కిర్లంపూడి: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన 'చావోరేవో.. చలో అమరావతి' పాదయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెబుతున్నా...నిర్వహించి తీరుతామని కాపు జేఏసీ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు.
ముద్రగడ సొంత జిల్లా తూర్పు గోదావరితోపాటు గుంటూరు జిల్లాలో పోలీసులు ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, తనిఖీలు, అరెస్టులు, నోటీసులు, హెచ్చరికలతో వాతావరణం వేడెక్కుతోంది. మీడియాను కూడా పోలీసులు వదిలి పెట్టడం లేదు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడికి వెళ్లే ప్రతి వాహనం నంబర్‌ను పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ముద్రగడ నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని నెరవేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాపు జేఏసీ నేతలు మాట్లాడుతూ అరెస్ట్‌లు, నిర్బంధాలు, కేసులతో చంద్రబాబు కాపు జాతిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. హామీ అమలు చేయమని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా?, ప్రభుత్వంలో ఉన్న కాపు పెద్దలకు అరెస్ట్‌లు కనబడటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్ని ఆంక్షలు విధించినా 26న ముద్రగడ పాదయాత్ర చేసి తీరుతారన్నారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, కొందరు మంత్రుల మాటలు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డుల్లా ఉన్నాయన్నారు. ఈసారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని కాపు జేఏసీ నేతలు తెలిపారు.
అలాగే ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో గత నాలుగు రోజులుగా 50కి పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో ఐదు వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.