చలో అమరావతి పాదయాత్రను అణచివేసేందుకు ఏపీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
అమరావతి: చలో అమరావతి పాదయాత్రను అణచివేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం, మరోవైపు యాత్రను నిర్వహించడానికి ముద్రగడ పద్మనాభం, కాపు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాదయాత్రలో పాల్గొనేవారిపై ఏపీ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ కాపు నేతలకు మంగళవారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముద్రగడ పాదయాత్రకు వెళ్లొద్దంటూ ఇళ్లకు వచ్చి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు.
వైఎస్‌ఆర్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, వెలనాటి మాధవ, కొక్కిరాల సంజీవరావు, నాగిశెట్టి బ్రహ్మయ్యలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ట్రావెల్స్ నిర్వాహకులను కూడా పాదయాత్రకు వాహనాలు సమకూర్చొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో కాపు నేతలుకు నోటీసులు జారీ అయ్యాయి. ముద్రగడ పాదయాత్రలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చిరికలు చేశారు.