సాక్షి, మచిలీపట్నం: బందరు పోర్టు కథ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పోర్టు భూ సేకరణ అంశం ఓ కొలిక్కి వచ్చిందని, భూమి కొనుగోలు పథకం ద్వారా ప్రైవేటు భూములు కొనుగోలు చేస్తామని, బ్యాంకు ద్వారా మంజూరయ్యే రుణంతో పరిహారం పంపిణీ చేస్తామని గత కొన్ని నెలల క్రితం పాలకులు ప్రకటించారు. అతీగతి లేకుండా పోయింది. ఇటీవల ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో 30 వేల ఎకరాలకు 2015లో వెలువరించిన భూ సేకరణ నోటిఫికేషన్ ఉపసంహరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఆ అంశం కూడా ప్రస్తుతం మరుగున పడింది. వెరసి పోర్టు కథ రోజుకో మలుపు తిరుగుతోంది.
పరిహారంపై రైతుల అనాసక్తి..
బందరు పోర్టు భూ సేకరణ అంశం మరుగున పడింది. భూమి కొనుగోలు పథకం ద్వారా పోర్టు నిర్మాణానికి 5,300 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు సేకరించాలని లక్ష్యం నిర్దేశించగా.. 3,000 ఎకరాల ప్రభుత్వ భూమి కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. మిగిలిన 2300 ఎకరాల ప్రైవేటు భూమి సేకరణలో ఆది నుంచీ ఆపసోపాలు తప్పడం లేదు. అందులో 700 ఎకరాలకు సంబంధించి రైతులు ముడా అధికారులు భూములు ఇస్తున్నట్లు ఒప్పంద పత్రాలు సమర్పించారు. ఇక మిగిలిన 1,600 ఎకరాల భూములు సేకరించేందుకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
తొలుత ఎకరానికి రూ.22 లక్షలు పరిహారంగా అందజేస్తామన్నారు. ఇదే విషయమై రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు ముడా అధికారులు గ్రామాల్లో పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా ఆందోళనలు, ఎదురీతలే మిలిలాయి. తాము రూ.32 లక్షలు అయితే భూములు ఇచ్చే విషయం ఆలోచిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ప్రకటించి నెలలు గడుస్తున్నా రైతులతో చర్చించి భూములు సేకరించే ప్రక్రియ మొదలు చేసిన దాఖలాలు లేవు. క్యాంప్‌బెల్ పేట గ్రామం మొత్తం కనుమరుగు కానుండటంతో గ్రామాన్ని బందరు పట్టణంలోని ఓ ప్రాంతంలో పునరావాసం కల్పించనున్నట్లు చెప్పారు. ఆ ప్రక్రియ ఒక్క అడుగూ ముందుకు కదిలిన దాఖలాలు లేవు.
ఉపసంహరణ ఊకదంపుడేనా?
బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల నిమిత్తం 2015 ఆగస్టు 31న భూ సేకరణ, 2016 సెప్టెంబర్ 18న భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 33 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో 20,856 ఎకరాలు ప్రభుత్వ, 12,144 ఎకరాల ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా రైతులు తమ భూములపై ఉన్న హక్కులు పూర్తిగా కోల్పోయారు. రుణాలు, క్రయ, విక్రయాలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే రెండు మాసాల క్రితం మంత్రి కొల్లు రవీంద్ర 12,144 ప్రైవేలు భూములకు సంబంధించి నోటిఫికేషన్ ఉపసంహరిస్తామని ప్రకటించారు. కలెక్టర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం వారంలోగా రైతులకు నోటిఫికేషన్ నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. రెండు మాసాలు గడుస్తున్నా అతీ గతీ లేదు. ఎప్పుడు విముక్తి కల్పిస్తారా? ఎప్పుడు తమ భూములపై తమకు పూర్తిస్థాయి హక్కులు రానున్నాయన్న ఆందోళన 5 వేల మంది రైతుల్లో నెలకొంది.
నెలాఖరు ముగియనున్న గడువు..
పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం జారీ చేసి భూ సేకరణ నోటిఫికేషన్ గడువు ఈ నెలాఖరుకు ముగియనుంది. యథావిథిగా ఎవరు ఉపసంహరించకపోయినా దానంతట అదే నిర్వీర్యం కానుంది. ఈ విషయం తెలిసిన పాలకులు తాము ఏదో రైతులకు మేలు చేస్తున్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేశారు. రెండు నెలల క్రితం సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర వారంలోగా నోటిఫికేషన్ ఎత్తివేస్తామని గొప్పలు చెప్పారు. కానీ నేటికీ అమలైన మార్గం మాత్రం చూపలేదు.
శంకుస్థాపన ఎప్పుడో?
పోర్టు పనులకు ఆగస్టు మాసంలో శంకుస్థాపన చేస్తామన్న పాలకులు ఆగస్టు మాసం ముగియనున్నా ఆ అంశంపై ఉలుకూ పలకు లేకుండా వ్యవహరిస్తున్నారు. రూ.1700 కోట్లకు పైగా బ్యాంకు రుణం మంజూరవుతుందని చేస్తున్న ఉపన్యాసాలు నెలలు గడుస్తున్నాయి. రుణం మంజూరు కాలేదు, పనులు ప్రారంభించలేదు. దీన్ని బట్టి చూస్తే అసలు పోర్టు పనులు ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అన్న అనుమానాలు ప్రజల్లో వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment