komati reddy venkatreddy
-
‘కాంగ్రెస్ గెలవదు.. అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి.. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, సన్నిహితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు. నేను ప్రచారానికి వెళ్తే మహా అంటే కొన్ని ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతంగా ఎంపీగా గెలిచాను. దాదాపు 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. ప్రస్తుత రాజకీయాల గురించి నాకు తెలుసు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
సోనియా గాంధీతో కోమిటిరెడ్డి భేటీ
-
‘మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’
న్యూఢిల్లీ: తెలంగాణ గంగ మూసీ నదిని పరిరక్షించాలని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో భూగర్భ జాలాలు కలుషితమవుతున్నాయని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ నీటితో పండిన పంటలు తినడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. మూసీ నీరు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయని.. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఉపరాష్ట్రపతిని వెంకయ్యనాయుడిని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు జిరో ఆవర్‌లో లెవనెత్తినా కేంద్రం స్పందించలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారి చేయాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశామన్నారు. ట్రిట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, విరివిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసీని పరిరక్షించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
పగ్గాలు ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడి మార్పు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చర్చనీయాంశమవుతోంది. వాయిదాలు పడుతూ వస్తున్న ఈ విషయంలో ఈసారి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఉత్తమ్ స్థానంలో కొత్త నాయకుడిని నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తుండగా.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీతోపాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుందని, ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువనాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మేడమ్.. నేను వైదొలుగుతా! హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం వెలువడిన అనంతరం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాందీని కలిశారు. రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితులు, హుజూర్‌నగర్‌లో ఓటమికి కారణాలను వివరించడం తో పాటు తాను టీపీసీసీ అధ్యక్షుడిగా వైదొలుగుతానని ఆమెకు చెప్పారు. పార్టీని నడిపించేందుకు కొత్త నాయకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనే స్వయంగా అభ్యరి్థంచడంతో టీపీసీసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచి్చనట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ్‌కు అవకాశమిచ్చి ఒకట్రెండు రాష్ట్రాలకు ఇంచార్జిగా నియమించాలనే యోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. సామాజిక వర్గాలవారీగా సమీకరణలు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఢిల్లీ పెద్దల దృష్టికి ఇప్పటికే చాలామంది నేతల పేర్లు వెళ్లాయి. ఈ జాబితాలో ఎంపీ లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. హుజూర్నగర్ ఉప ఎన్నిక తర్వాత మాజీ మంత్రి జానారెడ్డి తెరపైకి వచ్చారు. ఆయ న్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అంశా న్ని అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కేడర్‌తోపాటు మాస్లో మంచి ఇమేజ్ ఉన్న రేవంత్, కోమటిరెడ్డిల పేర్లు కూడా అదేస్థాయిలో వినిపిస్తున్నాయి. రేవంత్‌కు రాష్ట్రంలో ఉన్న క్రేజ్‌ను బట్టి ఆయన్ను వ్యూహాత్మకంగా ముందుకు తేవాలనే ఆలోచన సోనియా, రాహుల్‌కు ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డిపై కూడా సోనియా, రాహుల్‌కు సానుకూలత ఉందని.. ఇద్దరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. సామాజిక వర్గాలవారీగా చూస్తే ఈసారి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే యోచన అధిష్టానానికి ఉందని, ఆ క్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్‌లను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. గ్రేటర్‌లోనూ మార్పు.. టీపీసీసీ అధ్యక్షుడితో పాటు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ స్థానంలో మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు, టీపీసీసీ కార్యదర్శి విక్రమ్‌గౌడ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్‌తో పాటు పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, మైనార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ‘‘సంబంధం లేదని వ్యక్తుల అప్పీల్‌ను విచారించడం మొదలుపెడితే సంబంధం లేని ప్రతి ఒక్కరూ అసెంబ్లీ నిర్ణయానికి మద్దతుగా, వ్యతిరేకంగా ఇలాంటి అప్పీల్లే దాఖలు చేస్తారు. బహిష్కరణ తీర్మా నం సభ నిర్ణయమంటున్నప్పుడు ఇలా అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరు అధికారమిచ్చారు? సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరముంటే అసెంబ్లీకి ఉండాలి. అప్పీల్ చేయాలంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి చేయాలి. ఎమ్మెల్యేలకు ఏం సంబంధముందని అప్పీల్ చేశారు?’’అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్‌కు అనుమతినివ్వాలా, వద్దా అన్న అంశంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరో సారి విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తీర్పుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గానీ, ప్రజాప్రయోజనాలకు గానీ ఎలాంటి నష్టమూ కలగలేదని కోమటిరెడ్డి తరఫున సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘ఈ వ్యవహారంలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నోటీసివ్వకుండా, ఎమ్మెల్యేల వాదన వినకుండా బహిష్కరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా, గవర్నర్ ప్రసంగం సభా కార్యక్రమాల కిందకు వస్తుందా వంటివి తేల్చాల్సి ఉంది. సింగిల్ జడ్జికి వీడియో పుటేజీ లివ్వలేదు. కానీ ఈ అప్పీల్‌కు మాత్రం ఫుటేజీని జత చేశారు. ఇవెక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. ఈ ఫుటేజీలు అసెంబ్లీ కార్యదర్శి సర్టిఫై చేసినవి కావు’’అన్నారు. ఫుటేజీలను స్పీకర్ ద్వారా తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. చానళ్లలో వచ్చిన ఫుటేజీని జత చేశామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ బదులిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద దాఖ లైన వ్యాజ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదని సింఘ్వీ గుర్తు చేశారు. ‘‘ప్రతివాదులైన ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయకుండా మౌనం వహించారు. వీడియో ఫుటేజీ సమర్పిస్తానని సింగిల్ జడ్జి వద్ద వాదనల సందర్భంగా ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. బహిష్కరణవల్ల పిటిషనర్లు నష్టపోయారు. కాబట్టి అప్పీల్ దాఖలుకు అనుమతివ్వకుండా పిటిషన్‌ను కొట్టేయండి’’అని కోర్టును కోరారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
కాంగ్రెస్ ఉంటే కాళేశ్వరం కట్టేదా!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాళేశ్వరం కట్టేదా, మొబిలైజేషన్ అడ్వాన్సులు, సర్వేలు, డిజైన్ల పేరుతో నిధులను దిగమింగారు. అధికారం ఉన్నా, లేకున్నా వారికి కుర్చీల కోసమే కొట్లాట. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పీసీసీ పదవి నుంచి దించి తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే డీకే అరుణ కొట్లాడుతున్నారు. ప్రజలు పచ్చగా ఉండటం వారికి పట్టదు. వారి ఇల్లు, కుటుంబం పచ్చగా ఉండాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం’అని కాంగ్రెస్‌పై భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజక వర్గాల్లో ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గాదరి కిశోర్ అధ్యక్షతన తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన జనహిత సభలో మంత్రి హరీశ్ మాట్లాడారు. ‘కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాడు నీలం తుపాన్ వల్ల నల్లగొండ జిల్లాకు నష్టం జరిగింది. అప్పట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు నీలం తుపాన్ పరిహారం ఇచ్చారు. కానీ నల్లగొండకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పంట పరిహారంపై కిరణ్‌కుమార్‌రెడ్డిని అడగలేదు. ఇద్దరు నేతలు ఎస్సారెస్పీ కాల్వ గట్లపై ఏనాడైనా తిరిగారా. నాడు పనులు ఆలస్యం కావడంపై ఎప్పుడైనా అధికారులతో చర్చించారా’అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో సూర్యాపేట సస్యశ్యామలం కాళేశ్వరం నీళ్లతో తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకే దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తొలుత కాళేశ్వరం నుంచి 26 టీఎంసీలు మిడ్‌మానేరుకు అక్కడ నుంచి కరీంనగర్ జిల్లా లోయర్ మానేరుకు అక్కడి నుంచి వరంగల్, సూర్యాపేట జిల్లాలకు ఈ నీళ్లు వస్తాయన్నారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో అవసరమైన చోట్ల రిజర్వాయర్లు కట్టడానికి ఆన్లైన్ సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ‘అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పారిపోతుంది’ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు పారిపోతున్నారని, చర్చలకు రమ్మన్నా రావడం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ ఉత్తమ్ బాబా 48 మంది దొంగల గుంపుతో యాత్రలు చేస్తున్నారన్నారు. ఈ సభలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, గిడ్డంగు సంస్థ చైర్మన్ మందుల సామేలు పాల్గొన్నారు. -
నేడు ఈసీని కలవనున్న కోమటిరెడ్డి, సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: శాసన సభ్యత్వాల రద్దు విషయంలో హైకోర్టులో ఊరట పొందిన తెలం గాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్‌ను శుక్రవారం ఢిల్లీలో కలవనున్నారు. అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తమ సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడం లాంటి పరిణామాలను ఆయనకు వివరించనున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కోమటిరెడ్డి, సంపత్‌లు రాహుల్గాంధీతోను భేటీ కానున్నారు. -
కనీసం ధైర్యం చెప్పలేరా!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అకాల వర్షంతో రాష్ట్రం అతలాకుతలమైతే సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటామని కనీసం ధైర్యం కూడా చెప్పడం లేదని, పనికి మాలిన పథకాలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను ఆయన మంగళవారం పరామర్శించారు. నల్లగొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి, నల్లగొండ మండలాల్లో పర్యటించి, రైతులను కలసి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. కేవలం తిప్పర్తి మార్కెట్లోనే 30వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని, ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ స్థితి ఏర్పడిందని కోమటిరెడ్డి ఆరోపించారు. అయినా, సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటిదాకా స్పందించలేదని విమర్శించారు. నష్టపోయిన రైతుకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు చేస్తోంది
కట్టంగూర్ (నకిరేకల్) : నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడతోందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషిచేస్తున్న కోమటిరెడ్డిని అణగదొక్కాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనపై కోర్టులో కేసు వాదనలో ఉండగానే గన్మెన్లను ఉపసంహరించుకోవడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. తీర్పు కోమటిరెడ్డికే అనుకూలంగా వస్తుందని.. దాంతో కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు పోగుల నర్సింహ, మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, పెద్ది సుక్కయ్య, వల్లపు శ్రీనివాసరెడ్డి, బీరెల్లి ప్రసాద్, పుట్ట నర్సింహారెడ్డి, ముక్కాముల శేఖర్, బొజ్జ శ్రీను, నోముల వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు. -
నా హత్యకు ప్రభుత్వం కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: తమ శాసనసభ సభ్యత్వాలను అప్రజాస్వామిక రీతిలో రద్దు చేశారని, రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తాము ఓటు వేసేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్‌ను కలసి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రాజ్య సభ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహ రిస్తున్న అసెంబ్లీ సెక్రెటరీ రాష్ట్ర ప్రభుత్వ తొత్తులా వ్యవహరిస్తున్నారని.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకో కుండానే రాజ్యసభ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారన్నారు. అంతేగాకుం డా తమ అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆరు వారాల వరకు ఎలాం టి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోమటిరెడ్డి, సంపత్‌ల వెంట కాంగ్రెస్ సీని యర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు. అనం తరం వారు మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తిపై ఓపీ రావత్ సానుకూలంగా స్పందిం చారని.. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుం టామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే.. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిని కోమటిరెడ్డి, సంపత్‌లు ప్రతిపాదించారని, కాబట్టి వారు ఓటు వేసేందుకు అర్హులని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల కారణం గా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోమటిరెడ్డి, సంపత్‌ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. ప్రజాప్రతి నిధుల చట్టంలోని సెక్షన్ 152 కింద ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని.. ఓటర్ల జాబితా నుంచి సభ్యులను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ ఆ నిబంధనను పాటించలేదన్నారు. అందువల్ల రిటర్నింగ్ అధికారిని మార్చాలని, కోమటిరెడ్డి, సంపత్‌లకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశమివ్వాలని ఎన్ని కల ప్రధానాధికారిని కోరామన్నారు. నా హత్యకు ప్రభుత్వం కుట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే తన గన్మన్లను ఉప సంహరించుకుందని, పాత కేసులన్నింటినీ తిరగదోడుతోందని పేర్కొన్నారు. ఒక్క కోమటిరెడ్డి పోతే వందల కోమటిరెడ్డిలు నల్లగొండ జిల్లాలో పుట్టుకొస్తారని.. వారందరినీ చంపుతారా అని ప్రశ్నించారు. -
కందులు కొనే దిక్కులేదు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: రాష్ట్రంలో ఈ సారి కంది పంట బాగా పండిందని, కానీ వీటిని కొనే దిక్కులేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కందులకు గిట్టుబాటు ధర లేక రైతులకు పంట సాగు ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమ బతుకులు బాగు పడతాయని రైతులు ఆశించారని, వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబంలోని నలుగురి బతుకులు మాత్రమే బాగున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రూ.లక్ష రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం రూ.లక్షను ఆరు విడతలుగా మాఫీ చేయడంతో అది వడ్డీకే సరిపోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు ఒకే సారి రుణ మాఫీ చేస్తామన్నారు. జగదీశ్‌రెడ్డిని మంత్రిగా గుర్తించడం లేదు.. జగదీశ్‌రెడ్డిని మంత్రిగా జిల్లా ప్రజలు గుర్తించడం లేదని, ఆయనకు జిల్లా మీద ఏమాత్రం అవగాహన లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆరే జగదీశ్‌రెడ్డిని మంత్రిగా గుర్తించడం లేదన్నారు. విద్యుత్ శాఖకు అవార్డులు వస్తే సీఎం ఆ శాఖ సీఎండీ ప్రభాకర్‌రావుకు స్వీట్లు తినిపించడమే ఇందుకు నిదర్శమన్నారు. గతంలో జరిగిన నూకా భిక్షం, మదన్‌మోహన్‌రెడ్డి హత్యకేసుల్లో మంత్రి ఉన్నారని, హత్యా రాజకీయాలను జగదీశ్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నాగారంలో వార్డు సభ్యుడిని గెలిపించుకోలేని సత్తా లేని వ్యక్తి తనను, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అంచనా ప్రకారం జగదీశ్‌రెడ్డికి టికెట్ రాదని, వచ్చినా డిపాజిట్ గల్లంతు అవుతుందని వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. -
కోమటిరెడ్డి అరాచకం వల్లే నల్లగొండ ఘటన: కర్నె
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఘటనపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకత్వం వల్లే ఈ ఘటన జరిగిందని, అల్లర్లకు కారణమైన కాంగ్రెస్ నాయకులు దొంగే దొంగ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బత్తాయి మార్కెట్ హామీపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒక సారి మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి మాట నిలబెట్టుకోకుండా రైతులను దగా చేశారని ఆరోపించారు. మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతుల నుంచి వినతి వచ్చిన వెంటనే మంత్రి హరీశ్‌రావు స్పందించి బత్తాయి మార్కెట్ మంజూరు చేశారని చెప్పారు. ఈనెల 16న మార్కెట్‌ను ప్రారంభించేందుకు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అక్కడకు చేరుకునేలోపే సూర్యాపేట, దేవరకొండ, మునుగోడు, భువనగిరి ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను కోమటిరెడ్డి అక్కడకు తరలించి పథకం ప్రకారం అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. మంత్రులు రాకముందే మార్కెట్‌కు శంకుస్థాపన చేసే ప్రయత్నం కూడా చేశారని విమర్శించారు. ఆయన అరాచక చర్యలను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. ఖమ్మం మార్కెట్లో రైతులను రెచ్చగొట్టి అక్కడా విధ్వంసం సృష్టించారని, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద హింసాత్మక సంఘటనలను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉత్తమ్‌పై కోమటిరెడ్డి ఫైర్
నకిరేకల్(నల్గొండ జిల్లా): నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ..తప్పుడు సర్వేలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించ వద్దని ఉత్తమ్‌కు సూచించారు. గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ 2019లో గెలుపొందలేదన్నారు. ముందు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఉత్తమ్‌కు కోమటి రెడ్డి సూచించారు. వచ్చే ఎన్నికల వరకు సీఎల్పీగా తానే ఉంటానని ఉత్తమ్ చెప్పుకోవడం పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎప్పుడు ఊడిపోతాయో ఎవ్వరికీ తెలియదు అని జోస్యం చెప్పారు. -
ప్రజల మనసు గెలిచినవాడే నాయకుడు
నేరేడుచర్ల, న్యూస్‌లైన్ : ప్రజల మనసు గెలిచిన వారే నిజమైన నాయకుడని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలో జరిగిన ఓ శుభకార్యానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ కూడలిలో కార్యకర్తలనుద్ధేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న విద్యార్థి అమరులను చూసి చలించి తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదలి 11రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానన్నారు. తాను వదలివేసిన మంత్రి పదవిని తీసుకున్న వారు రౌడీలతో తనను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులు వివాహానికి హాజరయ్యేందుకు వస్తే రౌడీలతో అడ్డగించడం చూస్తే మనం హుజుర్నగర్ నియోజకవర్గంలో ఉన్నామా.. పాకిస్తాన్లో ఉన్నామా.. అన్నది అర్థం కావడం లేదన్నారు. పోలీసులను, రౌడీలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేవారు కనుమరుగు కావడం ఖాయమన్నారు. దాడులు చేయించడం తన నైజం కాదని, పేదవారికి ఆర్థిక సహాయం చేయడం, పేద పిల్లలను చదివించడం, అభివృద్ధి పనులు చేయడం మాత్రమే తనకు తెలుసన్నారు. తనను నేరేడుచర్ల రాకుండా 40మందితోని అడ్డుకుంటే మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ పోకుండా 4 లక్షల మందితో అడ్డుకోవడం పెద్ద పనికాదన్నారు. తాను వదిలేసిన మంత్రి పదవి పొందడం వల్లే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ నియంతృత్వ పోకడలతో నాయకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారన్నారు. రాత్రి వేళ్లలో నాయకులను, అధికారులను బెదిరించడం నాయకుని లక్షణమా అన్నారు. రానున్న ఎన్నికలలో 50 వేల మెజారీటితో గెలుస్తానని గొప్పలు చేప్పుకునే వారిని 50వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలాంటి నాయకులు ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో ఇలాంటి నాయకులకు తగిన రీతిలో ప్రజలు బుద్దిచెప్పాలన్నారు. దేవుని దయతో తెలంగాణ అమరవీరులు, తాను చేసిన త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం తెలంగాణవాదుల విజయమన్నారు. 4కోట్ల తెలంగాణ ప్రజల అకాంక్షను నేరవేర్చేందుకే సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కోమటిరెడ్డి వెంట నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, మోతీలాల్, కొణతం సీతరాంరెడ్డి, గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మెడికల్ కళాశాల నిర్మాణానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌లో రూ 18 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అం తకు ముందు స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తనకు పదవులు ఆవసరం లేదని, ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాతో పాటు నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయించడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. గాంధీనగర్‌లోని నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్రతో, మోటర్‌బైక్‌పై ప్రయాణించి వార్డులో నెలకొన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, నాయకులు చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాతంగి సత్యనారాయణ, అబ్బగోని రమేష్, వేణు, శ్రీనివాస్, కాసరాజు వాసు, మార్త యాదగిరిరెడ్డి, మెరుగు గోపి, అంబర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. రాగ్యానాయక్ సేవలు మరువలేనివి మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు. రాగ్యానాయక్ 13వ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని గడియారం సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగాా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిధిగా పేరుగాంచిన రాగ్యానాయక్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేవరకొండలో ఏర్పాటు చేయనున్న రాగ్యానాయక్ విగ్రహానికి తనవంతుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.