
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అకాల వర్షంతో రాష్ట్రం అతలాకుతలమైతే సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటామని కనీసం ధైర్యం కూడా చెప్పడం లేదని, పనికి మాలిన పథకాలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను ఆయన మంగళవారం పరామర్శించారు. నల్లగొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి, నల్లగొండ మండలాల్లో పర్యటించి, రైతులను కలసి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు.
కేవలం తిప్పర్తి మార్కెట్‌లోనే 30వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని, ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ స్థితి ఏర్పడిందని కోమటిరెడ్డి ఆరోపించారు. అయినా, సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటిదాకా స్పందించలేదని విమర్శించారు. నష్టపోయిన రైతుకు సాయం అందించాలని డిమాండ్ చేశారు.