♦ చూసీ వదిలేస్తున్న నగర పాలక అధికారులు
♦ ఫిర్యాదులు అందినా పట్టించుకోని వైనం..
♦ అక్రమ భవన నిర్మాణాల్లో అవినీతి బాగోతం
కార్పొరేషన్‌లో కొందరు అధికారుల విచ్చలవిడితనం నగర ప్రజలకు శాపంగా మారుతోంది. అక్రమ నిర్మాణాలు, నాసిరకం పనులు, లోపిస్తున్న పారిశుధ్యంతో రూ.లక్షలు దుబారా అవుతున్నాయి. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూశాఖల్లో పెరిగిన అవినీతి, అక్రమాలు అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి. నగరాల సుందరీకరణపై ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయి. ఏడాదిలో 150కిపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినా కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు.. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని శాఖల్లో పేరుకు పోయిన అవినీతి, అక్రమాలు, అలసత్వం, నిర్లక్ష్యం, నిధుల దుబారా,భవన నిర్మాణాల్లో అతిక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలు..
ఏడాదిలో 150కి పైగా నిర్మాణ అతిక్రమణలు మొదట నోటీసులు.. ఆపై వసూళ్ల బేరం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణాలు వేగం పుంజుకున్నారుు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివాస సముదాయ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు అపార్టుమెంట్ల నిర్మాణాలు ఉపందుకుంటున్నాయి. ఏడాదిలో 150కి పైగా నిర్మాణాల్లో అతిక్రమణలు జరిగినట్లు గుర్తించినా చర్యలు లేవు. ఐదేళ్లలో 1200లకు పైగా నిర్మాణాల అతిక్రమణలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. నగర పరిధిలో ఈ నిర్మాణాలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. నిర్మాణాలు జరుగుతున్నా స్పందించని అధికారులు ఆపై నోటీసులు జారీ చేయడం, వసూళ్లకు పాల్పడడం జోరుగా కొనసాగుతోంది. నగరంలో చాలాచోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో కొన్నిచోట్ల కార్పొరేటర్లు అధికారులను రక్షించగా మరికొన్ని చోట్ల పట్టణ ప్రణాళిక విభాగం వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది.
కార్పొరేషన్ పరిధిలో ఇదీ పరిస్థితి..
పట్టణంలో ఇదివరకే నిర్మాణాలు కొనసాగిన అక్రమ భవనాలు ఎన్నో ఉన్నాయి. గతంలో వినాయక్‌నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణంలో నలుగురు మృతిచెందగా హుటాహుటిన స్పందించిన కార్పొరేషన్ అధికారులు 104 అక్రమ భవనాలకు నోటీసులు జారీ చేశారు. స్పందించకుంటే కూల్చివేస్తామని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ.. నోటీసులు అందినా పక్షం రోజుల తరువాత ఈ ప్రక్రియపై అధికారులు మౌనం వహించారు. ముఖ్యంగా ఖలీల్‌వాడి ప్రాంతంలో 60 శాతం భవనాలకు నోటీసులు అందించినా కార్పొరేషన్ అధికారులు ఆపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేశారు. ఈ నోటీసుల వల్ల నిర్మాణాలు అతిక్రమించిన ఒక్కో యజమాని నుంచి భారీగా వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరా తీసిన ఎంపీ కల్వకుంట్ల కవిత మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. అయితే తర్వాత ఇప్పుడున్న అధికారులుకు ఇదీ షరా‘మామూలే’ అయ్యింది.
నిర్మాణ అతిక్రమణలు..
♦ ఖలీల్‌వాడి ప్రాంతంలో ఓ ప్రైవేట్ వైద్యుడు ప్రధాన చౌరస్తా వద్ద నూతనంగా భారీ భవనం నిర్మించాడు. ఈ భవనానికి అనుమతులు లేవు. ఇందులో ఓ ప్రజాప్రతినిధి భర్త భవన నిర్మాణదారునితో ఒప్పందం చేసుకుని కార్పొరేషన్ అధికారుల నుంచి చర్యలు లేకుండా కాపాడుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమీపంలో మరో అపార్ట్‌మెంట్ నిర్మాణం కొనసాగింది. దీనికి అనుమతి లేకుండా కొనసాగడంతో సదరు ప్రజాప్రతినిధి భర్త అందులో ఒక ప్లాట్‌ను అతి తక్కువ రేటు(రూ.10 లక్షలకే)కు లాగేసుకున్నారు. ఈ రెండు భవనాల వైపు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు.
♦ హైదరాబాద్ రోడ్డులోని ఓ హోటల్ సమీపంలో భారీ భవన నిర్మాణం కొనసాగుతోంది. దీనికి అనుమతి లేకుండానే నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు కనీసం పరిశీలన చేయకుండా ప్రశ్నించకుండానే నిమ్మకుండిపోయారు. ఇందులో ఓ కార్పొరేటర్ మధ్యవర్తిగా అధికారులకు భారీగానే ముడుపులు అందించినట్లు తెలిసింది.
♦ గౌతంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం గతేడాది పూర్తయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలంలో వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి కొనసాగుతున్నాయి. నిబంధనల కు విరుద్ధంగా ఉండడంతో నోటీసులు అందించిన అధికారులు ఏడాది అవుతున్నా నేటి వరకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదు.
♦ గూపన్‌పల్లి చౌరస్తాలో ఓ అపార్టుమెంట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగ డం, అందులోని ప్లాట్లు విక్రయించిన తరువాత యజమాని ఆక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వీటిని ఆపాలని అపార్టుమెంట్ వాసులు కమిషనర్ నాగేశ్వర్‌కు ఫి ర్యాదు చేశారు. అయినా కూడా నేటి వరకు ఈ అపార్టుమెంట్ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. వాటిని పరిశీలించలేదు.
♦ దుబ్బ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటించిన ఏరియలో ప్రస్తుతం నాలుగు నివాస గృహాలు నూతనంగా నిర్మిస్తున్నారు. వీటికి అనుమతి ఇవ్వకూడదు. ఈ నివాసాలు అక్రమంగా జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి ముడుపులు అందుకొని వీరికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
♦ ఖలీల్‌వాడిలో రెండు భవనాలు గతంలో మున్సిపాలిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కూల్చివేశారు. ప్రస్తు తం వాటి నిర్మాణం పూర్తి అయి యథావిధిగా కొనసాగుతున్నారుు. అనుమతి ఏలా వచ్చింది అన్నది సందిగ్ధం. అధికారుల సహకారం, కార్పొరేషన్ స్థాయి ఓ ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వం వహించి ముడుపులు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
♦ జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా ఓ అపార్టుమెంట్ నిర్మాణం కొనసాగుతోంది. అతి తక్కువ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ అపార్టుమెంట్‌ను అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుభాష్‌నగర్ లోని బ్యాంకు వద్ద అతి తక్కువ స్థలంలో అపార్టుమెంట్ నిర్మాణం పూర్తి అయింది. దీనిపై అధికారులు స్పందించడం లేదు.
♦ సుభాష్‌నగర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాల భవనం నివాస సముదాయం అనుమతితో నిర్మాణం పూర్తి చేసుకుంది. గతంలో ఫిర్యాదులు రావడంతో నిర్మాణాలు నిలిపివేసి కూల్చివేశారు. ప్రస్తుతం ఈ భవనం నివాస సముదాయంగానే పాఠశాల నడుస్తోంది.
♦ పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటించిన అర్సపల్లి, ఆటోనగర్, మాలపల్లి ప్రాంతాల్లో నివాస సముదాయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. వీటిపై ఫిర్యాదులు వస్తున్న పట్టించుకోవడం గమనార్హం.