కోమటిరెడ్డి అరాచకం వల్లే నల్లగొండ ఘటన: కర్నె
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఘటనపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకత్వం వల్లే ఈ ఘటన జరిగిందని, అల్లర్లకు కారణమైన కాంగ్రెస్ నాయకులు దొంగే దొంగ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బత్తాయి మార్కెట్ హామీపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒక సారి మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి మాట నిలబెట్టుకోకుండా రైతులను దగా చేశారని ఆరోపించారు. మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతుల నుంచి వినతి వచ్చిన వెంటనే మంత్రి హరీశ్‌రావు స్పందించి బత్తాయి మార్కెట్ మంజూరు చేశారని చెప్పారు.
ఈనెల 16న మార్కెట్‌ను ప్రారంభించేందుకు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అక్కడకు చేరుకునేలోపే సూర్యాపేట, దేవరకొండ, మునుగోడు, భువనగిరి ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను కోమటిరెడ్డి అక్కడకు తరలించి పథకం ప్రకారం అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. మంత్రులు రాకముందే మార్కెట్‌కు శంకుస్థాపన చేసే ప్రయత్నం కూడా చేశారని విమర్శించారు. ఆయన అరాచక చర్యలను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. ఖమ్మం మార్కెట్‌లో రైతులను రెచ్చగొట్టి అక్కడా విధ్వంసం సృష్టించారని, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద హింసాత్మక సంఘటనలను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.