కేసులు పెడితే.. ఖబడ్దార్
ముకరంపుర: ‘రైతులు, పేదలపై కేసులు పెడితే ఖబడ్దార్... పోలీసులూ తస్మాత్ జాగ్రత్త.. అనవసర కేసులు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్‌దే. రైతులకు అన్యాయం జరిగితే మేం చూస్తూ ఊరుకునేది లేదు’ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరెంటు కోతలు, రైతు ఆత్మహత్యలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ మండిపడ్డారు.‘సీఎం డౌన్‌డౌన్, టీఆర్‌ఎస్ డౌన్‌డౌన్, పంటలను ఆదుకోవాలి’ అంటూ చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది.
మధ్యాహ్నం 11 గంటలకు మొదలైన ఆందోళన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్, ఉపనేత షబ్బీర్ అలీతోపాటు జిల్లా ముఖ్యనేతలంతా పాల్గొని ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రైతులకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని కోరారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... కేసీఆర్ తప్పుడు ప్రచార కార్యక్రమాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి మూడేళ్ల వరకు కరెంటు సమస్య తప్పదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయారని, నాలుగు నెలల్లో జిల్లాలో 52 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా... ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేషన్‌కార్డులు తొలగించేందుకే ఆహారభద్రత కార్డులు ప్రవేశపెడుతున్నారని, అర్హుల్లో ఏ ఒక్కరి కార్డు తొలగించినా చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
7 గంటల కరెంటు ఇవ్వాలని రైతులు కోరితే కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు అధికారం కట్టబెట్టడం పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చిన చందంగా ఉందని అన్నారు. కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు కరెంటు లైన్ వేయాలంటే నక్సలైట్లు అడ్డుకుంటారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ జి.వివేక్ మాట్లాడుతూ.. సాధ్యం కాని వాగ్ధానాలతో అధికారంలో వచ్చిన టీఆర్‌ఎస్‌కు రైతాం గంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులను కోటీశ్వరులను చేయడమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుం జయం మాట్లాడుతూ.. రైతులను అష్టకష్టాలపాలు చేస్తున్న కేసీఆర్‌కు వారి ఉసురు తగలడం ఖాయమని అన్నారు. ఓ వైపు కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే బతుకమ్మ పండుగ పేరుతో కేసీఆర్ తన కూతురు కవితక రూ.10 కోట్లు బతుకమ్మ కట్నంగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. పంటనష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మాజీ విప్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ.. హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతాంగానికి అండగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామన్నారు.
మూడు వందల మంది అరెస్టు :ప్రతిమ మల్టీప్లెక్స్ చౌరస్తాలో పోలీసులకు, కాంగ్రె స్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో కార్యకర్తలు జీపును అడ్డుకోగా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలయ్యయాదవ్‌కు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. దీంతో జీపులో ఉన్న జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ కిందికి దిగి రోడ్డుపై బైఠాయించారు. రైతు సమస్యలపై ధర్నా చేస్తే లాఠీచార్జీ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లాలో ఉన్న డెప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం వీరిని పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో నాయకులు కేతిరి సుదర్శన్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, బొమ్మ వెంకన్న, ప్యాట రమేశ్, ఆమ ఆనంద్, కర్ర రాజశేఖర్, గందె మహేశ్, మాధవి, అంజనీప్రసాద్, గుగ్గిళ్ల జయశ్రీ, చాడగొండ బుచ్చిరెడ్డి, చల్ల నారాయణరెడ్డి, అంజన్‌కుమార్, దేవేందర్‌రెడ్డి, కె.లింగమూర్తి, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, పొన్నం సత్యం ఉన్నారు.