భూములు పంచకుంటే పతనం తప్పదు
ఇబ్రహీంపట్నం ఘటనపై కేసీఆర్ నోరు విప్పాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
కరీంనగర్: ప్రభుత్వ భూములను పేదలకు పంచే వరకు ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, భూమి లేని నిరుపేదలకు భూములు పంచకుంటే పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు భూమి లేని దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని, అధికారంలోకి వచ్చాక కాకిలెక్కలతో కాలయాపన చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. సీపీఐ నిర్ణయం మేరకు మంగళవారం నుంచే భూపోరాటాలకు శ్రీకారం చుట్టామన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని బడా బాబులు బీనామీల పేరిట పట్టాలు సృష్టించుకొని సాగు చేస్తున్నారని, గ్రామం లో ఉన్న పేదలతో ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు పోరాటం మొదలెట్టామన్నారు.
ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు తక్కువ రేటుతో ఇస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో 2 వేల మంది పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే పోలీసులు లాఠీచార్జీ చేసి గుడిసెలు ఖాళీ చేయించడం అప్రజాస్వామికమన్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.