గోదావరిఖని, న్యూస్‌లైన్ : ప్రజాధనమే కదా.. పోతోపోనీ అన్నట్లుంది రామగుండం కార్పొరేషన్ అధికారుల తీరు. అవసరమని చెప్పి అడ్డగోలు లోడ్‌తో విద్యుత్ కనెక్షన్లు తీసుకుని.. ఇప్పుడు కరెంటు వినియోగించకున్నా బిల్లు మాత్రం రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు వాడుకుంటున్న కరెంటుకు కూడా నెలనెలా ఠంఛన్‌గా బిల్లు కడుతున్నారు. ఇలా ఎందుకు చెల్లిస్తున్నామని కనీసం ఫైల్ చూసుకునే తీరిక కూడా వీరికి దొరకడం లేదు. నెలకు రూ.5.75 లక్షల చొప్పున సుమారు రూ.61.50 లక్షలు ట్రాన్స్‌కో ఖాతాలో జమచేశారు. అంటే ఈ మేరకు కార్పొరేషన్‌కు ఆర్థిక నష్టం వాటిల్లినట్టే.
కార్పొరేషన్ పరిధిలోని మల్కాపురం శివారులో నిర్మించిన సీవరేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కోసం హై ఓల్టేజీ(హెచ్‌టీ) సర్వీస్‌తో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు వినియోగించకపోవడంతో ట్రాన్స్‌కో వాళ్లు సర్వీస్‌ను తొలగించారు. ప్లాంట్‌లోని నీటి మడుగుల్లో చేపలు పెంచుకోడానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి చెప్పారని తిరిగి ఆ సర్వీసును పునరుద్ధరించారు. చేపలు పెంచుకునే వ్యక్తి నుంచి చిల్లిగవ్వ కూడా కార్పొరేషన్‌కు రాకపోగా విద్యుత్ బిల్లును నెలకు రూ.లక్ష మాత్రం కార్పొరేషన్ ఖాతాలోంచే చెల్లిస్తున్నారు. ఈ తంతు రెండేళ్లుగా సాగుతోంది.
ఎన్టీపీసీ నర్రశాలపల్లి వద్ద వాటర్‌ట్యాంకు కోసం 250 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ట్యాంకు ద్వారా చుక్క నీరు కూడా రాకపోగా విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్షలు ట్రాన్స్‌కోకు సమర్పించుకోవాల్సిన దుస్థితి. ఏడాది నుంచి ఈ బిల్లు చెల్లిస్తున్నారు. అంటే ఈ రెండింటిపై ఇప్పటికే రూ.43 లక్షలకుపైగా అప్పనంగా చెల్లించారు.
మున్సిపల్ కార్యాలయం వెనుక జిరాక్స్ సెంటర్‌ను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా, దానికి కార్పొరేషన్ కార్యాలయం నుంచి విద్యుత్ ఇస్తున్నారు. నెలకు వచ్చే రూ.3,600 బిల్లు కూడా కార్పొరేషన్ ఖాతా నుంచే చెల్లిస్తున్నారు.
ఇదే ఆవరణలోని కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్‌కు కేటాయించిన భవనంలో మెప్మా పథకానికి సంబంధించిన కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. అందులోంచే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రతీ నెలా వచ్చే రూ.12 వేల కరెంటు బిల్లును కార్పొరేషన్ ఖాతా నుంచే కడుతున్నారు.
పాత మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ భవనంతోపాటు లక్ష్మీనగర్‌లోని వ్యాపారుల వాహనాలకు అనధికారికంగా పార్కింగ్ కొనసాగుతోంది. ఇక్కడ కమర్షియల్ కేటగిరి-2లో త్రీఫేజ్ విద్యుత్ వినియోగిస్తున్నందున నెలకు రూ.10 వేల వరకు కరెంటు బిల్లును కార్పొరేషన్ చెల్లించాల్సి వస్తోంది. ఈ మూడు కలిసి నెలకు రూ.25,600 అవుతోంది. ఆరు నెలలుగా ఈ చెల్లింపులు జరుగుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. ఈ పేరిట ఇప్పటికే రూ.1.50 లక్షలకు పైగా ప్రజాధనం వృథా అయింది.
