సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ‘‘సంబంధం లేదని వ్యక్తుల అప్పీల్‌ను విచారించడం మొదలుపెడితే సంబంధం లేని ప్రతి ఒక్కరూ అసెంబ్లీ నిర్ణయానికి మద్దతుగా, వ్యతిరేకంగా ఇలాంటి అప్పీల్లే దాఖలు చేస్తారు. బహిష్కరణ తీర్మా నం సభ నిర్ణయమంటున్నప్పుడు ఇలా అప్పీల్ దాఖలుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరు అధికారమిచ్చారు? సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరముంటే అసెంబ్లీకి ఉండాలి. అప్పీల్ చేయాలంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి చేయాలి.
ఎమ్మెల్యేలకు ఏం సంబంధముందని అప్పీల్ చేశారు?’’అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్‌కు అనుమతినివ్వాలా, వద్దా అన్న అంశంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరో సారి విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తీర్పుతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గానీ, ప్రజాప్రయోజనాలకు గానీ ఎలాంటి నష్టమూ కలగలేదని కోమటిరెడ్డి తరఫున సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘ఈ వ్యవహారంలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నోటీసివ్వకుండా, ఎమ్మెల్యేల వాదన వినకుండా బహిష్కరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా, గవర్నర్ ప్రసంగం సభా కార్యక్రమాల కిందకు వస్తుందా వంటివి తేల్చాల్సి ఉంది.
సింగిల్ జడ్జికి వీడియో పుటేజీ లివ్వలేదు. కానీ ఈ అప్పీల్‌కు మాత్రం ఫుటేజీని జత చేశారు. ఇవెక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. ఈ ఫుటేజీలు అసెంబ్లీ కార్యదర్శి సర్టిఫై చేసినవి కావు’’అన్నారు. ఫుటేజీలను స్పీకర్ ద్వారా తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. చానళ్లలో వచ్చిన ఫుటేజీని జత చేశామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ బదులిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద దాఖ లైన వ్యాజ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదని సింఘ్వీ గుర్తు చేశారు. ‘‘ప్రతివాదులైన ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయకుండా మౌనం వహించారు. వీడియో ఫుటేజీ సమర్పిస్తానని సింగిల్ జడ్జి వద్ద వాదనల సందర్భంగా ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. బహిష్కరణవల్ల పిటిషనర్లు నష్టపోయారు. కాబట్టి అప్పీల్ దాఖలుకు అనుమతివ్వకుండా పిటిషన్‌ను కొట్టేయండి’’అని కోర్టును కోరారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం?
Published Tue, May 1 2018 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment