
సాక్షి, హైదరాబాద్: రానున్న రోజు ల్లో ప్రభుత్వాన్ని నడిపే హక్కును కూడా ప్రైవేటుపరం చేస్తారేమోనని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గా మరోసారి ఎన్నికైన సందర్భంగా మాట్లా డుతూ.. ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు. దేశం లోని వారసత్వ సంపదను కాపాడుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ పరిస్థితులను చూ స్తుంటే ప్రభుత్వ నిర్వహణను ప్రైవేటుకు కట్టబెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.
కేరళలో జరిగిన జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయన్నారు. రాబోయే రాజకీయాల్లో వామపక్షాలను బలోపేతం చేసి, ప్రజల ముందు ఓ ప్రత్యామ్నాయాన్ని పెట్టాల ని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. విశాలమైన వామపక్ష, లౌకిక ఐక్యవేదిక అవసరమని తీర్మానించినట్టుగా చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మతోన్మాద శక్తులు, వారి కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. బీజేపీ ని ఓడించే లక్ష్యంతో పొత్తులుండాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా విశాల వేదిక ఏర్పాటు చేయడానికి చర్చలు చేస్తున్నామని, దీని కోసం అన్ని పార్టీలు, శక్తులతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు.
టీజేఎస్‌తో పనిచేసే అవకాశం..
రాజకీయ విధానంపై టీఆర్‌ఎస్‌తో సీపీఐకి పూర్తిగా రాజకీయ విభేదాలు ఉన్నాయని సురవరం చెప్పారు. బీజేపీని ఓడించడానికి జాతీ య స్థాయిలో అవగాహన కష్టమని, రాష్ట్రాల వారీగానే పొత్తులుంటాయని స్పష్టం చేశారు. టీజేఎస్‌తో సీపీఐకి సత్సంబంధాలు ఉన్నాయని, కలసి పనిచేసే అవకాశముందని చెప్పారు. సీపీఎం, సీపీఐ రాజకీయ తీర్మానాల్లో తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్ ఫ్రంట్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని సురవరం ఆరోపించారు. ప్రతిపక్షాల ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీకి ఉపయోగపడే లక్ష్యంగానే కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం, వాటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని ఆరోపించారు.