వెలగని దీపాలకూ బిల్లులు
కార్పొరేషన్ పరిధిలో వీధిదీపాల కోసం మొత్తం 237 విద్యుత్ మీటర్లు అమర్చగా 52 పని చేయడం లేదు. వీటి పరిధిలో 40 వాట్స్ సామర్థ్యం గల ట్యూబ్‌లైట్లు 4,668 ఉండగా 1,662 లైట్లు వెలగడం లేదు. 70 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్‌లైట్లు 151 ఉండగా 93 వెలగడం లేదు. 150 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్‌లైట్లు 735 ఉండగా 343 వెలగడం లేదు. 250 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్ లైట్లు 142 ఉండగా 52 పనిచేయడం లేదు. 400 వాట్స్ సామర్థ్యం గల హైమాస్ట్ లైట్లు 15 సెంటర్లలో 120 అమర్చగా 81 వెలగడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు రూ.36 లక్షల వ్యయంతో 71 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇందులో 142 డ్యూమ్‌లైట్లకు 52 పనిచేయడం లేదు. దీంతో మంథనితోపాటు సింగరేణి గనులు, ఓసీపీలకు వెళ్లే కార్మికులు, ప్రజలు రాత్రి సమయంలో తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
రాజేశ్ థియేటర్ నుంచి మార్కండేయకాలనీ మీదుగా అడ్డగుంటపల్లి, కళ్యాణ్‌నగర్ వరకున్న వీధిదీపాలు వెలగకపోవడంతో ఆ కాలనీల్లో రహదారులు చీకట్లోనే మగ్గుతున్నాయి. మార్కండేయకాలనీలో పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినప్పటికీ రహదారులు చీకటిగా ఉండడంతో దొంగలను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. ప్రధాన వ్యాపార కేంద్రాలైన కళ్యాణ్‌నగర్ నుంచి మేదరిబస్తీ మీదుగా లక్ష్మీనగర్, ప్రధాన చౌరస్తా వరకు గల డ్యూమ్‌లైట్లు కూడా సరిగా వెలగడం లేదు.
తరుచూ లైట్లకు ఏర్పాటు చేసిన చాప్టర్లు, స్విచ్ బ్రేకర్లు చెడిపోతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ.. విద్యుత్ దీపాల పేరుతో కార్పొరేషన్ ప్రతీ నెలా రూ.10 లక్షల బిల్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తోంది. 52 మీటర్లు పనిచేయక వీధిదీపాలు వెలగకపోయినా ట్రాన్స్‌కో నెలకు రూ.3 లక్షల వరకు బిల్లు వేస్తోంది. ఇవి చెడిపోయి ఆరు నెలలవుతుండగా ఈ ఆరు నెలలుగా మొత్తం రూ.18 లక్షలు అప్పనంగా చెల్లించినట్లే. ఇంత జరుగుతున్నా అధికారులు కొత్త మీటర్ల ఏర్పాటుపై మాత్రం దృష్టి సారించడం లేదు.
ఇలా మొత్తం కలిసి ఇప్పటికే సుమారు రూ.62 లక్షలకు పైగా కరెంటు బిల్లు పేరిట ట్రాన్స్‌కోకు చెల్లించగా... ఇవి ఎందుకు చెల్లిస్తున్నామనే విషయాన్ని మాత్రం అధికారులు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. తనకు సంబంధం లేని బిల్లును కూడా అనవసరంగా కార్పొరేషన్ చెల్లిస్తుండడంతో లక్షలాది రూపాయల ఆర్థిక భారం పడుతోంది. బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో ఇటీవల పలుమార్లు కరెంట్ కట్ చేసింది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలగజేసుకుని రామగుండం కార్పొరేషన్ పాలనను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
- ఎస్.రవీంద్ర, కమిషనర్,
రామగుండం కార్పొరేషన్
అవసరం లేకున్నా గతంలో హెచ్‌టీ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో కరెంటు ఎక్కువ కాలుతోందని గుర్తించాం. ఇప్పుడు వాటన్నింటినీ ఎల్‌టీ కనెక్షన్లుగా మారుస్తున్నాం. అవసరం లేని చోట కనెక్ష న్లు కట్ చేస్తున్నాం. చేపల చెరువు దగ్గర కరెంట్ కనెక్షన్ కట్ చేయమని ట్రాన్స్‌కోకు లేఖ రాశాం. సీఆర్టీ భవనం నిర్వహణను చూసుకోవాలని స్వశక్తి సంఘాలకు సూచించాం. వీధి దీపాలున్నచోట పనిచేయని మీటర్లు తొలగించి కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తాం. విద్యుత్ వినియోగం ఎక్కువ కాకుండా కార్పొరేషన్ ప్రత్యేకాధికారి అయిన జేసీతో చర్చించి అన్ని కాలనీల్లో టైమర్లు బిగించేందుకు చర్యలు తీసుకుంటాం.