రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..
పశ్చిమ గోదావరి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం ఆయన పాదయాత్రకు అనుమతి లేదంటూ వారంపాటు గృహ నిర్భందం చేసింది. ఈ హౌస్ అరెస్ట్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతుల ఆందోళనలు చేస్తున్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో సీఎం చంద్రబాబునాయుడు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కిర్లంపూడిలో కంచాలు, గరిటెలతో కాపు నేతలు నిరసనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరెగాయి. తూర్పుగోదావరిలో కొత్తపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాపులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడు వెంకట్రాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షకు కూర్చున్నాడు. దీక్ష చేస్తున్న వెంకట్రాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతేకాక ఆకివీడులో రిలే దీక్షలు చేస్తున్న కాపు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నరసాపురం మండలం తూర్పుతాళ్లులో కాపు నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. పాదయాత్ర విషయంలో చంద్రబాబుకో న్యాయం.. కాపులకు మరో న్యాయమా? మనం ఎక్కడికెళ్తున్నాం?. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రాణ త్యాగానికి అయినా సిద్ధం అని ముద్రగడ తెలిపిన విషయం తెలిసిందే.