chalo amaravathi
-
వైఎస్ఆర్ సీపీ కాపు నేతలకు నోటీసులు
అమరావతి: చలో అమరావతి పాదయాత్రను అణచివేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం, మరోవైపు యాత్రను నిర్వహించడానికి ముద్రగడ పద్మనాభం, కాపు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాదయాత్రలో పాల్గొనేవారిపై ఏపీ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కాపు నేతలకు మంగళవారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముద్రగడ పాదయాత్రకు వెళ్లొద్దంటూ ఇళ్లకు వచ్చి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, వెలనాటి మాధవ, కొక్కిరాల సంజీవరావు, నాగిశెట్టి బ్రహ్మయ్యలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ట్రావెల్స్ నిర్వాహకులను కూడా పాదయాత్రకు వాహనాలు సమకూర్చొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో కాపు నేతలుకు నోటీసులు జారీ అయ్యాయి. ముద్రగడ పాదయాత్రలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చిరికలు చేశారు. -
కాపులపై ఆంక్షల కత్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా జిల్లాలోని కాపునేతలందరికి పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పాదయాత్రలో పాల్గొనడానికి బయటకు వస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మరోవైపు వందలాది మంది కాపు నేతలకు ఇప్పటికే నోటీసులు పంపించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లే అన్ని రహదారులపై పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. జిల్లాలో ఉన్న పోలీసులకు అదనంగా ఐదు వందల మంది పోలీసులు, రిజర్వు బెటాలియన్లను ఇతర జిల్లాల నుంచి రప్పించారు. ఇప్పటికే జిల్లాలో సెక్షన్ 30తో పాటు సెక్షన్ 144 అమలులో ఉంది. ఎస్పీ రవిప్రకాష్ కొవ్వూరు, దేవరపల్లి, సిద్దాంతం, తణుకు, తాడేపల్లిగూడెం ఏరియాల్లో పర్యటించి పోలీసులకు బందోబస్తు ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఇప్పటికే జిల్లాలోని ట్రావెల్స్ యజమానులకు ఫోన్లు చేసి కాపు నాయకులకు వాహనాలు సమకూరిస్తే సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు అన్ని మండలాల్లో కాపు నాయకులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే జిల్లాలో చాలాచోట్ల కాపు నాయకులు సమావేశాలు నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పెనుగొండలో సర్కిల్ ప్రత్యేకాధికారిగా నియమితులైన కృష్ణాజిల్లా తిరువూరు సీఐ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 25 మంది పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. దొంగరావిపాలెం, పెనుగొండ, మార్టేరు, తూర్పు విప్పరుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. తణుకు సర్కిల్ పరిధిలోని తణుకు, తణుకు రూరల్, ఉండ్రాజవరం, అత్తిలి పోలీసు స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పోలీసు పికెట్లు, మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనుమానిత వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కిర్లంపూడిలో ముద్రగడకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వెళ్లాలనుకునే వారిని పోలీసులు ఎక్కడికక్కడే నిలువరిస్తున్నారు. పదహారో నెంబరు జాతీయ రహదారిపై ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిడదవోలులో 13 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పట్టణంలో గూడెం రైల్వే గేటు, రైల్వేష్టేషన్ సెంటర్, పాటిమీద, బస్టాండ సెంటర్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసారు. నిడదవోలు మండలంలో సమిశ్రగూడెం పురాతన వంతెన సెంటర్, విజ్జేశ్వరంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి వెళ్లే ప్రతి వాహనాన్ని సమిశ్రగూడెం సెంటర్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. -
మీడియాను వదలని పోలీసులు
కిర్లంపూడి: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన 'చావోరేవో.. చలో అమరావతి' పాదయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెబుతున్నా...నిర్వహించి తీరుతామని కాపు జేఏసీ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ముద్రగడ సొంత జిల్లా తూర్పు గోదావరితోపాటు గుంటూరు జిల్లాలో పోలీసులు ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, తనిఖీలు, అరెస్టులు, నోటీసులు, హెచ్చరికలతో వాతావరణం వేడెక్కుతోంది. మీడియాను కూడా పోలీసులు వదిలి పెట్టడం లేదు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడికి వెళ్లే ప్రతి వాహనం నంబర్‌ను పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ముద్రగడ నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని నెరవేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాపు జేఏసీ నేతలు మాట్లాడుతూ అరెస్ట్‌లు, నిర్బంధాలు, కేసులతో చంద్రబాబు కాపు జాతిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. హామీ అమలు చేయమని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా?, ప్రభుత్వంలో ఉన్న కాపు పెద్దలకు అరెస్ట్‌లు కనబడటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్ని ఆంక్షలు విధించినా 26న ముద్రగడ పాదయాత్ర చేసి తీరుతారన్నారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, కొందరు మంత్రుల మాటలు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డుల్లా ఉన్నాయన్నారు. ఈసారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని కాపు జేఏసీ నేతలు తెలిపారు. అలాగే ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో గత నాలుగు రోజులుగా 50కి పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో ఐదు వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
బాబుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది
- చలో అమరావతికి భారీగా తరలి రండి - కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు అనంతపురం న్యూటౌన్ : కాపులను దారుణంగా అణగదొక్కుతున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నారు. తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న వారు ఆదివారం సాయంత్రం అనంతకు వచ్చారు. ఈ సందర్భంగా రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు అధ్యక్షతన స్థానిక శ్రీనివాస నగర్‌లోని బాలాజీ కల్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ కాపు జాతి కోసం నిరంతరం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కాపులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి తుని సభలాగే మరోసారి జూలై 22, 23 తేదీలలో ‘చలో అమరావతి’ కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లా నుంచి భారీగా తరలి రావాలని కోరారు. ముద్రగడ నిజాయితీ కలిగిన నాయకుడని, ఆయనకు చంద్రబాబులా కుట్రలు, కుతంత్రాలు తెలీవని అన్నారు. కాపులు ఎక్కడ సభలు పెట్టుకున్నా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ పోలీసులతో కొట్టిస్తూ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. రానున్న ఎన్నికల నాటికి చంద్రబాబు నైజాన్ని అందరికీ తెలియజేస్తామన్నారు. కాపు జేఏసీ జిల్లా నాయకులు గుజరీ వెంకటేష్, కన్వీనర్ భవానీ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ కాపులంతా ముద్రగడ పద్మనాభం బాటలో నడిచేలా ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. అంతకు ముందు కాపు ఉద్యమ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు స్వామి, వెంకటరమణ, చంటి బాబు, సత్తిబాబు, కేటీబీ (కాపు తెలగ, బలిజ, ఒంటరి కులాల) సంక్షేమ సంఘం నాయకులు జంగటి అమరనాథ్, నాగేంద్ర, పగడాల మల్లికార్జున, నాగేంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.