అరెస్టులు మొదలెడితే మరోసారి ఉద్యమిస్తాం
అరెస్టులు మొదలెడితే మరోసారి ఉద్యమిస్తాం
Published Sat, Jul 23 2016 11:03 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మాకు లేదా?
రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా
అమలాపురం రూరల్: కాపు నాయకులపై పోలీసులు మరోసారి అరెస్టుల పర్వం కొనసాగిస్తే మళ్లీ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాపు జేఏసీ ప్రతినిధి, రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు సంఘీభావంగా కాపు యువకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి ఇప్పుడు పోలీసు స్టేషన్లలో బాండ్లు తీసుకుని కోర్టులో హాజరు కావాలని నోటీసులు పంపిస్తున్నారన్నారు. కాపు యువకులు ప్రభుత్వ ఆస్తులను ఏమైనా ధ్వంసం చేశారా? మరెందుకీ వేధింపులని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమాన్ని అణిచి వేయటానికి తప్పులు కేసులు పెడుతోందని ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, అరెస్టులు మొదలు పెడితే మరోసారి రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కాపులను బీసీల్లో చేర్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు చేయాలంటూ ఆందోళనలకు దిగితే తప్పేమిటని ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కాపు నాయకులతో సమావేశమై జిల్లా, మండల జేఏసీలు ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ వారంలో పర్యటించనున్నామన్నారు. కాపు నాయకులు నల్లా పవన్‌కుమార్, వంటెద్దు బాబి, బండారు రామమోహనరావు, నల్లా అజయ్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, అరెగిల నాని, అడపా మాచరరావు, సుంకర చిన్నా, యేడిద దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement