బాబుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది
- చలో అమరావతికి భారీగా తరలి రండి
- కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు
అనంతపురం న్యూటౌన్ : కాపులను దారుణంగా అణగదొక్కుతున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నారు. తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న వారు ఆదివారం సాయంత్రం అనంతకు వచ్చారు. ఈ సందర్భంగా రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు అధ్యక్షతన స్థానిక శ్రీనివాస నగర్‌లోని బాలాజీ కల్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ కాపు జాతి కోసం నిరంతరం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.
కాపులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి తుని సభలాగే మరోసారి జూలై 22, 23 తేదీలలో ‘చలో అమరావతి’ కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లా నుంచి భారీగా తరలి రావాలని కోరారు. ముద్రగడ నిజాయితీ కలిగిన నాయకుడని, ఆయనకు చంద్రబాబులా కుట్రలు, కుతంత్రాలు తెలీవని అన్నారు. కాపులు ఎక్కడ సభలు పెట్టుకున్నా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ పోలీసులతో కొట్టిస్తూ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. రానున్న ఎన్నికల నాటికి చంద్రబాబు నైజాన్ని అందరికీ తెలియజేస్తామన్నారు. కాపు జేఏసీ జిల్లా నాయకులు గుజరీ వెంకటేష్, కన్వీనర్ భవానీ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ కాపులంతా ముద్రగడ పద్మనాభం బాటలో నడిచేలా ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. అంతకు ముందు కాపు ఉద్యమ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు స్వామి, వెంకటరమణ, చంటి బాబు, సత్తిబాబు, కేటీబీ (కాపు తెలగ, బలిజ, ఒంటరి కులాల) సంక్షేమ సంఘం నాయకులు జంగటి అమరనాథ్, నాగేంద్ర, పగడాల మల్లికార్జున, నాగేంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.