పగ్గాలు ఎవరికో? | Race For TPCC President Post | Sakshi
Sakshi News home page

పగ్గాలు ఎవరికో?

Published Thu, Oct 31 2019 5:24 AM | Last Updated on Thu, Oct 31 2019 5:24 AM

 Race For TPCC President Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడి మార్పు వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చర్చనీయాంశమవుతోంది. వాయిదాలు పడుతూ వస్తున్న ఈ విషయంలో ఈసారి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే ఉత్తమ్‌ స్థానంలో కొత్త నాయకుడిని నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తుండగా.. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుందని, ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్‌ కు చెందిన ముగ్గురు యువనాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.

మేడమ్‌.. నేను వైదొలుగుతా!
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితం వెలువడిన అనంతరం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాందీని కలిశారు. రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితులు, హుజూర్‌నగర్‌లో ఓటమికి కారణాలను వివరించడం తో పాటు తాను టీపీసీసీ అధ్యక్షుడిగా వైదొలుగుతానని ఆమెకు చెప్పారు. పార్టీని నడిపించేందుకు కొత్త నాయకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనే స్వయంగా అభ్యరి్థంచడంతో టీపీసీసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచి్చనట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ్‌కు అవకాశమిచ్చి ఒకట్రెండు రాష్ట్రాలకు ఇంచార్జిగా నియమించాలనే యోచనలో ఢిల్లీ పెద్దలున్నారు.

సామాజిక వర్గాలవారీగా సమీకరణలు
టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఢిల్లీ పెద్దల దృష్టికి ఇప్పటికే చాలామంది నేతల పేర్లు వెళ్లాయి. ఈ జాబితాలో ఎంపీ లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి.  హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తర్వాత మాజీ మంత్రి జానారెడ్డి తెరపైకి వచ్చారు. ఆయ న్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అంశా న్ని అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కేడర్‌తోపాటు మాస్‌లో మంచి ఇమేజ్‌ ఉన్న రేవంత్, కోమటిరెడ్డిల పేర్లు కూడా అదేస్థాయిలో వినిపిస్తున్నాయి.

రేవంత్‌కు రాష్ట్రంలో ఉన్న క్రేజ్‌ను బట్టి ఆయన్ను వ్యూహాత్మకంగా ముందుకు తేవాలనే ఆలోచన సోనియా, రాహుల్‌కు ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డిపై కూడా సోనియా, రాహుల్‌కు సానుకూలత ఉందని.. ఇద్దరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. సామాజిక వర్గాలవారీగా చూస్తే ఈసారి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే యోచన అధిష్టానానికి ఉందని, ఆ క్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌.సంపత్‌కుమార్‌లను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం.

గ్రేటర్‌లోనూ మార్పు..
టీపీసీసీ అధ్యక్షుడితో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తారని గాం«దీభవన్‌ వర్గాలంటున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ స్థానంలో మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు, టీపీసీసీ కార్యదర్శి విక్రమ్‌గౌడ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్‌తో పాటు పీజేఆర్‌ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, మైనార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement