కూల్చివేతలు ఆగవు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో కొద్దిరోజులుగా నిలిచిపోయిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగిపోలేదని, కొనసాగుతాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ఆదివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ఈ విషయం స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎలాంటి అనుమతి లేదని, చట్టప్రకారం దానిపై అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
నగరంలోని ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని చెబుతూ, కేవలం మూడు కేసుల్లోనే రూ. 50వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయన్నారు. సామాన్యుల భవనాలపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ప్రస్తావించగా, దాన్ని ఖండించారు. ఐదారంతస్తులు నిర్మించిన వారు సామాన్యులెలా అవుతారని ఎదురు ప్రశ్నించారు.
నగరంలో వాన కురిస్తే నీరు వెళ్లే మార్గం లేదని .. అందుకు కారణాలేమిటని అధికారులను అడిగితే అనుమతి లేని అక్రమ నిర్మాణాలని చెప్పారన్నారు. అందువల్లే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించానని, దాంతో వారు చర్యలకు దిగారన్నారు.