పవన్‌ తీరుపై కాపుల్లో కాక | Mudragada followers furious with the behavior of the Janasena chief | Sakshi
Sakshi News home page

పవన్‌ తీరుపై కాపుల్లో కాక

Published Fri, Feb 23 2024 5:25 AM | Last Updated on Fri, Feb 23 2024 10:41 AM

Mudragada followers furious with the behavior of the Janasena chief - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌­కళ్యాణ్‌ తీరుపై కాపు సామాజికవర్గం రగిలిపోతోంది. ముఖ్యంగా.. కోస్తా జిల్లాల్లో ఆ సామాజికవర్గంలో బలమైన ముద్ర కలిగిన కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో పవన్‌ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. నిజానికి.. వివిధ కారణాలతో ముద్రగడ కాపు ఉద్యమాన్ని విడిచి­పెట్టి చాలా­కాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాలపై ఆసక్తి కూడా లేనట్లుగా  ఉంటున్నారు. 

ఈ తరుణంలో పవన్‌ ఆదేశాలతో ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్యబాబు తదితరులు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. కానీ, వీరి ప్రతిపాదనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. ఇలా ముద్రగడను జనసేన నేతలు రెండు మూడు దఫాలు కలిశారు.

ఆ సందర్భంలో ఫిబ్రవరి 15 తరువాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ, రాజమహేంద్రవరం వచ్చినప్పుడు పవన్‌ నేరుగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. దీంతో బొలిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడి వెళ్లాక కోనసీమ ప్రాంతం నుంచి జనసేన నేతలు వరుసగా ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తున్నారు.

కావాలనే ముద్రగడకు దూరంగా పవన్‌!?
ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి పవన్‌కళ్యాణ్‌ విశాఖలో పర్యటించి కొణతాల రామకృష్ణను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అక్కడి నుంచి సోమవారం సాయంత్రానికి రాజమహేంద్రవరం వచ్చిన పవన్‌ ఆ రోజు రాత్రి అక్కడే బసచేశారు. అక్కడ నుంచి మంగళగిరికి మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. అనంతరం బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లారు.

అక్కడ టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి వంటి నేతలను వారి ఇళ్లకు వెళ్లి మరీ పవన్‌ కలిశారు. అంతమంది ఇళ్లకు వెళ్లిన పవన్‌.. అటు విశాఖ, ఇటు రాజమహేంద్రవరం వచ్చినా ముద్రగడ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోవడంపై ఆయన అనుచరగణం, కాపు సామాజికవర్గం మండిపడుతోంది. రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడి మధ్య దూరం కేవలం 50 కిలోమీటర్లే. కానీ, ముద్రగడను కావాలనే పవన్‌ విస్మరించినట్లుగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ముఖం చాటేయడానికి అదే కారణమా?
తొలుత ముద్రగడ ఇంటికి వస్తానన్న పవన్‌.. ఆ తరువాత ముఖం చాటేయడానికి కాపు నేతలకు వచ్చిన ధర్మసందేహమే ఆయనకు కూడా రావ­డమే కారణమని అంటున్నారు. ముద్రగ­డను జన­సేన నేతలు కలిసినప్పుడు ఆ పార్టీకి అధి­కారం షేరింగ్‌ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం విషయం చర్చకు వచ్చిందని విశ్వస­నీయ సమాచారం. చంద్రబాబును నమ్మి రాజకీయంగా ప్రయాణం చేయడమంటే ఆత్మ­హత్యా సదృశమే అవుతుందనే అభి­ప్రాయం కాపు సామాజికవర్గంలో బలంగా ఉంది.

ముద్రగడ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో ఆ విషయంలో స్పష్టత కోరుతారే­మోనన్న భావనతో పవన్‌ ముఖం చాటేసి ఉంటారనే చర్చ కాపు సామా­జికవర్గంలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి.. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం జరిగిన సమయంలో గోదావరి జిల్లాల్లోని కాపులపై చంద్రబాబు సాగించిన అణచివేతను ఆ సామాజిక­వర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అటు­వంటి చంద్రబాబుతో పవన్‌ పొత్తు పెట్టుకో­వడంపై గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక­వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది.

చంద్రబాబు దాష్టీకాన్ని ఉద్యమ సమయంలో స్వయంగా చవిచూసిన ముద్రగడ సైతం.. జనసేన నేతలతో చర్చల సందర్భంగా ఆ రెండు పార్టీల పొత్తుపై సందేహం వ్యక్తంచేయడంతో.. దానికీ సమాధానం చెప్పలేకే పవన్‌ ముఖం చాటేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే, ముద్రగడ ఇంటికి వెళ్లి పవన్‌ కలవకపోవడానికి తన పార్టనర్‌ చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడమే కారణమై ఉంటుందని కూడా మరికొందరు అభిప్రాయపడు­తున్నారు. ఈ నేపథ్యంలో.. ముద్రగడ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement