Jul 25 2017 2:01 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా జిల్లాలోని కాపునేతలందరికి పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పాదయాత్రలో పాల్గొనడానికి బయటకు వస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మరోవైపు వందలాది మంది కాపు నేతలకు ఇప్పటికే నోటీసులు పంపించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లే అన్ని రహదారులపై పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. జిల్లాలో ఉన్న పోలీసులకు అదనంగా ఐదు వందల మంది పోలీసులు, రిజర్వు బెటాలియన్లను ఇతర జిల్లాల నుంచి రప్పించారు. ఇప్పటికే జిల్లాలో సెక్షన్ 30తో పాటు సెక్షన్ 144 అమలులో ఉంది. ఎస్పీ రవిప్రకాష్ కొవ్వూరు, దేవరపల్లి, సిద్దాంతం, తణుకు, తాడేపల్లిగూడెం ఏరియాల్లో పర్యటించి పోలీసులకు బందోబస్తు ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఇప్పటికే జిల్లాలోని ట్రావెల్స్ యజమానులకు ఫోన్లు చేసి కాపు నాయకులకు వాహనాలు సమకూరిస్తే సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు అన్ని మండలాల్లో కాపు నాయకులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే జిల్లాలో చాలాచోట్ల కాపు నాయకులు సమావేశాలు నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పెనుగొండలో సర్కిల్ ప్రత్యేకాధికారిగా నియమితులైన కృష్ణాజిల్లా తిరువూరు సీఐ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 25 మంది పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. దొంగరావిపాలెం, పెనుగొండ, మార్టేరు, తూర్పు విప్పరుల్లో పికెట్‌లు ఏర్పాటు చేశారు. తణుకు సర్కిల్ పరిధిలోని తణుకు, తణుకు రూరల్, ఉండ్రాజవరం, అత్తిలి పోలీసు స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పోలీసు పికెట్లు, మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనుమానిత వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కిర్లంపూడిలో ముద్రగడకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వెళ్లాలనుకునే వారిని పోలీసులు ఎక్కడికక్కడే నిలువరిస్తున్నారు. పదహారో నెంబరు జాతీయ రహదారిపై ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిడదవోలులో 13 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పట్టణంలో గూడెం రైల్వే గేటు, రైల్వేష్టేషన్ సెంటర్, పాటిమీద, బస్టాండ సెంటర్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసారు. నిడదవోలు మండలంలో సమిశ్రగూడెం పురాతన వంతెన సెంటర్, విజ్జేశ్వరంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి వెళ్లే ప్రతి వాహనాన్ని సమిశ్రగూడెం సెంటర్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
Advertisement
Advertisement