విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలన్నీ ప్రైవేటీకరణ వైపు నడుస్తున్నాయని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అన్నింటినీ ప్రైవేటుకు కట్టబెట్టాలనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేటప్పుడు ఇక చేసే పాలన ఏముంటుందని ప్రశ్నించారు రామకృష్ణ.మోదీని ప్రసన్నం చేసుకోవడానికి అవసరం లేకపోయినా ఏపీకి ఆహ్వానిస్తున్నారన్నారు.
‘వందల కోట్లు ఖర్చు చేసి పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. కర్నూలులో జీఎస్టీ విజయోత్సవం నిర్వహించడం హాస్యాస్పదం. జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులకు ఎలాంటి లాభం లేదు. రాష్ట్రానికి కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నెలలో ఏపీకి జీఎస్టీ వల్ల వచ్చింది 3500 కోట్లు మాత్రమే. ఏపీ కంటే జీఎస్టీ వల్ల ఎక్కువ ఆదాయం వచ్చిన రాష్ట్రాలేవీ ఇలా సంబరాలు నిర్వహించలేదు.
మోదీని ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఢిల్లీలో ఈనెల 24,25 తేదీల్లో జాతీయ సిపిఐ సమావేశాలు. దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల పై చర్చిస్తాం. 25వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. నవంబర్ 2,3 తేదీల్లో సిపిఐ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి. ఏపీలో భవిష్యత్ కార్యక్రమాలు , పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నాం. మాతో కలిసి వచ్చే అందరినీ కలుపుకుని పోరాడుతాం’ అని రామకృష్ణ స్పష్టం చేశారు.


