కబ్జాలపై ఉక్కుపాదం | hard ground operations command KCR | Sakshi
Sakshi News home page

కబ్జాలపై ఉక్కుపాదం

Published Fri, Dec 5 2014 1:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

hard ground operations command KCR

  • భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలకు కేసీఆర్ ఆదేశం
  • రాజకీయాలతో సంబంధం లేకుండా చర్య తీసుకోవాలన్న సీఎం
  • ముందుగా టీఆర్‌ఎస్ వారిపైనే కేసులు పెట్టండి
  • కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించాలి.. ఇదివరకే నిర్మాణం చేసుకుంటే చివరి అవకాశంగా క్రమబద్ధీకరించండి
  • గడువులోగా ముందుకురాకపోతే స్థలాలు స్వాధీనం చేసుకోవాలి
  • వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
  • ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
  • గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాల పంపిణీకి నిర్ణయం
  • శ్రీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికీ భయపడేది లేదు. ప్రభుత్వ భూములు ప్రజలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి.    - కేసీఆర్
    సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా కబ్జాదారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన వారినైనా వదిలిపెట్టకూడదని చెప్పారు.

    కబ్జాలకు పాల్పడే వారిలో ముందుగా టీఆర్‌ఎస్‌కు చెందిన వారిపైనే కేసులు నమోదు చేసి ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భూము ల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగి ఉంటే ఆ స్థలాలను, భవనాలను క్రమబద్ధీకరించాలని, అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు వెంటనే మార్గదర్శకాలను రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించి, విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.

    ఇందుకు నిర్ణీత గడువు విధించాలని, ఇదే చివరి అవకాశంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకోని వారి నుంచి స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాపై గురువారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ముఖేష్‌కుమార్ మీనా, శ్రీధర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

    కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓపక్క ప్రభుత్వ అవసరాల కోసం స్థలాలు కరువైపోగా.. మరోపక్క వేలాది ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి పోతున్నాయంటూ విస్మయం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అధికారులకు నొక్కిచెప్పారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవని, కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

    సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన గతంలో ఏర్పాటైన కార్యదర్శుల స్థాయి కమిటీకే ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు చెప్పారు. సర్కారు భూముల పరిరక్షణ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు, లీజుదారులు, అసైన్డ్ భూముల వ్యవహరాల్లో అనుసరించాల్సిన విధి విధానాలను కమిటీ రూపొందించాలని సూచించారు. దీనిపై ఈ నెల 9న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. కార్యదర్శుల కమిటీ రూపొందించే చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు.

    ఇక మురికివాడల్లో నివసించే పేదలకు గౌరవప్రదమైన నివాసాలు కట్టించాలని, ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరానికి వలస వచ్చి గుడిసెలు వేసుకున్న వారిపట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గుడిసెల్లో నివాసముంటున్న రెండు లక్షల మందికి నీడ కల్పిస్తామన్నారు. అభాగ్యుల కోసం 50 నైట్ షెల్టర్లు నిర్మించాలని, నాలాలకు అడ్డంగా ఉన్న నివాసాలను తొలగించి వారికి మరోచోట స్థలం కేటాయించాలని అధికారులకు సూచించారు.
     
    కొందరికి గిట్టదు.. అయినా భయపడను

    పేదలు వేసుకునే గుడిసెలను వెంటనే తొలగిస్తున్న అధికారులు.. అక్రమంగా వెలసిన భవనాలను మాత్రం పట్టించుకోవడం లేదని సీఎం అన్నారు. ప్రభుత్వం, అధికారులు పేదల పక్షపాతిగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేసుకుని ఉంటే వాటిని క్రమబద్ధీకరించాలని, అందుకోసం ముందుకు రాని వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.

    ప్రజోపయోగం పేరిట భూములను తీసుకుని వ్యాపారం చేసుకుంటున్న వారిపైనా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల సంగతి కూడా తేల్చాలని ఉన్నతాధికారులకు నిర్దేశించారు. నకిలీ పత్రాలను సృష్టించి స్థలాలు కాజేస్తున్న వారి కేసుల విషయంలో అధికారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారి విషయంలో గత ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయని, కులం, ప్రాంతం, రాజకీయాల ఆధారంగా ప్రేమ చూపించాయని వ్యాఖ్యానించారు.

    ఇప్పుడు అలాంటి  వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. తప్పు చేసిన వారెవరైనా శిక్షపడాల్సిందేనని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికి భయపడేది లేదు. నాకు స్వప్రయోజనాలు లేవు. కచ్చితంగా ఉంటా. వెనక్కి తగ్గను. నన్నెవరూ ఒత్తిడికి గురిచేయలేరు. ప్రభుత్వ భూములు ప్రజోపయోగాలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. అదే నా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి’ అని అధికారులతో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement