సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చూస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిషికేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లుబాటు కాదని, సదరు గెజిట్ నోటిషికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ కేసులో మంగళవారం తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి.. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లు యధావిధిగా తమ పదవుల్లో కొనసాగొచ్చ’ని పేర్కొన్నారు. అదేసమయంలో నల్లగొండ, ఆలంపూర్ శాసన సభ స్థానాల్లో ఖాళీ ఏర్పడిందంటూ ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖ కూడా చెల్లుబాటు కాదని అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ తీర్పును వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ వర్గాలు హర్షాతిరేకం వ్యక్తం చేశాయి.
అది అసెంబ్లీ లోపలి వ్యవహారం కాదు: సాధారణంగా అసెంబ్లీ వ్యవహారాలకు సబందించిన కేసుల్లో జోక్యానికి నిరాకరించే హైకోర్టు.. కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌ల పిటిషన్‌పై మాత్రం భిన్నంగా తీర్పు చెప్పింది. ‘మార్చి 12 నాటి సంఘటన అసెంబ్లీ లోపలి వ్యవహారం కాదు. అసెంబ్లీ బయటి వ్యవహారం. కాబట్టే మేము స్పష్టమైన స్పష్టమైన తీర్పు ఇస్తున్నాం’ అన్న న్యాయమూర్తి.. ఇది దేశానికి దిశానిర్దేశం చేసే తీర్పుల్లో ఒకటని వ్యాఖ్యానించడం గమనార్హం.
అసలేం జరిగింది?: మార్చి 12న బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. విపక్ష కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి.. హెడ్‌సెట్‌ను పోడియం వైపు విసరడం, దీనికి మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకరించడం తదితర దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత విపక్ష ఎమ్మెల్యేల తీరును గర్హించిన ప్రభుత్వం.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దుచేయాలని, మిగతా వారిని సస్పెండ్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో ఈ మేరకు అసెంబ్లీ ఒక గెజిట్ నోట్‌ను విడుదలచేసింది. అయితే, గవర్నర్ ప్రసంగం సందర్భానికి సభా నియమాలు వర్తించవని, ఆ సమయంలో జరిగిన ఘటనలపై నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేగానీ, స్పీకర్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదించారు. ఆ మేరకు నోటిఫికేషన్ రద్దును కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. మార్చి 12 నాటి అసెంబ్లీ వీడియోలన్నీ కోర్టుకు సమర్పించాలని కోరగా, అందుకు ప్రభుత్వం వెనుకడుగువేసింది. చివరికి కాంగ్రెస్ సభ్యులకు ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment