సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పబడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ మీద కేసీఆర్‌కు నమ్మకం లేదు. ఇలాంటి నియంత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం. న్యాయ వ్యవస్థతో నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేసినట్టు, న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తాం. అసెంబ్లీ కార్యదర్శి.. సీఎస్‌లను కూడా బాధ్యులను చేస్తాం. సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుంది. రేపటి లోపల మా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి.’ అని ఆయన పేర్కొన్నారు.
మా నాయకత్వం స్పందించలేదు
మా సభ్యత్వాల రద్దు విషయంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి లకు చెప్పాను. మేము మా కోసం సభలో ఆందోళన చేయలేదు. అందరం రాజీనామా చేయాలి అనుకున్నాం. ఇప్పుడైనా.. రాజీనామాల మీద నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. సీఎల్పీ నేతగా మమ్మల్ని కాపాడుకోవాలి. పార్టీ నాయకులతో చర్చించి అందరం రాజీనామా చేద్దాం. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. కానీ రాష్ట్ర నాయకత్వం సరిగా స్పందించడం లేదు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు పట్టించుకోవటం లేదో వాళ్లనే అడగండి.
Comments
Please login to add a commentAdd a comment