ఆగస్టు తర్వాత ఆందోళనే
అనంతపురం న్యూటౌన్ : ‘కాపులను బీసీలో చేరుస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టే అడుగుతున్నాం..ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మరోసారి ఉద్యమ బాట తప్పదు..ఆగస్టులోపు కాపు రిజర్వేషన్లకు ఓ రూపం ఇస్తామన్నారు..అందువల్లే ఇన్నాళ్లు శాంతంగా ఉన్నా.. కానీ ఆగస్టు తర్వాత మాత్రం ఆందోళన తప్పదు’ అని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లు సాధించుకునే గురువారం అనంతపురంలోని రాయల్ ఫంక్షన్ హాలులో ప్రముఖ కవి ఏలూరు ఎంగన్న అధ్యక్షతన బలిజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సభలో కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణతో పాటు నల్ల విష్ణు, వాసిరెడ్డి ఏసుదాసు, తోట రాజీవ్, నెల్లూరు రాఘవయ్య, జంగటి అమర్‌నాథ్, రాయలసీమ బలిజ మహా సంఘం జిల్లా అధ్యక్షులు బళ్లారి వెంకట్రాముడు తదితరులు మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టగా, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు ఆయన వద్దకే వచ్చి డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత హామీలన్నింటిని తుంగలో తొక్కారని విమర్శించారు. తుని ఘటనలో బలిజల ప్రమేయం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా, తర్వాతి కాలంలో ఎంతో మంది యువకులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం కుట్రలు పన్ని తమను అరాచకవాదులుగా చూసే ప్రయత్నం చేస్తోందన్నారు.
తాము బీసీలకు వ్యతిరేకం కాదనీ, వారి రిజర్వేషన్లకు అడ్డు కాకుండా కాపులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మంజునాథ కమిషన్‌కు తగిన సమాచారం ఇవ్వడానికి అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ ఐక్యతే లక్ష్యంగా కాపు జేఏసీలు ఏర్పడుతున్నాయన్నారు. అనంతపురం జిల్లా జేఏసీని ఆగస్టు 6న ముద్రగడ పద్మనాభం సమక్షంలో ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో కేటీబీ నాయకులు పగడాల మల్లికార్జున, బాబూరావు, మల్లేశ్వరయ్య, బీజేపీ నాయకులు లలిత్‌కుమార్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు అక్కిశెట్టి జయరామ్, కేటీబీ జిల్లా ప్రచార కార్యదర్శి పసులేటి శివానంద, చలపతి, యువజన సంఘం నాయకులు హర్ష తదితరులు పాల్గొన్నారు.